Idream media
Idream media
తిరుపతి సీటుపై భారతీయ జనతా పార్టీ భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అక్కడ గెలుపుపై పార్టీలో తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో పార్టీ దూసుకెళ్తోంది. అక్కడ పార్టీలో జోష్ పెరిగింది దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు నుంచే. ఆ తర్వాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించిన దాని కంటే ఎక్కువ సీట్లే సాధించింది. ఇదే ప్రాతిపదికన ఏపీలో కూడా తిరుపతి లోక్ సభ లో గెలుపు కోసం బీజేపీ భారీగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలోనే మకాం వేసి ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంపైనా విమర్శలు ఎక్కి పెడుతున్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ బలంగా పాతుకుపోయింది. తిరుపతిలో కూడా ఆ పార్టీకి ఉన్న ప్రాభవం మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బయటపడింది. దీంతో ఇక్కడ సత్తా చాటాలంటే మరింత ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని సోము గుర్తించారు. ఆ మేరకు జనసేనతో దోస్తీ బలపడేలా వ్యూహాలు రచిస్తున్నారు. మొన్నటి వరకూ తిరుపతిలో బీజేపీ పోటీ చేస్తుందని డిక్లేర్ చేసిన సోము ఇప్పుడు మాట మారుస్తున్నారు. జనసేన – బీజేపీ చర్చించుకుని ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామని ప్రకటిస్తున్నారు. ఇందుకు కారణం… తిరుపతిలో బీజేపీ పోటీపై సోము ప్రకటన అనంతరం స్థానిక జనసేన నేతలు అసంతృప్తి వెళ్లగక్కడమే.
తిరుపతిలో బీజేపీ పోటీ చేస్తుందని సోము ఏకపక్షంగా ప్రకటించడంపై జనసేన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు కొద్ది రోజుల క్రితం అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన తిరుపతి నాయకులు డాక్టర్ పి.హరిప్రసాద్, రాందాస్ చౌదరి, కిరణ్‌రాయల్ మాట్లాడుతూ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం ఆయన వ్యక్తిగతమేనన్నారు. తిరుపతిలో ఎవరు పోటీ చేయాలన్నది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించేది గల్లీలో కాదని, ఢిల్లీలో అని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల తరఫున పోరాడడంలో తామే ముందున్నామని ప్రస్తావిస్తూ బీజేపీ కంటే జనసేన సంస్థాగతంగా బలంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు. పరోక్షంగా సోము వీర్రాజు ప్రకటనలపై జనసేన నాయకులు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వీర్రాజు తాజాగా లైను మార్చినట్లు కనిపిస్తోంది. బలంగా పాతుకుపోయిన వైసీపీని ఢీ కొట్టాలంటే ఆచితూచి అడుగులు వేయాలని, ఎక్కడా ఉద్రేకంగా మాట్లాడడం సరికాదని గుర్తించినట్లు కనిపిస్తోంది. జనసేన నేతల అసంతృప్తిని గుర్తించే సోము తన ప్రకటనపై పునరాలోచించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఒక వేళ బీజేపీ అభ్యర్థే పోటీలో ఉంటే జనసైనికులు ఎంత వరకూ సహకరిస్తారనేది తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా జనసేన – బీజేపీ మైత్రీపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.