iDreamPost
android-app
ios-app

కాంగ్రెసుతో ప్రశాంత్ కిషోర్ బంధం తెగిపోయినట్లేనా?

  • Published Oct 08, 2021 | 2:11 PM Updated Updated Oct 08, 2021 | 2:11 PM
కాంగ్రెసుతో ప్రశాంత్ కిషోర్ బంధం తెగిపోయినట్లేనా?

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెసుతో బంధం తెంచుకున్నారా.. ఆ పార్టీలో ఆయన చేరిక ఆగిపోయిందా.. అంటే కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా ప్రశాంత్ కిషోర్ లఖిమ్ పూర్ ఘటనపై చేసిన ట్వీట్ కాంగ్రెసును ఎత్తి పొడిచేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాంగ్రెసులో ఆయన చేరికపై కొన్నాళ్లుగా అటు ఆ పార్టీ నుంచి గానీ.. ఇటు పీకే వైపు నుంచి గానీ ఎటువంటి సంకేతాలు లేవు. మరోవైపు మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెసును ఇతర రాష్ట్రాల్లో విస్తరింపజేసే క్రమంలో కాంగ్రెసు నుంచే వలసలను ప్రశాంత్ కిశోరే ప్రోత్సహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కాంగ్రెసుతో ఆయన బంధం తెగిపోయిందన్న అనుమానాలను బలపరుస్తున్నాయి.

ఒక ఘటనతోనే బలపడిపోలేరు

ఉత్తరప్రదేశ్లోని లఖిమ్ పూర్ ఖేరిలో కేంద్రమంత్రి కుమారుడి నిర్వాకం.. 9 మంది మృతి చెందిన ఘటనలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక, రాహుల్ దూకుడుగా వ్యవహరించడం.. ప్రియాంక గృహ నిర్బంధం, అరెస్టు వంటి ఘటనలతో ఆపార్టీ మైలేజ్ పెంచుకోవడానికి ప్రయత్నించిన విషయాన్ని ప్రశాంత్ కిషోర్ పరోక్షంగా ప్రస్తావించారు. లఖిమ్ పూర్ ఘటనను ఆసరా చేసుకుని కొందరు అకస్మాత్తుగా బలపడిపోవాలని చూస్తున్నారని తన తాజా ట్వీట్ లో ఎత్తిపొడిచారు. వ్యవస్థాగత బలహీనతలు అంత సులభంగా సమసిపోవని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెసును ఉద్దేశించినవేనని అంటున్నారు.

Also Read : మమత కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తున్నారా? తృతీయ కూటమికి అది విఘాతమేనా

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేశంలో ఎన్డీయేకు, మోదీ నాయకత్వానికి వ్యతిరేకంగా బలమైన తృతీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రశాంత్ కిశోరే చొరవ తీసుకున్నారు. శరద్ పవార్ తదితరులతో మంతనాలు జరిపారు. కొత్త కూటమిలో కాంగ్రెసు కూడా ఉండాలని పీకే బలంగా వాదించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే సహకరిస్తానని కూడా ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకలతో జరిగిన చర్చల్లో పీకే కాంగ్రెసులో చేరితే బాగుంటుందన్న ప్రతిపాదన వచ్చినట్లు రెండు నెలల క్రితం వార్తలు వచ్చాయి. వాటిని ఖండించకపోవడం.. అదే సమయంలో పీకేను పార్టీలో చేర్చుకుంటే ఎటువంటి పదవి ఇవ్వాలన్నదానిపై రాహుల్ కాంగ్రెస్ ముఖ్యనేతలతో సమాలోచనలు కూడా జరపడంతో పీకే కాంగ్రెసు లో చేరడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు. ఆ విషయాన్ని కూడా ఎవరూ ప్రస్తావించలేదు.

టీఎంసీకి మద్దతుగా..

కాగా ఇటీవలి కాలంలో ప్రశాంత్ కిషోర్ పలువురు కాంగ్రెస్ నేతలను తృణమూల్ కాంగ్రెసులో చేరేలా చేస్తున్నారు. దేశంలో మోదీకి వ్యతిరేకంగా మరో కూటమిని నిర్మించడానికి ప్రయత్నిస్తున్న తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ.. ముందుగా తన పార్టీని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు గోవాపై దృష్టి సారించి బలమైన నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు ప్రధానంగా కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ ఆమెకు సహకరిస్తున్నారు.

Also Read : కాంగ్రెస్, బీజేపీల నేతలు టీఎంసీలోకి ఎందుకు వెళుతున్నారు..?

ఆయా రాష్ట్రాల్లో బలమైన కాంగ్రెసు నేతలతో మంతనాలు జరిపి టీఎంసీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. గోవా మాజీ సీఎం లూజినో ఫెలీరో, అసోం ఎంపీ సుస్మిత దేవ్ తృణమూల్లో చేరడం వెనుక పీకే కృషి ఉందంటున్నారు. అలాగే మేఘాలయాలోనూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ముకుల్ సంగ్మా, ఆయన అనుచరులతోను మాట్లాడి టీఎంసీలో చేరేందుకు ఒప్పించినట్లు సమాచారం. తాజాగా లఖిమ్ పూర్ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక, రాహుల్ దూకుడును ఎత్తి పొడిచేలా వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెసుతో పీకే అనుబంధం ముగిసిన అధ్యాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.