iDreamPost
android-app
ios-app

ధోనీని కాదు.. లాభం చూసుకోవాలి

  • Published Nov 15, 2020 | 2:19 AM Updated Updated Nov 15, 2020 | 2:19 AM
ధోనీని కాదు.. లాభం చూసుకోవాలి

ఏదైనా వ్యాపారం చేయదలిస్తే.. అందులో అనుభవం, నిర్వహణ పరమైన అంశాలపై పట్టు, మార్కెటింగ్‌ సదుపాయం ఉందా.. వచ్చే లాభం ఎంత తదితర విషయాలను చూసుకోవాలి. అంతే గానీ ధోనీ చేస్తున్నాడనో.. ఇంకో హీరో, హీరోయిన్లు చెప్పారనో వ్యాపారంలో పెట్టుబడులతో దిగితే ఆ తరువాత చేతులు కాల్చుకోవాల్సి వస్తుందంటున్నారు అనుభవజ్ఞులు.

క్రికెట్‌ నుంచి విరామం తీసుకుంటున్న ఇండియన్‌ క్రికెట్‌ స్టార్‌ యంఎస్‌ ధోని ఇప్పుడు కడక్‌నా«ద్‌ కోళ్ళ వ్యాపారం చేద్దామనుకుంటున్నాడట… ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వార్త హల్‌ఛల్‌ చేస్తోంది. ఇది ప్రచారం అవుతోన్నదే తడవుగా కడక్‌నా«ద్‌ కోళ్ళను గురించి గూగుల్‌ చేసే వారి సంఖ్య కూడా పెరిగిందట. నిన్న మొన్నటి వరకు సరికొత్త కోళ్ళ రకంగానే వీటిని గురించి సెర్చి చేసిన వారు. ఇప్పుడు ధోనీ కొంటున్నాడు కాబట్టి ఈ వ్యాపరం ఎలా ఉంటుంది? అన్న భావనలోనే సెర్చ్‌ చేస్తున్నట్టుగా ఇంటర్నెట్‌ వర్గాలు తేలుస్తున్నాయి.

కానీ ధోనీ మాత్రం ఎక్కడా ఈ విషయాన్ని స్వయంగా మాత్రం చెప్పిన దాఖలాల్లేవు. నిజానికి కడక్‌నా«ద్‌ కోళ్ళు మంచి పౌష్టికాహారంగా ఇప్పటికే నిపుణులు తేల్చి చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని జబువా ప్రాంతానికి చెందిన ఈ కోళ్ళు దేశంలోని ఇతర వాతావరణాలకు ఎంత వరకు తట్టుకుని పెరుగుతాయి? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే హర్యానా గేదెలు అంటూ అక్కడ్నుంచి పనిగట్టుకుని తీసుకువచ్చిన వాటిని ఇతర ప్రాంతాల్లోని రైతులు వాటికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేయలేక నానా పాట్లు పడడం ఇప్పటిక్కూడా పలువురురైతులు కథలు కథలుగా చెబుతుంటారు. హర్యానాకు దేశంలోని ఇరత ప్రాంతాలకు వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అక్కడిచ్చినన్ను పాలు ఆ గేదెలు ఇంకెక్కడా ఇచ్చిన దాఖలాల్లేవు. దీంతో రైతులు వాటిని పట్టించుకోవడం మానేసారు.

ఒక వేళ ధోనీ చేస్తున్నాడు కాబట్టి మనం కూడా అదే వ్యాపారం చేసేద్దాం అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే ఇదే రీతిలో గతంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేస్తున్నారు. గతంలో ఈము పక్షుల ఫారం అని, కుందేళ్ళ పెంపకం, పుట్టుగొడుగుల పెంపకం.. అంటూ అనేక వ్యాపారాలు జనం ముందుకొచ్చాయి. వీటిలో విజయవంతమైన వారు అంతంతమాత్రంగానే లాభాలు కళ్ళజూసిన విషయాన్ని ఉదహరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా మంది లక్షలాది రూపాయలను పొగొట్టుకుని అప్పులపాలైన వారు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారంటున్నారు.

అంతెందుకు నాటు కోళ్ళ వ్యాపారానికి ఇటీవలి కాలంలో మాంచి క్రేజ్‌ ఏర్పడింది. ప్రతి ఒక్కరు అటువైపే చూస్తున్నారు. కానీ ఇందులో ఖచ్చితంగా లాభాలు చూసామని చెప్పేవాళ్ళు అతి తక్కువ మందే ఉండడం గమనార్హం.

సదరు ప్రొడక్ట్స్‌కు మార్కెట్‌ను సృష్టించుకోవడంలో భాగంగా అనుసరించే వ్యాపార సూత్రాన్ని అనుసరించి ఆయా వస్తువుల ఉత్పత్తిదారులు ఆహా.. ఓహో అంటూ ప్రకటనలు గుప్పించడం, సెలబ్రిటీలతో యాడ్‌లు చేసి మీడియాలో వదలడం లాంటివి చేస్తుండడం సహజం. ఈ మాయను చూసి టెంప్ట్‌ అయితే మాత్రం జేబులకు చిల్లులు పడి ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోవడం ఖాయమని తేల్చేస్తున్నారు.

ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నప్పుడు అందులో మన అనుభవం, లాభనష్టాలు, నిర్వహణా పరమైన వ్యవహారాలపై పట్టు.. పెట్టుబడులు తదితర విషయాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని, అవసరమైతే అంతుకు ముందే సదరు వ్యాపారాన్ని చేసిన వారిని సంప్రదించి లోటుపాట్లు అడిగి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అంతే గానీ ధోనీ చేస్తున్నాడని.. ఇంకొకరెవరో చెప్పాడని దిగితే అంతే సంగతులంటున్నారు.