iDreamPost
android-app
ios-app

ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ ‘లెక్క’ తప్పింది..!

ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ ‘లెక్క’ తప్పింది..!

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు తాత్కాలికంగా పెండిగ్‌లో ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేయడం పంచాయతీ ఎన్నికల్లో తాజా అంశం. ఈ నిర్ణయం తీసుకోవడానికి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చెప్పిన కారణం.. ఆ రెండు జిల్లాల్లో ఎక్కువగా ఏకగ్రీవాలు అయ్యాయని. ఇంతకు మించి మరే కారణం ఆయన చెప్పలేదు. నిమ్మగడ్డ చూపించిన కారణం సహేతుకంగా ఉందా..? ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదా..? ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవం అవడం నేరమా..? తక్కువ సంఖ్యలో అయితే ఎస్‌ఈసీకి అభ్యంతరం లేదా..? ఇలాంటి ప్రశ్నలు ఎస్‌ఈసీకి ప్రజల నుంచి ఎదురవుతున్నాయి.

సరే ఎస్‌ఈసీ చెప్పిన కారణాన్ని పరిగణలోకి తీసుకుందామన్నా.. అది సహేతుకంగా లేదు. విజయనగరం మినహా మిగతా 12 జిల్లాలో తొలి విడత 3,249 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 454 పంచాయతీలు, అత్యల్ఫంగా నెల్లూరు జిల్లాలో 163 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆయా జిల్లాలో ఏకగ్రీవాల సంఖ్యను చూశారు గానీ.. ఎన్నికలు జరిగే పంచాయతీల సంఖ్యను పరిగణలోకి తీసుకోలేదు.

చిత్తూరు, గుంటూరు కన్నా.. ఎక్కువ శాతం పంచాయతీలు కర్నూలు, కడప జిల్లాల్లో ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లాలో 454 పంచాయతీలకు గాను 110 ఏకగ్రీవమయ్యాయి. ఇది మొత్తం పంచాయతీల్లో 24.22 శాతం. గుంటూరు జిల్లాలో 337 పంచాయతీలకు గాను 67 (19.88 శాతం) ఏకగ్రీవమయ్యాయి. అదే కర్నూలు జిల్లాలో 193 పంచాయతీలకు గాను 52 ఏకగ్రీవమయ్యాయి. ఈ మొత్తం ఎన్నికలు జరిగే పంచాయతీలలో 26.94 శాతం. కడప జిల్లాలో 206 పంచాయతీలకి 51 ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవ శాతం 24.75. ఈ గణాంకాలు ద్వారా చిత్తూరు, గుంటూరు కన్నా.. అత్యధిక ఏకగ్రీవాలు కర్నూలు, కడప జిల్లాలో జరిగాయని తెలిసిపోతుంది. చిత్తూరు, గుంటూరు జిల్లాలలో ఏకగ్రీవాల శాతం 24.22, 19.88 కాగా, ఇది కర్నూలు, కడప జిల్లాలో 26.94, 24.75 శాతం. మరి తాను చూపిన కారణం సహేతుకంగా ఉందా..? లేదా..? అనేది నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తనను తాను ఒకసారి ప్రశ్నించుకుంటే సమాధానం తెలుస్తుంది.

జిల్లాల వారీగా ఏకగ్రీవాల లెక్క ఇదీ..

జిల్లా     పంచాయతీల సంఖ్య    ఏకగ్రీవాల సంఖ్య    ఏకగ్రీవాల శాతం

శ్రీకాకుళం             321                    39                     12.14

విజయనగరం       –––                    –––                    –––

విశాఖ                   340                   44                     12.94

తూర్పుగోదావరి        366                  30                       8.19

పశ్చిమ గోదావరి       239                  41                      17.15

కృష్ణా                      234                  23                       9.82

గుంటూరు               337                 67                      19.88

ప్రకాశం                   227                 35                     15.14

నెల్లూరు                  163                 25                      15.33

చిత్తూరు                 454                110                      24.22

కడప                     206                 51                      24.75

కర్నూలు                193                 52                       26.94

అనంతపురం           169                 06                         3.55

అన్ని జిల్లాలను పరిశీలిస్తే.. ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగిన జిల్లాల్లో కర్నూలు మొదటి స్థానం, కడప రెండో స్థానంలో నిలుస్తున్నాయి. చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలుస్తున్నారు. అనంతపురం చివరి స్థానంలో ఉంది. మొత్తం మీద తొలి విడతలో 16.09 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.