iDreamPost
android-app
ios-app

ఆస్పత్రి కడదాం.. మీ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకుని రా : భర్త వేధింపులకు వైద్యురాలి బలవన్మరణం

  • Published May 29, 2022 | 8:49 AM Updated Updated May 29, 2022 | 8:49 AM
ఆస్పత్రి కడదాం.. మీ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకుని రా : భర్త వేధింపులకు వైద్యురాలి బలవన్మరణం

ఆస్పత్రి కడదాం.. మీ పుట్టింటి నుంచి ఇంకా డబ్బులు తీసుకుని రా.. అంటూ భర్త వేధిస్తుండటంతో భరించలేక నవవధువు బలవన్మరణం పాల్పడింది. ఈ ఘటన ఎల్బీనగగర్ లో జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నర్సాపూర్ కు చెందిన డా. వంగ భారతి (31) స్త్రీ వైద్య నిపుణురాలు. ఆమెకు గతేడాది డిసెంబర్ 9న కరీంనగర్లోని జమ్మికుంటకు చెందిన చిల్డ్రన్స్ డాక్టర్ కనకట్ట రమేష్ తో పెద్దలు వివాహం జరిపించారు. వివాహ సమయంలో రమేష్ కు ఎకరం పొలం, రూ.5 లక్షల నగదు, 20 తులాల బంగారం, ఇతర లాంఛనాలను కట్నంగా ఇచ్చారు.

వివాహం అనంతరం భారతి – రమేష్ లు ఎల్బీనగర్ సమీపంలోని సూర్యోదయనగర్లో కాపురం పెట్టారు. రమేష్ అత్తాపూర్లో ఉన్న బటర్ ఫ్లై చిల్డ్రన్స్ ఆస్పత్రిలో ఆన్ కాల్ పై ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజులు వీరు అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత రమేష్ కు అదనపు కట్నంపై ఆశ కలిగింది. ఇద్దరం కలిసి ఆస్పత్రి పెడదాం.. పుట్టింటి నుంచి ఇంకా డబ్బులు తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజూ మద్యం సేవించి హింసిస్తుండటంతో.. భరించలేక భారతి 15 రోజులక్రితం తన పుట్టింటికి వచ్చేసింది.

వారంరోజుల క్రితం పెద్దలు ఇద్దరికీ నచ్చజెప్పి కాపురానికి పంపారు. శుక్రవారం రాత్రి భారతికి తల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. శనివారం ఉదయం అల్లుడు రమేష్ కు ఫోన్ చేయగా.. తాను ఆస్పత్రిలోనే ఉన్నానని ఇంటికెళ్లి ఫోన్ చేస్తానని చెప్పాడు. ఇంటికెళ్లి చూస్తే.. భారతి విగతజీవిగా కనిపించింది. విషయం తెలిసిన భారతి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. భర్త వేధింపులు భరించలేకే తన కూతురు చనిపోయిందని తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు.