iDreamPost
iDreamPost
ఆయనో జిల్లా కలెక్టర్. ఎప్పుడూ బిజీగా ఉంటూ ఆ జిల్లాను అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లడంలో నిమగ్నమై ఉంటాడు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను జిల్లా ప్రజలందరికీ అందేలా ఆయన స్థాయిలో కష్టపడుతుంటారు. అంతేనా అనుకుంటే అంతకుమించే చెప్పుకోవాలి ఈ కలెక్టర్ సార్ గురించి..
కలెక్టరంటే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే చేతులు కట్టుకొని నిలబడాలి. వొంగి నమస్కారాలు చేసి తమ సమస్యలను చెప్పుకోవాలి. అప్పుడే ఆ కలెక్టరు దొరకి మన బాధ అర్థమవుతుందని. ఇదంతా గ్రామాల నుంచి వచ్చే సామాన్య ప్రజల మనస్సులో అనుకునేదంటే కచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే సగటు మనిషిగా మనకు కూడా ఇదే అభిప్రాయం ఉంది. చిన్న అటెండరు స్థాయి అధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఎవరి దగ్గరకు పని కోసం వెళ్లినా చేతులు కట్టుకొని వినమ్రుడిగా మాట్లాడటం మనకు అలవాటైపోయింది. చెప్పకోకూడదు కానీ పలువురు అధికారులు అధికారాన్ని చెలాయించే తీరుని బట్టి చాలా చోట్ల ఇదే స్టయిల్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి దాపురించింది.
అయితే రాయలసీమలోని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుది సపరేట్ అడ్మినిస్ట్రేషన్. ప్రజలంటే ఎంతో గౌరవం. ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి జిల్లా వాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న తాపత్రయం ఈ కలెక్టరు సారులో మనకు కనిపిస్తుంది. నిత్యం వందలాది మంది ప్రజలు ఆయన్ను ఎన్నో పనుల మీద కలుస్తుంటారు. అయితే ఆయన్ను కలిసే ప్రతి ఒక్కరికీ ఆయన చేసిన సూచనలు చూస్తే ఇట్టే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే సామాన్య ప్రజలు సామాన్యుడితో ఎలా మాట్లాడతారో కలెక్టరుతో కూడా అలాగే మాట్లడి తమ సమస్యలను అర్థమయ్యేలా చెప్పుకోవాలని ఆయన అభిప్రాయం. అప్పుడే ఎన్నో ఇబ్బందులతో తమ దగ్గరికి వచ్చే వ్యక్తికి పూర్తిగా స్వేచ్చగా తన ఇబ్బందులు చెప్పుకుంటారు. అందుకే ఆయన కార్యాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పుడు ఇది ఏర్పాటుచేశారు.
అందరికీ విజ్ఞప్తి.. ఈ కార్యాలయం మనందరిదీ. ఇక్కడి అధికారులను మీరు కలిసే సమయంలో చెప్పులు వదలాల్సిన అవసరం లేదు. చేతులు కట్టుకొని వంగి నిలబడాల్సిన పనిలేదు. సమస్యలను చెప్పుకునేటప్పుడు కన్నీళ్లు పెట్టుకోకండి. అధికారుల కాళ్లు మొక్కకండి అంటూ ఆయన ఓ పోస్టర్ అతికించారు.
ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని చదివిన ప్రతి ఒక్కరూ కలెక్టర్ సార్‌కు సెల్యూట్ చేస్తున్నారు. తామంతా ఏం చేస్తున్నామో అదే చేయొద్దని చెప్పి తమ మనసులు గెలుచుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఇలా తమకు చెప్తుండటంతో ఇక అధికార యంత్రాంగం కూడా తమ సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహించబోరని సంబరపడిపోతున్నారు. క్షేత స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను గ్రహించి ఇలా పోస్టర్ ఏర్పాటు చేసిన అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై సర్వత్రా ప్రశంశల వర్షం కురుస్తోంది. ఏదిఏమైనా పేద ప్రజలకు మంచి చేసే పనిలో ఒక భాగమైన ఇలాంటి చర్యలను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.