ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు మృతి

తమిళనాడు రాష్ట్రంలో ప్రతిపక్ష ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు 24 గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో డీఎంకే శ్రేణులు శోకసంద్రంలో మునిగాయి. గుడియాతం ఎమ్మెల్యే ఎస్.కథవరాయణ్ (58), తిరువత్తియూరు ఎమ్మెల్యే కేపీపీ స్వామి అనారోగ్యంతో కన్నుమూశారు.

గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో గుడియాతం ఎమ్మెల్యే కథవరాయణ్ బాధపడుతున్నారు.ఇటీవలే చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేయించుకొని చికిత్స పొందుతున్నారు.శుక్రవారం ఉదయం ఆరోగ్యం విషమించగా కథవరాయణ్ ను బతికించడానికి డాక్టర్లు శతవిధాల ప్రయత్నం చేశారు. అయితే డాక్టర్ల ప్రయత్నాలు విఫలమవడంతో ఆయన కన్నుమూశారు.

తిరువొత్తియూరు నియోజకవర్గం మాజీ మంత్రి, శాసనసభ్యుడు కేపీపీ సామి(57) గురువారం ఉదయం కన్నుమూశారు. కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న కేపీపీ సామి మూత్రాశయం ఐదు నెలలుగా సక్రమంగా పనిచేయక పోవడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స కూడా తీసుకున్నారు. తర్వాత తిరువొత్తియూరు దేవీకుప్పంలోని తన నివాసగృహంలోనే డయాలసిస్‌ తదితర చికిత్సలు డాక్టర్ల పర్యవేక్షణలో పొందుతున్నారు.ఈ పరిస్థితులలో గురువారం ఉదయం 6 గంటల సమయంలో గుండెపోటు రావడంతో వైద్యులు ప్రాథమిక చికిత్స చేస్తుండగానే ఆయన మృతి చెందారు.

2006 శాసనసభ ఎన్నికలలో గెలుపొందిన డీఎంకే ప్రభుత్వ హయాంలో కేపీపీ సామి మత్స్యశాఖ మంత్రిగా పనిచేసి జాలర్ల సంక్షేమానికి ఆయన విశేషంగా కృషి చేశారు.ఇక 2011లో అదే నియోజకవర్గంలో పోటీ చేసి అన్నా డీఎంకే అభ్యర్థి కుప్పన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. గత 2016లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ డీఎంకే తరఫున పోటీ చేసి రెండోసారి గెలిచారు
తమ పార్టీ ఎమ్మెల్యేల మృతి పట్ల డీఎంకే అధ్యక్షుడు, ఇతర కీలక నేతలు సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఒకరోజు వ్యవధిలో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలను కోల్పోవడంతో డీఎంకే శ్రేణులలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇద్దరూ ఎమ్మెల్యే మరణంతో అసెంబ్లీలో డీఎంకే బలం 100 నుండి 98కి పడిపోయింది.

Show comments