iDreamPost
iDreamPost
2022 కొత్త ఏడాదిలో మొదటి నెల గడిచిపోయింది. ఒక్క బంగార్రాజు తప్ప మిగిలిన సినిమాలన్నీ తీవ్రంగా నిరాశ పరిచాయి. మొన్న వచ్చిన గుడ్ లక్ సఖి మరీ దారుణంగా చాలా చోట్ల జీరో షేర్లను నమోదు చేసిందని ట్రేడ్ రిపోర్ట్. ఏదో బలవంతంగా నడుస్తున్నాయి కానీ రౌడీ బాయ్స్, హీరోల పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. ఒక్క బంగార్రాజు మాత్రమే హిట్ అనిపించుకుంది. అసలేమాత్రం పోటీ లేకపోవడం వల్ల విన్నర్ అయ్యింది కానీ లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేదన్న కామెంట్లు లేకపోలేదు. ఏది ఎలా సక్సెస్ కు కొలమానం వసూళ్లే కాబట్టి ఆ లెక్కలో చూసుకుంటే నాగార్జున అనుకున్న టార్గెట్ ని చాలా ఈజీగా చేరుకున్నారనే చెప్పాలి.
ఇక బాక్సాఫీస్ ఆశలన్నీ ఫిబ్రవరి మీదే ఉన్నాయి. మొదటి వారమే డబ్బింగ్ సినిమాలతో బోణీ కావడం నిరాశ కలిగించే అంశమే అయినా ప్రస్తుతానికి వేరే ఆప్షన్ లేదు. 4న రాబోతున్న విశాల్ ‘సామాన్యుడు’ మీద ఏమంత హైప్ లేదు. టాక్ వచ్చాక పెరుగుతుందేమో చూడాలి. సుదీప్ ‘కె3’ కూడా అదే రోజు బరిలో దిగుతోంది. ‘కోతలరాయడు’తో మరో మరో రెండు మూడు చిన్న సినిమాలు రేస్ లోకి వస్తున్నాయి. వీటి సంగతలా ఉంచితే అసలైన కిక్ మాత్రం 11న రిలీజ్ కాబోతున్న ‘ఖిలాడీ’తోనే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి మాత్రం టీమ్ ఆ డేట్ కే కట్టుబడి ఉంది. ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. అదే రోజు వచ్చే ‘డిజె టిల్లు’ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.
రాజశేఖర్ ‘శేఖర్’ ఇంకా డేట్ ని కన్ఫర్మ్ చేసుకోలేదు. ఎందుకో మరి నానుస్తున్నారు. శర్వానంద్ ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ 25న విడుదల కానుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి దీని మీద మంచి గురి ఉంది. అజిత్ ‘వలిమై’ 24న వచ్చే ఛాన్స్ ఉంది కానీ థియేటర్ల ఆంక్షల వల్ల ఇంకా నిర్ణయం తీసుకోలేదు. భీమ్లా నాయక్ వాయిదా దాదాపు కన్ఫర్మే. ఫ్యాన్స్ దానికి ప్రిపేర్ అయ్యి ఉండటం బెటర్. ఇవి కాకుండా ఇంకేవి ఫిబ్రవరికి లాక్ కాలేదు. పైన చెప్పిన వాటిలో సగం బాగా ఆడినా చాలు డిస్ట్రిబ్యూటర్లకు కొత్త ఉత్సాహం వస్తుంది. పాన్ ఇండియా సినిమాలన్నీ మార్చి లేదా ఏప్రిల్ లో వస్తున్నాయి కాబట్టి ఆలోగా వీటితో వర్కౌట్ చేసుకుంటే నెల గడిచిపోతుంది. చూద్దాం
Also Read : Naga Chaitanya : యూత్ హీరోలకు ఈ వేగం చాలా అవసరం