iDreamPost
iDreamPost
అధికారపక్షం రెచ్చగొట్టే ధోరణిలో ఉందని తెలిసినప్పుడు మరింత సంయమనం అవసరం. అందులోనూ అనుభవం గురించి ఉపన్యాసాలు దంచేసే నాయకుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ స్వయంగా చంద్రబాబు హద్దు మీరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్పీకర్ పోడియం వద్ద తానే భైఠాయించడం టీడీపీ ఎమ్మెల్యేలను కూడా అయోమయంలోకి నెట్టింది. తమ నాయకుడు నేలపై భైఠాయించిన తర్వాత తామేమి చేయాలన్నది అంతుబట్టక చాలామంది చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. అసెంబ్లీలో టీడీపీ తీరుని ఇది తేటతెల్లం చేస్తోంది. వ్యూహం లేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబు వైఖరిని చాటుతోంది. వైఎస్సార్సీపీ ధాటిని ఎదుర్కోలేని అసహన ప్రదర్శనగా కనిపిస్తోంది. పాలకపక్షం ముందు చేతులెత్తేసిన చందంగా ఉంది.
సహజంగా సభలో అధికారంలో ఎవరున్నప్పటికీ ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టే వ్యూహం రచిస్తారు. దానిని ఎదుర్కొంటూ పాలకపక్షాన్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా ప్రజల్లో ఆలోచన రేకెత్తించడం ప్రతిపక్షాల పనిగా ఉంటుంది. సభలో బలం రీత్యా ఎలానూ ఢీకొట్టలేం కాబట్టి తమ అభిప్రాయాలు, ప్రశ్నలు, సమస్యలను ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వాలను నిలదీయడం ప్రతిపక్షాల పనిగా ఉంటుంది. కానీ తాజాగా టీడీపీ వ్యూహాత్మక తప్పిదాలు అలాంటి అవకాశాలను చేజార్చుకుంటున్నాయి. వైఎస్సార్సీపీకి మరింత అవకాశం ఇచ్చేలా ఉంటుంది. అందుకు ప్రధాన కారణం చంద్రబాబు వైఖరేనని టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు తొలుత ఎమ్మెల్యేగా ఎన్నికయిన సభలోనే మంత్రిగా వ్యవహరించారు. తర్వాత 1989-94 మధ్యలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్టీఆర్ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కూడా కీలకంగా వ్యవహరించారు. తిరిగి 2004-14 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 2009 తర్వాత ఆయన ఆనాటి ప్రభుత్వాలకు కొన్ని సార్లు అండగా నిలిచిన అనుభవాలున్నాయి. దాంతో చంద్రబాబు పూర్తి ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన కాలం వైఎస్సార్ జమానాలో మాత్రమే. దాంతో సరిగ్గా పుష్కర కాలం క్రితం నాడు తండ్రిని ఎదుర్కొన్న సభ సాక్షిగా నేడు తనయుడితో ఢీకొట్టాల్సి వస్తోంది. ఇది చంద్రబాబు కి సాధ్యమవుతున్నట్టుగా కనిపించడం లేదు. ఒకనాటి తన రాజకీయ సహచరుడిగా వైఎస్ ని ఎదుర్కొని నిలబడిన చంద్రబాబుకి ఇప్పుడు జగన్ ని తట్టుకోవడం వల్ల కావడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. సభలో ఎంతగా లొల్లి చేసినా పాలకపక్షం వ్యూహాల ముందు అవి బెడిసికొడుతున్నాయి. చివరకు ప్రతిపక్ష నేతగా తొలిసారి వెల్ లోకి దూసుకెళ్లి ధర్నా చేసినా బాబుకి ఒరిగిందేమీ కనిపించడం లేదు.
టీడీపీ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు చంద్రబాబు వైఖరితో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరద సహాయం, రైతుల సమస్యలపై చర్చ సందర్భంగా అవకాశం కోసం ఎదురుచూసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి ఉన్నప్పటికీ హఠాత్తుగా ఎదురుదాడి చేయాలనే ప్రయత్నం బెడిసికొట్టిందని భావిస్తున్నారు. చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదాలతో చివరకు సభలో కూడా అధికార పార్టీకి అలుసుగా మారుతున్నామని వాపోతున్నారు. ఓ సీనియర్ ఎమ్మెల్యే ఆ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన మాత్రం తన ధోరణి మార్చుకునే ఆలోచన చేయడం లేదని తెలుస్తోంది. దాంతో టీడీపీ ఎమ్మెల్యేలే ఈ తీరు చూసి తలపట్టుకునే పరిస్థితి వచ్చింది.
ప్రతిపక్షాలకు ఉపయోగపడే వేదికగా ఉండాల్సిన సభా సమావేశాలు ఈసారి పూర్తిగా ప్రభుత్వ పక్షానికి క్రీడాస్థలంగా మారుతోంది. చంద్రబాబు నాయకత్వ వైఫల్యంతో ప్రతిపక్షంపాత్ర పేలవంగా మారిపోతోంది. ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికలుగా ఉండాల్సిన అసెంబ్లీకి కొంత చేటు తెస్తుందనే చెప్పవచ్చు. ప్రతిపక్షం సమర్థవంతంగా ఉంటే సభా సమావేశాలు మరింత ఆసక్తిగానూ, ప్రజానుకూలంగా ఉండేవి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడం విస్మయకరం.