iDreamPost
android-app
ios-app

ఉస్కో రాజా!

ఉస్కో రాజా!

డిస్కోరాజా కథ ఏంటంటే…

40 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక వ్యక్తికి, స్టెమ్‌సెల్స్‌ ద్వారా ప్రాణం పోస్తే ఏం జరుగుతుంది? అతను ఒక పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ అయితే ఇప్పుడు ఏం చేస్తాడు? వినడానికి ఆసక్తికరంగా వుంది కదా, చూడడానికే కష్టంగా వుంది. దీనికి కారణం దర్శకుడికి స్పష్టత లేకపోవడం. స్క్రిప్ట్‌ లెవల్లో ఇంట్రెస్టింగ్‌గా అనిపించే సైన్స్‌ ఫిక్షన్‌ కథ, స్క్రీన్‌ మీద అదే లెవల్లో రావాంటే దర్శకుడు చాలా కష్టపడాలి.

విఐ ఆనంద్‌ ప్రతిభావంతుడని ‘ఎక్కడికి పోతావు చినవాడా’ చెప్పింది. తరువాత ఒక్క క్షణం ఆడలేదు. ఈసారి రవితేజతో ప్రయోగం చేశాడు. సినిమా అంతటినీ భుజాల మీద మోసే శక్తి రవితేజకి వున్నా, కథ రొటీన్‌గా మారిపోవడం,ఫస్టాఫ్‌లో స్క్రీన్‌ప్లే తికమకగా వుండడంతో తేడా కొట్టేసింది.

కథని చందమామ కథలా చెప్పడం ఒక పద్ధతి. ‘రోబో’లో ఈ తరహా కథనం ఉంటుంది. ఒక రోబోని తయారుచేస్తే వచ్చే కష్టనష్టాల్ని ఎమోషనల్‌గా చెప్పడంతో ఆడింది. గుప్పిట మూస్తూ, తెరుస్తూ చేతిలో ఏముందో తెలుసుకునే క్యూరియాసిటీ కలిగించే పద్ధతి రెండోది. ఈ పద్ధతిలో క్లారిటీ మిస్సయితే, ప్రేక్షకుడు ఆలోచించడం మాని, సినిమా చూడడం కూడా మాని వాట్సప్‌ చూసుకుంటాడు.

డిస్కోరాజా కొన్ని సీన్స్‌లో రోబోని చూస్తున్నట్టు, మరికొన్ని సీన్స్‌లో ‘సాహసం`2’, ‘రణరంగం`2’ చూస్తున్నట్టు ఉంటుంది. ఎంతో కొంత రిలీఫ్‌ ఏమంటే సెకండాఫ్‌లో గ్యాంగ్‌స్టర్‌గా రవితేజ కొన్ని సీన్స్‌ అదరగొట్టాడు. అయినా అటుపోయి, ఇటుపోయి సినిమా చివరికి ఆవు వ్యాసంగా మారేసరికి ఉసూరుమనిపిస్తుంది.

మనం నూడిల్స్‌ వడ్డించి, ఒక్కొక్క నూడిల్‌ని వేరుచేసి తినమని చెబితే ఎలా ఉంటుంది. చిక్కు తీయడమే పెద్ద పని అనుకుంటే, అందులో మళ్లీ దారపు పోగు కూడా వుండి అడ్డం తగిలితే… డిస్కోరాజా ప్రేక్షకుల స్ధితి కూడా ఇదే.

కథ లడఖ్‌లో మంచులో ఛేజ్‌తో స్టార్టయితే ఇదేదో గూఢచారి క్రైం థ్రిల్లర్‌ అనుకుంటాం. కట్‌చేస్తే ఢిల్లీలో ఒక పెద్ద ఫ్యామిలీ వాళ్ల కష్టాలు, కట్‌చేస్తే మళ్లీ లడఖ్‌, కట్‌చేస్తే భరత్‌పూర్‌లో ఒక సైన్స్‌ ల్యాబ్‌ తరువాత చెన్నైలో ఒక డాన్‌. వీళ్లంతా ఎవరు? వీళ్లకీ ఈ కథకీ సంబంధం ఏమిటని ఆలోచించేలోగా వాసు అనే క్యారెక్టర్‌ హీరోగా వస్తాడు. ఫస్టాఫ్‌ వరకూ తికమకలో పెట్టి, ఇది డిస్కోరాజా అనే గ్యాంగ్‌స్టర్‌ కథ అని తేలుస్తారు. సెకండాఫ్‌ స్క్రీన్‌ మీద చూడాల్సిందే.

ఇంకో ప్రాబ్లం ఏమిటంటే సినిమా సీరియస్‌గా వున్నపుడు, కామెడీ సీన్స్‌ దూరుతూ వుంటాయి. దీంతో వున్న మూడ్‌ కూడా పోతుంది. సైన్స్‌ ఫ్లాష్‌బ్యాక్‌లు అన్నీ కలగాపులగం చేయకుండా వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబైలాగా డిస్కోరాజా, 1980లో చెన్నైలో ఒక గ్యాంగ్‌స్టర్‌గా ఎలా జీవించాడు అనే పాయింట్‌ మీదే నడిచినా కూడా బావుండేది. ఎందుకంటే సెకండాఫ్‌లో రెట్రోమూడ్‌ని డైరెక్టర్‌ ప్రజంట్‌ చేయగలిగాడు. ‘నువ్వు నాతో ఏమన్నావో’ పాట పిక్చరైజేషన్‌ కూడా మార్వలెస్‌.

ముగ్గురు హీరోయిన్లు వున్నా, ఎంతో కొంత పాయల్‌రాజ్‌పుత్‌ మాత్రమే గుర్తుంటుంది. మిగిలిన వారు వుండాంటే వున్నారు. వెన్నెల కిషోర్‌, సత్య కాసేపు నవ్విస్తారు. సునీల్‌ చాలాకాలానికి కాస్త గుర్తు పెట్టుకునే క్యారెక్టర్‌ చేశాడు.

బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతం. కార్తీక్‌ ఫొటోగ్రఫి బావుంది. రౌడీగ్యాంగ్‌లో బాషా అనే నటుడు డైలాగ్‌ డెలివరీ చాలా బావుంది. సరిగ్గా వాడుకుంటే అతను మంచి కమెడియన్‌ అవుతాడు. క్వింటిన్‌ టొరంటినో డైరెక్ట్‌ చేసిన ఇన్‌గ్లోరియస్‌ బాస్టర్డ్స్‌ సినిమా తరహాలో సెకండాఫ్‌లో చాప్టర్లుగా విభజించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌. కానీ సినిమా ప్రారంభం నుంచే ఆ తరహా స్క్రీన్‌ప్లేలో వెళితే బావుండేది.

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విలన్‌ బాబీసింహా గురించి. ఆయనో విలక్షణ నటుడు. అయితే కొన్ని వంద సినిమాల్లో చూసేసిన రొటీన్‌ విలన్‌ పాత్రలో ఇమిడ్చేశారు. కానీ వున్నంతలో పెర్ఫామెన్స్‌ చూపించాడు.

సైన్స్‌ ఫిక్షన్‌ తీయానుకుంటే అదే తీయాలి. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా అనుకుంటే అదే చేయాలి. రెండిరటినీ కలిపితే కషాయంగా మారుతుంది. ఎవరో ఏమిటో అర్ధం కావడానికే గంట పడితే, మిగిలిన కథ అర్థం చేసుకునే ఓపిక, ఈ ఫేస్‌బుక్‌, వాట్సప్‌ కాలంలో ఎవరికుంటుంది?

విలన్‌ని ఇరగదీస్తానని హీరో, నేనేంటో చూపిస్తా అని విలన్‌ వచ్చి ఇద్దరూ గాలిలో ఢీకొని ఇంకేదో చేస్తారనుకుంటే విలన్‌ పుసుక్కున చచ్చిపోతాడు. పోతూపోతూ ఇంకో విలన్‌ వున్నాడని చెబుతాడు. కుర్చీలోంచి లేస్తూ వుండగా ఇదో షాక్‌. సరే తప్పుతుందా అని కూచుంటే చూపించిన వూళ్లన్నీ చాల్లేదనుకుని గోవాకి తీసుకెళితే అక్కడ రియల్‌ షాక్‌ ఆడియన్స్‌కి. ఏంటో చూడాలనుకుంటే సినిమా చూడాల్సిందే. చూడకపోయినా, తెలుసుకోకపోయినా వచ్చే నష్టం కూడా ఏమీలేదు.

రవితేజకి కథ కుదరడం లేదు. ఫైట్స్‌, కామెడీ చేయకపోతే హీరోయిజం వర్కవుట్‌ కాదు. అవి వుంటే రొటీన్‌ అంటున్నారు. ‘సాహో’లో ఎవరు ఎవర్ని ఎందుకు చంపుకుంటారో అర్ధం కాలేదు. పెద్ద గ్రాఫ్‌ లేకుండానే డిస్కోరాజా వచ్చింది. దీంట్లో కూడా చాలామంది చచ్చిపోతుంటారు. ఎందుకో? ఒక సీన్‌లో రవితేజ బిర్యాని వండి వడ్డించి ఎలా వుంది అని అడుగుతాడు. ఉప్పు తగ్గిందని ఒక క్యారెక్టర్‌ అంటే వాడ్ని లేపేస్తాడు. ఏం తగ్గిందో చెప్పకపోయినా మనల్ని లేపేస్తాడు సీట్లోంచి.