iDreamPost
android-app
ios-app

దిశ కేసు క్లోజ్..??

దిశ కేసు క్లోజ్..??

దిశ కేసును ముగించేందుకు తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కేసుపై న్యాయస్థానంలో రిపోర్టు దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నలుగురు నిందితులు పోలీస్‌ కాల్పుల్లో చనిపోయిన విషయం తెలిసిందే. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కోసం తీసు కెళ్లగా పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో దాడికి పాల్పడి ఎదురు కాల్పుల్లో ఆరీఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు మృతి చెందారు.

అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులు చనిపోవడంతో వారిపై చార్జెస్‌ ఫ్రేమ్‌ చేసే పరిస్థితి లేకుండా పోయింది. చార్జిషీట్‌ కాకుండా కోర్టులో కేసుకు సంబంధించి రిపోర్టు దాఖలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టు ఉనికిలోకి రాకపోవడంతో షాద్‌నగర్‌ కోర్టులోనే ఈ నెలాఖరు నాటికి రిపోర్టు దాఖలు చేయనున్నారు.

షాద్‌నగర్‌ కోర్టులో రిపోర్టు దాఖలు చేసి కేసు క్లోజ్‌ చేసేందుకు అనుమతి కోరేందుకు స్థానిక పోలీసులు సిద్ధమవుతున్నారు. నిందితులు మృతి చెందడంతో తదుపరి దర్యాప్తు చేసే వీలు లేనందున కేసు క్లోజ్‌ చేసేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు తెలిసింది. తదుపరి దర్యాప్తునకు ఆస్కారం లేని పలు కేసుల్ని గతంలో పోలీసులు కోర్టు అనుమతితో క్లోజ్‌ చేశారు. దీంతో ప్రస్తుత కేసులోనూ అదే తరహాలో ముందుకెళ్ళానని పోలీసులు భావిస్తున్నారు.

కాగా, షాద్‌నగర్‌ పీఎస్‌లో దిశ మిస్సింగ్‌, కిడ్నాప్‌, హత్యాచారానికి సంబంధించి నమోదైన కేసు క్లోజ్‌ అయినా… నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన విచారణ వాస్తవాలు నిగ్గు తేలే వరకు కొనసాగనుంది. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్‌ ఈ వారంలో హైదరాబాద్‌కు వచ్చి విచారణ ప్రారంభించనుంది. ఆరు నెలల్లో కమిషన్ విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వనుంది.