నిమ్మగడ్డ పిటిషన్ పై నేటి నుంచి ప్రత్యక్ష విచారణ.. తీర్పు పై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై నేటి నుంచి రాష్ట్ర హైకోర్టులో ప్రత్యక్ష విచారణ జరగనుంది. ఈ పిటిషన్ పై ఇప్పటికే ఆన్లైన్ విచారణను ప్రారంభించిన రాష్ట్ర హైకోర్టు పిటిషన్ల తో సంబంధం లేని వ్యక్తులు ఆన్లైన్లోకి వస్తున్నారంటూ నేరుగా విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు మరికొంతమంది పిటిషన్లు దాఖలు చేయడంతో వారి తరఫు న్యాయవాదులు అందరికీ పాసులు జారీ చేయాలని ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు డిజిపి కి ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది.

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ప్రభుత్వానికి మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. రాష్ట్ర ప్రభుత్వం తో సంబంధం లేకుండా ఎన్నికలు ఏకపక్షంగా వాయిదా వేయడం, ఆపై తనకు రక్షణ లేదంటూ, ఎన్నికలు సజావుగా జరగడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో వివాదం మరింత ముదిరింది. నిమ్మగడ్డ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల కమిషనర్ పదవి లోనూ మార్పులకు శ్రీకారం చుట్టింది. పదవి కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్ల కుదించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి ని ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఆ మేరకు చెన్నై మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి వి. కనగరాజన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రస్తుతం పదవిలో ఉన్న తనకు వర్తించదని, తన తొలగించడం రాజ్యాంగ విరుద్ధమంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు సూచన మేరకు ఇరు పక్షాలు తమ అఫిడవిట్లు దాఖలు చేశాయి. గత నెల 28వ తేదీన ఈ పిటిషన్ పై ఆన్లైన్లో వాదనలు మొదలయ్యాయి. ఆన్లైన్లోకి ఒకేసారి పలువురు న్యాయవాదులు వస్తుండడంతో వాదన లో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర హైకోర్టు ప్రత్యక్షంగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టు తీర్పు ఏవిధంగా వస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Show comments