iDreamPost
android-app
ios-app

AP విద్యా విధానాన్ని ప్రధాని మెచ్చుకున్నారు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

AP విద్యా విధానాన్ని ప్రధాని మెచ్చుకున్నారు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం జగన్ వర్సిటీకి శంకుస్థాపన చేశారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో రూ.834 కోట్లతో ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీ పడతారని సీఎం జగన్ అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయంగా గిరిజినులకు ప్రాముఖ్యత ఇచ్చామన్నారు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా విధానాన్ని కొనియాడారు. అలాగే ఏపీ విద్యా విధానాన్ని ప్రధాని మోదీ కూడా మెచ్చుకున్న విషయాన్ని వెల్లడించారు. ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను అభినందించాలనుకుంటున్నాను, వారు ప్రత్యేకమైన పుస్తకాలు, ద్విభాషా పుస్తకాలను అభివృద్ధి చేశారు. అందులో ఒక పేజీలో కంటెంట్ ఆంగ్లంలో ఉంటుంది. మరో పేజీలో కంటెంట్ తెలుగులో ఉంటుంది. ఇదొక గొప్ప విద్యావిధానం.. మన ప్రధానమంత్రి కూడా ఈ మోడల్‌ను ప్రశంసించారు” అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు.

మరడాంలో బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. “మరో మూడేళ్లలో జాతికి అంకితం చేయబోయో మహోన్నత ప్రాజెక్ట్ ఇది. దీనిని దాదాపు రూ.830 కోట్లతో నిర్మిస్తున్నాం. ఇలాంటి ప్రాజెక్టును మంజూరు చేసినందుకు ఈ వేదిక పైనుంచి ప్రధాని మోదీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శంకుస్థాపన యూనివర్సిటీ మనకు.. 2014 విభజన హక్కుల ద్వారా వచ్చిన యూనివర్సిటీ ఇది. గిరి పుత్రుల జీవితాల్లో ఉన్నత విద్యా కాంతులు నింపేందుకు ఈ విశ్వవిద్యాలయం ఎంతగానో దోహదపడుతుంది. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీ పడేందుకు బీజం ఇక్కడి నుంచే పడుతుంది. గిరిజనుల జీవితాలను మార్చే విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో భావి ప్రపంచంతో అడుగులు వేసే క్రమంలో ఇంకా వెనకాలే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్ల పాలనలో విద్యా, వైద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా గిరిజనులను గుండెల్లో పెట్టుకుని అడుగులు వేశామని గర్వంగా చెబుతాను. తరతరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా బీసీ సోదరుల కోసం ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకు అన్ని దశల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం” అంటూ వ్యాఖ్యానించారు.