iDreamPost
iDreamPost
పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు రాష్ట్ర ఉన్నతాధికారుల నియామకాలపై ప్రభావం చూపుతున్నాయి. తొలుత సీఎం, పీసీసీ అధ్యక్షుల మార్పునకు కారణమైన పార్టీ విభేదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీనికి తోడు మూడు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో చోటుచేసుకున్న భద్రత వైఫల్యాలు కలిసి సుమారు వంద రోజుల్లోనే ముగ్గురు డీజీపీల మార్పునకు దారి తీశాయి. చివరికి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొన్ని గంటల ముందు కొత్త డీజీపీ నియామకం జరగడం విశేషం. యూపీఎస్సీ పంపిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ నుంచి వీరేష్ కుమార్ భావ్రాను కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ప్రభుత్వం నియమించింది. ఆ వెంటనే ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన భావ్రా రెండేళ్లు పదవిలో కొనసాగుతారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లలో వైఫల్యంతో ప్రస్తుత డీజీపీపై వేటు
ఇప్పటివరకు డీజీపీగా ఉన్న సిద్ధార్థ్ చటోపాధ్యాయపై అనివార్య పరిస్థితుల్లో ప్రభుత్వం వేటు వేయాల్సి వచ్చింది. ఈ నెల ఐదో తేదీన ఫిరోజ్ పూర్, బటిండా ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ అనుకోని పరిస్థితుల్లో హెలికాఫ్టర్ బదులు రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. అయితే బటిండా ఫ్లై ఓవర్ వద్ద ప్రధాని కాన్వాయ్‌ని రైతు సంఘాల ప్రతినిధులు దిగ్బంధించి సుమారు 20 నిమిషాలు అడ్డుకోవడం పెను సంచలనం సృష్టించింది. పంజాబ్ రాష్ట్ర వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర హోంశాఖ దీన్ని సీరియస్ గా పరిగణించి ఉన్నతస్థాయి విచారణ కమిటీని నియమించింది. విచారణకు హాజరు కావాలని ఈ కమిటీ పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ చటోపాధ్యాయ, భద్రత ఏర్పాట్లలో పాల్గొన్న ఇతర సీనియర్ అధికారులకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చటోపాధ్యాయను తప్పించి భావ్రాను కొత్త డీజీపీగా నియమించింది.
సిద్ధూ ఒత్తిడితో చటోపాధ్యాయ నియామకం
సిద్ధార్థ్ చటోపాధ్యాయ నెల క్రితం డిసెంబరులోనే డీజీపీగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ అధిష్టానంపైనా ఒత్తిడి తెచ్చి మరీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ చటోపాధ్యాయను డీజీపీగా నియమింపజేశారు. సిద్ధూతో విభేదాల కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పదవి నుంచి తప్పుకోవడంతో సెప్టెంబర్ 20న సీఎం బాధ్యతలు చేపట్టిన చరణ్ జిత్ సింగ్ చన్నీ.. ఆ వెంటనే రాష్ట్ర డీజీపీగా ఇక్బాల్ సింగ్ సహోతాను, అడ్వొకేట్ జనరల్‌గా ఏపీఎస్ డియోల్‌ను నియమించారు.
ఈ నియామకాలపై పీసీసీ అధ్యక్షుడు సిద్దూ తీవ్రంగా వ్యతిరేకించారు. 2015 నాటి గురుగ్రంథ సాహిబ్ అల్లర్ల కేసును నీరుగార్చడానికి వీరిద్దరూ ప్రయత్నించారని ఆరోపిస్తూ వారిని మార్చాలని పట్టుబట్టారు. లేనిపక్షంలో పీసీసీ పదవి నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని వారిని తప్పించాలని సీఎం చన్నీకి సూచించింది. ఆ మేరకు సిద్ధూ సూచించిన సిద్ధార్థ్ చటోపాధ్యాయను డీజీపీగా నియమించారు. ప్రధాని పర్యటనలో భద్రత లోపాలు ఆరోపణలతో ఆయన్ను తొలగించాల్సి వచ్చింది. మొత్తం మీదా చన్నీ సీఎం అయిన తర్వాత వంద రోజుల వ్యవధిలోనే ముగ్గురు డీజీపీలు మారారు.