iDreamPost
android-app
ios-app

Pushpaka Vimanam : పుష్పక విమానం – బ్రదర్స్ ప్రమోషన్ వ్యూహం

  • Published Nov 07, 2021 | 5:38 AM Updated Updated Nov 07, 2021 | 5:38 AM
Pushpaka Vimanam : పుష్పక విమానం –  బ్రదర్స్ ప్రమోషన్ వ్యూహం

స్టార్ హీరో బ్రాండ్ తో కుటుంబ సభ్యులను ఇండస్ట్రీలోకి దింపినంత ఈజీ కాదు వాళ్లకు ఇమేజ్ తేవడం. ఇక్కడ స్వయంకృషి అవసరమే అయినా వాళ్ళను సరైన రీతిలో జనంలోకి తీసుకెళ్లడం చాలా కీలకం. అంత పెద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోదరుడు శిరీష్ ని ఇప్పటికీ సెటిల్ చేయలేకపోయాడు. అల్లు అరవింద్ సైతం ఒక దశ దాటాక వదిలేశారు. గతంలోనూ చిరంజీవి నాగబాబుని ఇలాగే నిలబెట్టాలని విశ్వప్రయత్నం చేసి ఫెయిలయ్యారు. సరే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. జనాలు బయట కంటే సోషల్ మీడియాలో ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. సో అక్కడ సరిగ్గా టార్గెట్ చేస్తే మనం చేస్తున్న సినిమాలకు సంబంధించి పబ్లిక్ కు తెలుస్తుంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కోసం ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు. కేవలం అన్నయ్య ఫ్యాన్ బేస్ ని నమ్ముకుని దొరసానితో డెబ్యూ చేసిన ఆనంద్ కు తొలి అడుగే డిజాస్టర్ పడింది. రెండోది మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటిటిలో వచ్చినా సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. కానీ అది సరిపోలేదు. ఇప్పుడు మూడో మూవీ పుష్పక విమానం ఈ నెల 12న విడుదల కాబోతోంది. ట్రైలర్ ఆకట్టుకుంది కానీ భారీ ఓపెనింగ్స్ ని ఆశించలేం. కేవలం టాక్ మీద ఆధారపడాల్సిందే. బాగుందనే మాట వస్తే అప్పుడు ఆనంద్ ని పెద్ద తెరమీద చూసేందుకు ఇష్టపడతారు. దీని కోసం లైగర్ హీరో రంగంలోకి దిగాడు.

తమ్ముడితో కలిసి వరసగా సెల్ఫ్ ఇంటర్వ్యూలు చేస్తూ వాటిని యూట్యూబ్ లో పెట్టించి ట్విట్టర్, ఇన్స్ టా, ఫేస్ బుక్ లాంటి ప్లాట్ ఫార్మ్స్ ద్వారా ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు. తామిద్దరూ కలిసి మాట్లాడుకోవడమే అభిమానులకు పెద్ద కానుక అనే రేంజ్ లో వాటికి హడావిడి బాగానే జరుగుతోంది. అసలు ఏ ఇమేజ్ లేని ఆనంద్ కోసం కాకపోయినా తనను చూసేందుకైనా వాటిని ఓపెన్ చేస్తారని విజయ్ లెక్క. ఆ రకంగా తను కూడా నిర్మాణ భాగస్వామి అయిన పుష్పక విమానంకు బజ్ వస్తుందనే స్ట్రాటజీ ఇది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా తనే వచ్చేలా సెట్ చేసుకుని మొత్తానికి తమ్ముడికి ఎలాగైనా థియేట్రికల్ హిట్ ఇవ్వాలని కంకణం కట్టుకున్నాడు

Also Read : Oppressed Castes : కులవివక్ష సినిమాలు మనకు కొత్త కాదు