iDreamPost
android-app
ios-app

చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి

చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి

ఏపీ అసెంబ్లీ వద్ద ప్రతిపక్ష టీడీపీ సభ్యులకు మార్షల్స్ కు మధ్య జరిగిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఏకంగా అసెంబ్లీలో ఐదోరోజు మొత్తం ఇదే అంశంపై చర్చ నడిచింది. గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మార్షల్స్‌తో వాగ్వాదం సభలో ప్రస్తావనకు వచ్చింది. అధికార, ప్రతిపక్షాల పార్టీల మధ్య భారీ స్థాయిలో మాటలయుద్ధం జరిగింది.

మార్షల్స్‌తో టీడీపీ సభ్యుల వాగ్వాదానికి సంబంధించిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు. ఈ ఘటనపై భద్రతా సిబ్బంది తమపట్ల వ్యవహరించిన తీరుపట్ల అసెంబ్లీలో తెలుగుదేశం నిరసన తెలిపింది. అసెంబ్లీ వద్ద చంద్రబాబు, ఎమ్మెల్యేలను సెక్యూరిటీ అడ్డుకున్నారని,నల్లబ్యాడ్జీలు పెట్టుకుంటే అభ్యంతరం చెప్పారని, ప్రతిపక్ష నేత చేయి పట్టుకుని చీఫ్ మార్షల్ లాగేశారని అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పేపర్లతో సభలోకి వస్తుండగా మార్షల్స్ తనను బయటికి తోసేశారని ఆరోపించారు. సభ్యుడిగా ఉన్న తనను తోసేసిన మార్షల్‌పై చర్యలు తీసుకోవాలని, సభా మర్యాదలు కాపాడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ తనపై విమర్శలు చేయడం తగదని, పులివెందుల పంచాయితీ అసెంబ్లీలో పనిచేయదన్నారు.

అనంతరం టీడీపీ నేతలకు, మార్షల్స్ కు జరిగిన వివాద వీడియోలను ప్రదర్శించారు. ఈ అశంపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు అసెంబ్లీ మార్షల్స్‌ పట్ల అమానుషంగా ప్రవర్తించారని, ఆయన రావలసిన గేటు అది కాదని, అలాంటపుడు ఆ గేటు నుంచి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. మార్షల్స్ వారి విధుల్ని నిర్వర్తింస్తుంచారని వెల్లడించారు. చంద్రబాబు మార్షల్స్‌పై ఇష్టానుసారంగా దుర్భాషలాడారు, దాడికి పాల్పడ్డారు.. ప్రభుత్వ ఉద్యోగిని బాస్టర్డ్ అని చంద్రబాబు తిట్టారని.. లోకేష్ అధికారుల గొంతు పట్టుకుని దౌర్జన్యానికి దిగారన్నారు. మంత్రులు బుగ్గన, కన్నబాబు, పలువురు సభ్యులు దీనిని ఖండించారు.

ఏపీ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదని, ఉద్యోగుల్ని ఇష్టం వచ్చినట్లు తిట్టి దాడి చేశారని, ఈఘటనపై టీడీపీ సభ్యులకు పశ్చాత్తాపం కూడా లేదన్నారు. మళ్లీ వాళ్లే ఎదురుదాడి చేస్తున్నారని.. టీడీపీ సభ్యులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలు మాత్రమే రావాలని మిగిలినవారిని ఎందుకు తీసుకొచ్చారని మార్షల్స్ అందుకే అడ్డుకున్నారని తెలిపారు. మండలిలోనూ మార్షల్స్ ఘటనపై దద్దరిల్లింది. అయితే ఈవివాదంపై ఉద్యోగులు స్పందించారు. అసెంబ్లీ మార్షల్స్‌ పట్ల మాజీసీఎం చంద్రబాబు నాయుడు అనుసరించిన వైఖరి బాధాకరమని, తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ఉద్యోగ వర్గాలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ఏపీఎన్జీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగ సంఘాల విషయంలో తలదూర్చవద్దని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రకటించడాన్ని చంద్రశేఖరరెడ్డి ఖండించారు.