ఈ భూమి మీద వేల కట్టలేని ప్రేమ అంటే కేవలం తల్లిదండ్రులది మాత్రమే. కారణం.. బిడ్డలపై వారు పెంచుకున్న ప్రేమకు సరిసమానమైనది ఏమి లేదు. బిడ్డల విషయంలో తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. చదువు మొదలు పెళ్లిళ్ల వరకు.. ప్రతి విషయంలో బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అయితే కొందరు పిల్లలు మాత్రం… తల్లి దండ్రుల ఇష్టాలకు వ్యతిరేకంగా పెళ్లిళ్లు చేసుకుంటారు. అలాంటి వారి విషయంలో తల్లిదండ్రులు దారుమైన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఓ దంపతులు.. తమ కుమార్తె బతికుండగానే కర్మకాండలు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లా అంఖేరా గ్రామానికి చెందిన ఓ దంపతులకు అనామిక దూబె (25) అనే కుమార్తె ఉంది. ఆ దంపతులు తమ కుమార్తెను పాతికేళ్లు కష్టపడి అల్లారుముద్దుగా పెంచారు. తమ బిడ్డను బాగా చదవించింది.. మంచి ఉన్నతమైన స్థితిలో చూడాలని వారు కలలు కన్నారు. అయితే, ఆ యువతి మాత్రం ప్రేమలో పడింది. అదే గ్రామానికి చెందిన మహ్మద్ అయాజ్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం అనామిక ఇంట్లో వాళ్లకు తెలియడంతో ఆమెను మందలించారు. అయితే, ఆ యువతి.. వారికి ఎదురు తిరిగింది. అతడినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. దీంతో అల్లారు ముందుగా పెంచుకున్న బిడ్డ ఎదురు చెప్పడంతో వారి మనస్సు విరిగిపోయింది.
తల్లిదండ్రులు పెట్టిన పేరును వదిలేసి ఉజ్మా ఫాతిమాగా పేరు మార్చుకుంది. అదే పేరుతో పెళ్లి కార్డు కూడా ముద్రించింది.అందులో ఆ పేరు కింద తన తల్లిదండ్రుల పేర్లను యథావిధిగా ప్రింట్ చేయించింది. దీంతో ఆ పెళ్లి కార్డు వైరల్ అయ్యింది. తమ మాటను ఎదిరించి అన్య మతస్థుడిని పెళ్లి చేసుకుని ఆ తల్లిదండ్రులకు ఆగ్రహాన్ని తెప్పించింది. కోపంతో వారు తమ కూతురు చనిపోయిందంటూ.. కర్మకాండలు జరిపించారు. ఆదివారం (జూన్ 11) గౌరీ ఘాట్‌లో అనామికకు పిండప్రదానం చేసి నర్మదా నదిలో కలిపేశారు ఆమె తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.