iDreamPost
android-app
ios-app

పాక్ టీమ్ పై కనేరియా సంచలన కామెంట్స్.. మతం మారాలని హింసించారంటూ..!

  • Author Soma Sekhar Published - 01:23 PM, Tue - 17 October 23
  • Author Soma Sekhar Published - 01:23 PM, Tue - 17 October 23
పాక్ టీమ్ పై కనేరియా సంచలన కామెంట్స్.. మతం మారాలని హింసించారంటూ..!

వర్ణ వివక్ష, జాతి వివక్షతో పాటుగా.. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న సమస్యల్లో మత మార్పిడి కూడా ప్రధానమైనది. సామాన్య ప్రజలే కాదు.. ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఈ వివక్షను ఎదుర్కొన్న వారే. అందులో తానూ ఉన్నానంటున్నాడు పాకిస్థాన్ మాజీ ఆటగాడు, స్టార్ స్పిన్నర్ డానిష్ కనేరియా. తాజాగా అతడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా.. క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాశంగా మారింది. పాకిస్థాన్ క్రికెటర్లు తనను మతం మారాలని హింసించారని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

డానిష్ కనేరియా.. పాకిస్థాన్ టీమ్ కు ఆడిన తొలి హిందూ ఆటగాడు అయిన అనిల్ దల్ పత్ మేనల్లుడే ఈ డానిష్ కనేరియా. ఇక ఇతడు 2000 నుంచి 2010 వరకు పాక్ జట్టు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్ లో 61టెస్టులు, 18 వన్డేలు ఆడి 276 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉండగా తాజాగా పాక్ టీమ్ లో ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న వివక్షపై సంచలన నిజాలు బయటపెట్టాడు కనేరియా. ఇందుకు సంబంధించి పాక్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్, శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్షాన్ తో మత మార్పిడి గురించి చెబుతున్న వీడియోను కనేరియా ట్విట్టర్ లో షేర్ చేశాడు. తాను కూడా ఇలాంటి వివక్షను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చాడు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే? “నువ్వు ముస్లిం కాకపోతే.. ముస్లింగా మారిపో. నీ జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు. డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తావ్”అంటూ దిల్షాన్ తో అహ్మద్ షెహజాద్ చెప్పాడు. దానికి దిల్షాన్ కూడా ఏదో చెప్పుకొచ్చాడు. చివర్లో మంటను ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండు అని దిల్షాన్ ను హెచ్చరించాడు షెహజాద్. ఇక ఈ వీడియో షేర్ చేసిన కనేరియా.. “నేను డ్రస్సింగ్ రూమ్ లో, గ్రౌండ్ లో, డైనింగ్ టేబుల్ దగ్గర ఇలాంటి వివక్షను, బెదిరింపులనే ఎదుర్కొన్నాను” అని రాసుకొచ్చాడు. డానిష్ కనేరియాను మతం మారాల్సిందిగా ప్రతి రోజూ పాక్ క్రికెటర్లు ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. కనేరియా ఒక్కడే కాదు మిగతా జట్లలో కూడా ఇదే విధంగా వర్ణ, జాతి వివక్షను ఎదుర్కొన్న ఆటగాళ్లు ఉన్నారు. సౌతాఫ్రికా జట్టు సారథి టెంబా బవుమా, ఆసీస్ స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాలు కూడా వివక్షను ఎదుర్కొన్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. మరి డానిష్ కనేరియా పాక్ క్రికెటర్లపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.