Idream media
Idream media
ప్రచారం కోసం కార్యకర్తల ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారు నెల్లూరు టీడీపీ నేతలు. ప్రభుత్వానికి నిరసన సెగ తగిలేలా చేయాల్సింది పోయి.. కార్యకర్తలకు మంటల సెగ తగిలేలా వ్యవహరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ విపక్ష నేతలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేయడం తప్పు కాదు కానీ.. అనాలోచితంగా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనిపై విపక్షాలు పలు చోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెల్లూరు లో చేపట్టిన నిరసన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ నిరసన విధానం చూసి అంతా షాక్ అయ్యారు. ఏమాత్రం తేడా వచ్చినా నిరసనలో పాల్గొన్న కార్యకర్తల అందరి ప్రాణాలు ప్రమాదంలో పడేవే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు విషయానికి వస్తే.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నెల్లూరులో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపడదాం అనుకున్నారు. నెల్లూరు పట్టణంలో రద్దీగా ఉండే గాంధీబొమ్మ సెంటర్ లో గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్త తరహా పోరాటానికి తెర లేపారు. రోడ్డుపై వలయాకారంలో నిలుచుకున్న పార్టీ శ్రేణులు.. తమ చుట్టూ గుండ్రంగా మంటలు అంటించుకున్నారు. ఆ మంట మధ్యలో కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మంటల నుంచి ప్రజలను కాపాడాలంటూ నినదించారు.
మంటలు పైకి ఎగిసిపడడంతో దట్టమైన పొగ విరజిమ్మింది. అయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆందోళనను కొనసాగించారు. సుమారుగా 15 నిమిషాల పాటు చుట్టూ మంటలు వేసుకుని మంటల మధ్యలో కోటంరెడ్డి సహా, ఇతర కార్యకర్తలు నిల్చున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. అనుభవం లేని పాలన వల్లే రాష్ట్రానికి ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు. పనిలో పనిగా చంద్రబాబు నాయుడు ను పైకి ఎత్తుతూ, జగన్ ను తిడుతూ నిరసన బాగానే కొనసాగించారు కానీ.. నిరసన చేపట్టిన విధానం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. పేరు కోసం మంటల మధ్యలో నిరసనలు చేపట్టడం వంటికి మంచికాదని పలువురు సూచిస్తున్నారు. పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు రావడంతో ప్రాభవం కోసం ఇటువంటి దుశ్చర్యలు తగవని పేర్కొంటున్నారు.