iDreamPost
android-app
ios-app

హైకోర్టు తీర్పు దురదృష్టకరం – ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్

హైకోర్టు తీర్పు దురదృష్టకరం – ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్

దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఎఫ్ఐఆర్లోని విషయాలను రాయొద్దంటూ మీడియాను, సోషల్ మీడియాను నియంత్రిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) ఓ ప్రకటన విడుదల చేసింది. ఎఫ్ఐఆర్ లోని వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రసారం చేయరాదని ఆదేశాలు జారీ చేయడం ఓ దురదృష్టమైన చర్యగా ఐజేయు అభిప్రాయపడింది.

Also Read:సామాన్యుడికి కూడా ఈ హక్కు ఇస్తారా? హైకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు

గత ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన పీటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఏసీబీ విచారణపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లోని వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రసారం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై జాతీయ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఏజీగా పని చేసిన వ్యక్తిపై ఏసీబీ కేసు విషయాలను బహిర్గత పరచరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంపై ఐజేయు విచారాన్ని వ్యక్తం చేసింది. హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం మీడియా హక్కులను కాలరాయడమే గాక ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందని ఐజేయు అభిప్రాయపడింది.

హైకోర్టు ఈ నిర్ణయం వెలువరించకముందే పలు మీడియా ఛానల్స్ ఈ విషయాలను బహిరంగపరిచాయని ఐజేయు స్పష్టం చేసింది. బుధవారం ఐజేయు అధ్యక్షుడు కే శ్రీనివాస రెడ్డి, సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ ఓ ప్రకటన విడుదల చేసారు, ఫోర్త్ ఎస్టేట్ హక్కులను కాలరాస్తూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయపడ్డారు. సమాజానికి ఉపయోగపడుతూ సమాచారాన్ని అందించే మీడియాని నియంత్రించాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే అంటూ వారు ఈ ప్రకటనలో తెలిపారు. మీడియా గొంతు నొక్కడం లాంటి చర్యలను చేపట్టరాదని విజ్ఞప్తి చేశారు.

Also Read:విచారణ నిలిపివేయండి, వివరాలు మీడియాలో వద్దు

ఎఫ్ఐఆర్ లో విషయాలను బహిరంగపరచరాదని కోర్ట్ తీర్పులు ఇవ్వడం నిందితులకు లబ్ది చేకూరుతుందని ఐజేయూ నాయకులు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రజలలో అనుమానాలకు ఇది దారి తీస్తుందని వెల్లడించారు. కోర్టులపై నమ్మకం సడలకుండా ఉండాలంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోరాదని కోరారు. మీడియాను నియంత్రించే విషయంలో హైకోర్ట్ తమ తీర్పును పున: సమీక్ష జరుపుకుంటుదని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.