iDreamPost
iDreamPost
ఏపీ, తెలంగాణాలో బలపడాలని బీజేపీ చాలాకాలంగా తహతహలాడుతోంది. కానీ తెలుగు నాట ఆపార్టీకి రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంటోంది. ఇప్పటికే కొన్ని సార్లు బలపడ్డామని మురిసిపోయిన వెంటనే మళ్లీ బీజేపీకి ఝలక్ తగులుతున్న దాఖలాలు చాలాకాలంగా చూస్తున్నాం. కానీ ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల్లోనే విపక్షాల బలహీనతలను సొమ్ము చేసుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. తొలుత తాము రెండో స్థానం మీద గురిపెట్టినట్టు సంకేతాలు ఇస్తోంది. దానికి తగ్గట్టుగా తెలంగాణాలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ మీద గురిపెట్టి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
ఏపీలో ఏడాదిన్నరగా ప్రభుత్వం మారిన నాటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ ఆశావాహక ఫలితాలు రాలేదు. అయినప్పటికీ తమకు సానుకూల సంకేతాలున్నాయనే ధీమాతో బీజేపీ నేతలు సాగుతున్నారు. టీడీపీ బలహీనపడుతున్న కొద్దీ తాము ఎదుగుతున్నట్టే లెక్క అని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఉత్తరాదిలో పనిచేసిన మతం మంత్రం ఏపీలో పనిచేయదని నిర్ధారణకు రాకపోయినప్పటికీ కులం కార్డు బలంగా పనిచేస్తుందనే లెక్కల్లో మాత్రం ఉంది. దానికి తగ్గట్టుగా ఓ వైపు మత సంబంధిత అంశాలలో జోరు పెంచుతూనే మరోవైపు కులాల వారీగా కీలక పదవులు కట్టబెడుతూ ముందుకు సాగుతోంది.
తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దగ్గుబాటి పురందేశ్వరి నియామకం దానికో సంకేతంగా కనిపిస్తోంది. కమ్మ- కాపు కాంబినేషన్ కోసం తహతహలాడుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజుని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అంతకుముందు కన్నా అదే పోస్టులో ఉన్నప్పటికీ సోము వీర్రాజు వచ్చిన తర్వాత కాపు వర్గాల ఏకీకరణ ప్రయత్నాలు బాహాటంగానే సాగుతున్నాయి. హైదరాబాద్ వెళ్లి అందరికన్నా ముందుగా చిరంజీవితో ఆయన బేటీ అయిన తీరు దానికో ఉదాహరణ. జనసేన తోడ్పాటుతో కాపు యువత తమవైపు ఉన్నారని కమల నాధుల్లో ధీమా కనిపిస్తోంది. దానికితోడుగా కమ్మ వర్గాలకు సమీకరిస్తే ఏపీలో చక్రం తిప్పే అవకాశం ఉంటుందని అంచనాల్లో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే టీడీపీ కోటలు కూలుతున్న తరుణంలో తమ ఊహాలకు రెక్కలొస్తాయని ఆశాభావంతో ఉన్నారు.
ఏపీలో కమ్మ-కాపు మధ్య సుదీర్ఘకాలంగా వైరం ఉంది. ప్రధానంగా గుంటూరు నుంచి గోదావరి జిల్లాల వరకూ ఆ రెండు వర్గాల మధ్య వివాదాలు సర్వసాధారణం. అలాంటి సమయంలో కీలకమైన రెండు వర్గాలను ఐక్యం చేయడం అంత సులువు కాదు. పైగా సంఖ్య రీత్యా అత్యధికులుగా కాపులు ఉంటే, అన్ని రంగాల్లో కీలక స్థానాల్లో కమ్మలు ఉంటారు. దాంతో ఇరువర్గాల్లో ఎవరికీ ఆధిపత్యం అనే తగాదా కూడా వస్తుంది. అయినప్పటికీ సమన్వయంతో ఉమ్మడిగా ముందుకు కలిపి నడిపేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరమవుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం, అంతకుమించి ఎన్టీఆర్ కుమార్తెగా ఉన్న గుర్తింపుతో పురందేశ్వరి ఏపీ బీజేపీలోకి పలువురు కమ్మ నేతలను తీసుకువచ్చేందుకు ప్రయత్నించబోతున్నట్టు చెప్పవచ్చు టీడీపీలో అసంతృప్తిగా ఉన్న వారిని, చంద్రబాబు నాయకత్వంతో విబేధిస్తున్న వారిని సమీకరించే బాధ్యత ఆమె తీసుకుంటారని అంతా అంచనా వేస్తున్నారు.
బీజేపీలో మారుతున్న పరిణామాల్లో జీవీఎల్ నరసింహరావు, రామ్ మాధవ్ వంటి ఏపీకి చెందిన సీనియర్ నేతలకు ఈసారి పదవులు దక్కలేదు. అయితే వారిలో ఒకరిద్దరికైనా కేంద్ర క్యాబినెట్ లో అవకాశం దక్కబోతున్నట్టు భావిస్తున్నారు. తద్వారా వారు ఏపీ రాజకీయాల్లో మరింత క్రియశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అటు సీనియర్లు, ఇటు కొత్త నేతల కలయికతో బీజేపీని బలోపేతం చేయడంలో భాగంగా పురందేశ్వరిని తెరమీదకు తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. కమలదళం ప్రారంభించిన ఈ కొత్త ఆపరేషన్ ఫలితాలు ఎలా ఉంటాయన్నది కాలమే సమాధానం చెప్పాలి.