iDreamPost
android-app
ios-app

హోటల్ లో ఎంపీ అనుమానాస్పద మృతి!

హోటల్ లో ఎంపీ అనుమానాస్పద మృతి!

ముంబైలోని ఓ హోటల్లో దేశ పశ్చిమ కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ పార్లమెంటు సభ్యుడు మోహన్ బాయ్ సంజీబాయ్ దేల్కర్ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ముంబాయిలో తన వ్యక్తిగత పని నిమిత్తం వచ్చిన ఆయన హోటల్ రూమ్ లోనే చనిపోయారు. గుర్తించిన హోటల్ సిబ్బంది ముంబై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎంపీ ఆత్మహత్య చేసుకుని ఉంటారని ప్రాథమికంగా పోలీసులు చెబుతున్న, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

ఏమై ఉంటుంది..?

58 ఏళ్ల మోహన్ దేల్కర్ స్వతంత్ర అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో దాద్రా నగర్ హవేలి నియోజకవర్గం నుంచి గెలిచారు. అంతకు ముందు కాంగ్రెస్ లో బిజెపి లో కూడా పని చేసిన ఆయన కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2020లో మోహన్ దేల్కర్ నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ తో జతకట్టి దాద్రా నగర్ హవేలీ స్థానిక ఎన్నికల్లోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రభావంతో బిజెపి స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా సీట్లు కోల్పోవాల్సి వచ్చింది.

ఆదివారం కొన్ని పనుల నిమిత్తం ముంబయి వచ్చిన ఆయన సింగల్ గానే ఉన్నారని, హోటల్ గది తీసుకొని ఏకాంతంగా గడిపినట్లు హోటల్ యాజమాన్యం చెబుతోంది. సోమవారం ఆయన గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి పరిశీలించగా ఆయన విగతజీవిగా కనిపించారు. అయితే ముంబై ఏ పని నిమిత్తం వచ్చారు? ఎందుకు హోటల్లో దిగాల్సి వచ్చింది? ఒంటరిగా ముంబై రావాల్సిన అవసరం ఏమిటి అన్న విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులను ఆయన వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రాథమికంగా ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్న పోలీసులు రాజకీయ, ఆర్థిక పరమైన కారణాలను సైతం వాకబు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన మృతికి నిర్దిష్టమైన కారణాలు తెలియరాలేదు.

సుదీర్ఘ రాజకీయ జీవితం

దాద్రా నగర్ హవేలీ రాజకీయాల్లో మోహన్ దేల్కర్ ది ఒక ప్రత్యేకమైన రాజకీయ ప్రయాణం. మోహన్ దేల్కర్ తండ్రి సంజీ భాయ్ దేల్కర్ కూడా 1967 లో దాద్రా నగర్ హవేలీ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆయన రాజకీయ వారసుడిగా రంగంలోకి వచ్చిన మోహన్ దేల్కర్ కార్మిక యూనియన్ సీల్ వాస తరపున 1988 లో పోరాటాల్లోకి ఆయన ప్రవేశించారు. లాయర్ గా గిరిజనుల హక్కుల కోసం పోరాడుతూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి హక్కుల కోసం ఆయన 1985లో ఆదివాసి వికాస్ సంఘటన్ పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసి దానిని విస్తరించారు. 1989లో మొదటిసారి దాద్రా నగర్ హవేలి లోక్సభ నియోజకవర్గం నుంచి మోహన్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.

కాంగ్రెస్ తర్వాత బిజెపిలోకి!

స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. 1991, 1996 లోక్ సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆయనకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కొన్ని విభేదాలు రావడంతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ మీద ఆయనకు సానుకూల తిరుపతి ఉండడంతో బిజెపిలో చేరారు. బిజెపి తరఫున దాద్రా నగర్ హవేలి నుంచి 1998లో గెలిచారు. కొద్ది రోజులు కూడా బిజెపిలో ఉండకుండా నే 1999 లో దేశానికి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి ఎంపీగా గెలిచారు. 2004లో ఉమా భారతి నేతృత్వంలో స్థాపించబడిన భారతీయ నవశక్తి పార్టీ తరఫున దాద్రా నగర్ నుంచి మోహన్ గెలవడం ఒక్కటే ఆ పార్టీ సాధించిన స్థానం.

మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా

2009, 2014 ఎన్నికల్లో బిజెపి దాద్రా నగర్ హవేలీ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. ఒక పార్టీలో కొనసాగరు అని పేరు పడ్డ మోహన్ మరోసారి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లి, రెండు సార్లు ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో మరోసారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో నిలిచి విజయం సాధించాలంటే దాద్రానగర్ ప్రజలకు మోహన్ మీద ఎంత నమ్మకమో తెలుస్తోంది.

పేరు పేరునా పలకరించడం ఆయన ప్రత్యేకత

దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతం. ఇది ప్రత్యేకమైన జిల్లా గా పరిగణిస్తారు. గుజరాత్, మహారాష్ట్ర బోర్డర్ లకు సరిసమానంగా అటూ ఇటూ విస్తరించిన ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మోహన్ దేల్కర్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచెంత సాన్నిహిత్యం ఆయనకు ఉంది. జిల్లాలోని ప్రతి మూలకు ఆయన వెళ్తారు. ఎక్కడ శుభకార్యం జరిగినా ఎవరికీ ఎలాంటి ఆపద వచ్చినా ముందు ఉండడంలో నియోజకవర్గ ప్రజలకు మోహన్ బాగా దగ్గరయ్యారు. దీంతో ఆయన మృతిని దాద్రా నగర్ హవేలీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఏం జరిగిందో మోహన్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది.