పైశాచిక పిండారీలకు పేట వీరుల దెబ్బ

పిండారీలు – ఈ పేరు చెబితే 19వ శతాబ్దం ప్రారంభలో భారత దేశంలో ప్రజలు అరచేతిలో ప్రణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమని బ్రతికేవారు, ఫిరంగులు, కత్తులు, గండ్ర గొడ్డళ్ళు, ఈటెలు, మర తుపాకులతో గుర్రాల మీద వేలాది మంది ఒక్కసారే గ్రామాలపై పడి ఊళ్లకి ఊళ్ళని తగలబెడుతు సంపద దోచి ఆడవారిని చెరిచి అల్లకల్లోలం సృష్టించి గంటల వ్యవధిలోనే గ్రామాలను స్మశానాలుగా మార్చేవారు. పిండారీలు మొదట మరాఠ సేనలకు అండగా ఉంటూ యుద్దము వచ్చినప్పుడు మరాఠా శత్రు సేనలపై గెరిల్లా యుద్దాలు చేస్తూ యుద్దము లేనప్పుడు రాజ్య శాసనాలను ధిక్కరిస్తూ ఊళ్లపై పడి ప్రజలను దోపిడీ చేస్తూ అరాచాకాలు సృష్టించే వారు. ఈ పిండారీ సైన్యములో ఆఫ్ఘన్లు, మారాఠీలు, జాట్లు అధికంగా ఉండేవారు. వీరు రాజస్తాన్, మధ్య హిందుస్తాన్లో ఎక్కువ సంచరిస్తూ ఆ ప్రాంత ప్రజల్లో హత్యలతో దోపిడీలతో బయోత్పాతం సృష్టించారు. ఈ పిండారీ మూకలకు నాయకత్వం వహించిన వారిలో అమీర్ ఖాన్, నజీర్ మొహమద్, చీటు, కరీం ఖాన్లు ముఖ్యులుగా చెబుతారు. వీరు వేలకొద్ది సైన్యముతో , ఫిరంగులతో 1815లో తెలుగునేలపై అడుగుపెట్టారు.

సుమారు 10 వేల మంది సైన్యముతో 1815 నవంబరులో గోదావరి నదిని దాటి పల్లెలు , పట్టణాలను ధ్వంసం చేస్తూ, ఆడవారిపై అత్యాచారాలు చేస్తు, చిన్న పిల్లలను చంపుతూ అరాచకాలను సృష్టించారు. కేవలం నాలుగు నెలల్లో మునగాల , కుమార బందరు వాటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో దోపిడిలు చేశారు. 1816 మార్చ్ నెల ఆరంభంలో నందిగామ , పెనుగంచి ప్రోలులో దోపిడీ చేశారు. కృష్ణాజిల్లా కుంపిణి రికార్డుల ప్రకారం ఫాల్గుణ శుద్ద ద్వాదశీ సోమవారం 1816 మార్చ్ 11న కృష్ణా నది దాటి అమరావతి రాజ్యములోకి ప్రవేశించారు.

ప్రభువు వాసిరెడ్డి ఫిరంగులతో విరుచుకు పడగా అక్కడనుండి పారిపొయి పక్కనే ఉన్న గుంటూరు జిల్లాలోని, బలుసుపాడు, సిరిపురము, పెదకూరపాడు, పేరే చర్ల , గుంటూరు, వెంగండ్ల , కంతేరు, ఎర్రబాలేము, నవులురు, కాకాని , నంది వెలుగు, గ్రామాలను ఒకేసారి దోచి ఆ పక్కనే ఉన్న నర్సరావుపేట ఆ పరిసర గ్రామాలను దోచెందుకు సిద్దమై కోట్టప్పకోండ వద్ద ఉన్న ఓగేరు వాగు దగ్గర బసచేశారు. 11రోజుల వ్యవధిలో ఈ పిండారీలు కృష్ణా గుంటూరు జిల్లాలో 339 గ్రామాలను దోచారంటేనే వీరి పైశాచికత్వం ఏ స్థాయిలో ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.

నర్సరావుపేట ఆ చుట్టుపక్క గ్రామాలను దోచే ఆలోచనతో వచ్చిన పిండారిల జాడని వేగుల ద్వారా కనుక్కున నర్సరావుపేట రాజా గుండారాయణం గారు పట్టణ, సమీప గ్రమాల ప్రజలందరిని తమ విలువైన వస్తువులతో కోటలోకి ప్రవేశింపమని ఆదేశాలు పంపి ప్రజలందరు కోటలోకి ప్రవేశించిన తరువాత కోట ముఖద్వారాలను మూయించి వేశారు.

కోట బురుజులపై సైనికులని ఆయుధాలతో సిద్ధమవ్వమని చెప్పి, పెట్లూరివారిపాలెం మొఖాసా దారులు గుండారాయణం గారికి రాజభందువులైన కటికినేని క్రిష్ణమ్మ అనే వెలమ ప్రభువులతో పాటు వినుకొండ , బెల్లంకొండ, బొల్లాపల్లి, అయ్యనపాలెం , అగ్ని గుండాల, మిన్నెకల్లు గ్రామాల యోధులను రమ్మన్ని ఆజ్ఞాపించారు. కోటలోకి వచ్చిన వీరితో సమావేశంలో ఉండగానే పట్టపగలే పిండారీలలో కొందరు నర్సరావుపేటలోని కొందరి దనవంతుల ఇళ్లపై పడి దోచుకోవటం మొదలు పెట్టారు. సమావేశం అనంతరం నాటి రాత్రికే పిండారిలపై దాడి చేయాలని తీర్మానించుకున్నారు.

అనుకున్నదే తడవుగా గుండారాయణం గారు తన వద్ద ఉన్న 99 ఏనుగులను, 300 అశ్వములు , ఎద్దుల బండ్లపై ఫిరంగులను అమర్చి దాడికి సిద్దమయ్యి తన పట్టపు ఏనుగైన ఖండేరావుపై బయలు దేరగా, క్రిష్ణమ్మ గారు మోతే అనే ఏనుగుపై బళ్ళెంతో రాయణంగారిని అనుసరించారు. తక్కిన ఏనుగుల తొండాలకు రోకళ్ళు కట్టి కోటప్పకొండ చేరువులో ఓగేరు వాగు దగ్గర బస చేసిన పిండారీలపై ఒక్క సారిగా హర హర మహదేవ అనే నినాదాలతో విరుచు పడి పిండారీలను చీల్చి చెండాడారు. ఏనుగుల ఇనుప రోకళ్ల దెబ్బలకు బల్లెముల పొట్లకు అనేక మంది పిండారీలు అక్కడే మరణించగా, మిగిలిన పిండారీలను తెల్లవారు జాము సమయానికి, వినుకొండ తాలూకాలోని కొత్తలూరు వరకు తరిమి కొట్టారు అక్కడ నుండి పిండారీలు నలుదిక్కులకు పారిపోయారు.

తెలుగు జిల్లాలను , అప్పటి గుంటూరు కలెక్టర్ ఓక్స్ ను సైతం బయపెట్టిన పిండారీలను, నర్సరావుపేటలో వీరులు జరిపిన పోరుతో అతి కొద్ది కాలంలోనే తెలుగు జిల్లాలను వీడి పోయారు. భారత దేశంలో అనే ప్రాంతాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పిండారీలకు నర్సారావుపేటలో తగిలిన దెబ్బతో క్రమంగా క్షీణించి చివరికి ఉనికిని సైతం కోల్పొయారు.

Show comments