iDreamPost
iDreamPost
సైబర్ నేరగాళ్ల వలలో సెలబ్రిటీ చిక్కుకుంది. మోసపోయనని తెలుసుకొని కేసు పెట్టింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో మనీ రికవరీ కాదు. ముంబైలోని ఓషివారా పోలీసులు సైబర్ క్రైమ్‌ను విజయవంతంగా చేధించి, ఆ డబ్బును రికవరీ చేసి ఆ బుల్లితెర నటికి అందించారు.
క్రైమ్ పెట్రోల్(Crime Patrol ) యాక్ట్రస్, బుల్లితెర బ్యూటీ అమన్ సంధు(Aman Sandhu) అంటే టీవీ సీరియల్స్ చూసేవాళ్లకు తెలిసిన ముఖమే. గోరేగామ్‌లో ఉంటోంది. తల్లికి డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం జుహు ఆస్పత్రి వెబ్‌సైట్ కోసం జులై 6న నెట్‌లో వెతికింది. అప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లా కనిపించే నకిలీ సైట్‌లో తన నెంబర్‌ను నమోదు చేసింది. ఆమెకు వెంటనే కాల్ వచ్చింది. కాల్ చేసిన కుర్రాడు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని, అందుకోసం తాను పంపే వాట్సాప్ లింక్‌పై క్లిక్ చేయాలని సూచించాడు. చెప్పినట్లుగానే, ఆ లింక్‌పై అమన్ సంధు క్లిక్ చేసింది. అంతే, తన మూడు ఎకౌంట్స్ నుంచి రూ. 2.24 లక్షలు అతనికి వెళ్లిపోయాయి. మోసపోయానని తెలుసుకున్న అమన్, పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేసింది.
పోలీసులు రంగంలోకి దిగారు. ఫోన్ కాల్ ఆధారంగా కాజేసిన అకౌంట్‌ను బ్లాక్ చేశారు. ఆ డబ్బును ఆ సైబర్ క్రిమినల్ నుంచి రికవరీ చేశారు. ఈ సంగతిని నటి అమన్ సంధు సోషల్ మీడియాలో తెలిపింది. పోలీసులను నమ్మండి. భయపడొద్దు. కొంత ఓపిక, సంయమనం పాటించాలి. ఇలాంటి పరిస్థితిలో పోలీసులు మాత్రమే సహాయం చేయగలరని చెప్పింది నటి అమన్ సంధు.