Idream media
Idream media
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అమరావతియే ఏకైక రాజధానిగా కొనసాగాలని కోరుకుంటున్న వారికి ఓ సలహా ఇచ్చారు. సీనియర్ రాజకీయవేత్తగా, ఉన్నది ఉన్నట్లు కండబద్ధలు కొట్టే నారాయణ సలహా నిజంగా ఆచరణీయమే. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కావలంటున్న రాజకీయ పార్టీలు అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోనే ఉద్యమం చేస్తే సరిపోదని, చిత్తశుద్ధి ఉంటే 13 జిల్లాలు తిరిగి ఉద్యమం చేయాలన్నారు.
నారాయణ ఏ ఒక్క పార్టీని ఉద్దేశించి ఈ మాట చెప్పలేదని స్పష్టంగా తెలుస్తోంది. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, జనసేన, నారాయణ పార్టీ అయిన సీపీఐ కోరుతున్నాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టులో జనసేన, కాంగ్రెస్ పార్టీలు అఫిడవిట్లు కూడా దాఖలు చేశాయి. నారాయణ చెప్పినట్లు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీలు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ప్రతి జిల్లాలో అమరావతికి మద్ధతుగా ఉద్యమం చేయాల్సి ఉంటుంది. ఈ పార్టీలన్నింటికీ రాష్ట్ర వ్యాప్తంగా అంతో ఇంతో క్యాడర్ ఉంది. క్యాడర్ భారీ ఉన్న పార్టీ భారీగా ఉద్యమం చేస్తుంది.. తక్కువగా ఉన్న పార్టీ తనకు తగినట్లుగానే నిరసన కార్యక్రమం చేపడుతుంది. కార్యక్రమం ఏమైనా.. నారాయణ చెప్పిన మాట పాటిస్తే అమరావతే ఏకైక రాజధానిగా కావాలంటున్న పార్టీల లక్ష్యం నెరవేరుతుంది.
అమరావతి ఉద్యమం గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైంది. మరో రెండు నెలల్లో ఏడాది పూర్తవబోతోంది. ప్రస్తుతం మూడు వందల రోజులు నిరాటకంగా ఉద్యమం సాగుతోంది. అయినా ఉద్యమం అమరావతిలోని 29 గ్రామాలకే పరిమితమైంది. ఇంకా చెప్పాలంటే 29 గ్రామాలల్లో కొన్నింటికే పరిమితమైంది. ఉద్యమం ప్రారంభమై ఇన్నాళ్లయినా.. అమరావతికి తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ , సీపీఐ పార్టీల మద్దతు ఉన్నా.. అమరావతిలోని 29 గ్రామాలు దాటి కనీసం కృష్ణా, గుంటూరు జిల్లాలకు కూడా ఉద్యమం విస్తరిచకపోవడానికి గల కారణం.. నారాయణ అన్నట్లు రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడమేనని స్పష్టమవుతోంది.
లాభమో.. నష్టమో.. తాము తీసుకున్న స్టాండ్‌కు తగినట్లు రాజకీయ పార్టీలు నడవాలి. కానీ అమరావతి విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతోంది. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని.. అదీ అమరావతే కావాలంటున్న ఈ పార్టీలు ఆయా ప్రాంతాల్లో ఈ మాట చెబితే ప్రజా స్పందన ఎలా ఉంటుందో, తద్వారా తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందో కూడా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆ పని చేసే ఆలోచన తెలుగుదేశం పార్టీ సహా అమరావతే ఏకైక రాజధాని కావాలంటున్న పార్టీలకు లేనట్లుగా తెలుస్తోంది.