iDreamPost
android-app
ios-app

కరోనా అలర్ట్‌.. మళ్లీ ఉధృతి

కరోనా అలర్ట్‌.. మళ్లీ ఉధృతి

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఆదివారం 1,150 కేసులే నమోదవగా, సోమవారం వాటి సంఖ్య రెట్టింపై 2,183కు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్‌ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్‌ అప్రమత్తమైంది.

యూపీ రాజధాని లక్నో తో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) పరిధిలోని 6 జిల్లాల్లో (గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌, గజియాబాద్‌, హాపూర్‌, మీరట్‌, బులంద్‌ షహర్‌, బాఘ్‌పట్‌) మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలనే నిబంధనను మళ్లీ అమల్లోకి తెచ్చింది. కొవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా గజియాబాద్‌ జిల్లాలో జూన్‌ 10 వరకు 144 సెక్షన్‌ అమలవుతుందంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీలో కొవిడ్‌ కేసుల పెరుగుదలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఆస్పత్రుల్లో చేరికలు భారీగా లేకపోవడాన్ని ఊరట కలిగించే అంశంగా ఆయన అభివర్ణించారు.

గత మూడువారాలుగా లాక్‌డౌన్‌లో మగ్గుతున్న చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనాతో ఆదివారం ముగ్గురు మృతిచెందారు. వాళ్లంతా 89 నుంచి 91 ఏళ్లలోపు వారేనని అధికారవర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆ వృద్ధులకు కొవిడ్‌ చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయిందని తెలిపారు. మృతులు ముగ్గురూ కొవిడ్‌ టీకా తీసుకోలేదన్నారు. ఇక షాంఘైలో సోమవారం మరో 22,248 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో కొవిడ్‌ లక్షణాలు బయటకు కనిపించని (ఎసింప్టొమాటిక్‌) కేసులే 19,831 ఉన్నాయి. ఎసింప్టొమాటిక్‌ కొవిడ్‌ నిర్ధారణ అయిన వారిని కూడా ఒకవారం పాటు స్థానిక క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచుతున్నారంటూ ఓ వార్తాసంస్థ కథనాన్ని ప్రచురించింది.