కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న ఒక సామెత ఉంది. ఇప్పుడు సరిగ్గా ఈ సామెత తెలుగు సినీ పరిశ్రమకు సరిపోతుందేమో. ఆంధ్ర ప్రదేశ్ సినిమా టికెట్ రేట్లు తగ్గించారు అని చాలా రోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమ అనేక విధాలుగా ప్రభుత్వాన్ని రేట్లు పెంచాలని కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు సినిమా కూడా అందుబాటులో ఉండేందుకు గాను సరసమైన ధరలకే సినిమాలను కూడా అందుబాటులో ఉంచేలా చేస్తోంది. కానీ అనూహ్యంగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచి అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వడంతో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది పెద్దలు తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తెలుగు సినీ పరిశ్రమ కోరిన మేరకు ఏదైనా పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ రేట్లు పెంచి అనుకోవచ్చు అంటూ ఒక జీవో జారీ చేసింది.
కొద్దిరోజుల క్రితం హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా జీవో నెంబర్ 120 ను జారీ చేశారు. ఈ జారీ చేసిన జీవో ప్రకారం ఏసీ థియేటర్లలో మినిమం ధర 50 రూపాయలు కాగా మాక్సిమం ధర 150 రూపాయలు వాటికి జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది. ఏసీ లేని థియేటర్లలో కనీస టికెట్ ధర 30 రూపాయలు కాగా మాక్సిమం 70 రూపాయల వరకు టికెట్ ధర అమ్ముకోవచ్చు. అయితే మల్టీప్లెక్స్ విషయానికి వచ్చేసరికి మినిమం ధర వంద రూపాయలు+ జీఎస్టీ కాగా గరిష్టంగా రెండు వందల యాభై రూపాయలు ప్లస్ జీఎస్టీ వసూలు చేసుకునే విధంగా జీవోలో అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ జీవో జారీ చేసిందో లేదో వెంటనే మల్టీప్లెక్స్ లు అన్ని 250 రూపాయలు ప్లస్ జీఎస్టీ కలిపి 295 రూపాయలు టిక్కెట్కు వసూలు చేయడం మొదలు పెట్టాయి. ఈ ధరలు 31వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి.
ఇప్పటికే విడుదలైన అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో పాటు రేపు విడుదల కాబోతున్న అనేక చిన్న సినిమాలకు కూడా ఇదే టికెట్ రేట్లు ఉండనున్నాయి. ప్రభుత్వం సినిమా పరిశ్రమ ఇబ్బంది పడకూడదని అనుమతి ఇస్తే ఇష్టారాజ్యంగా చిన్న సినిమాలకు కూడా ఇప్పుడు ఈ రేట్లు వసూలు చేస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా సినిమా థియేటర్లకు రావడం మానేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే నలుగురు ఉన్న కుటుంబం సినిమాకి రావాలన్నా కేవలం టిక్కెట్లకే 1200 రూపాయల దాకా ఖర్చవుతోంది. వాటికి ప్రయాణ ఛార్జీలు అదనం.
దాదాపు రెండింతలు టికెట్ చార్జీలను పెంచి అమ్మడంతో పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలాగో నెలన్నర రోజులు ఆగితే ఏ సినిమా అయినా డిజిటల్ వేదికగా ఇంట్లో అందుబాటులో ఉంటుంది. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి చిన్న సినిమాలకు రావడం అనేది గగనం అనే చెప్పాలి. ఇక ఈ విషయం మీద వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు తెలంగాణలోని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సినిమాలు చూడాలంటే ఆంధ్ర కి వెళ్లి చూడాల్సిన పరిస్థితులు వచ్చేలా తెలంగాణలో థియేటర్, మల్టీ ప్లెక్స్ ల యజమానులు ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయం మీద సరైన నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే వాదన వినిపిస్తోంది.
Also Read : RRR : ఆర్ఆర్ఆర్ – రాజమౌళి మనసులో ఏముంది