iDreamPost
android-app
ios-app

ప్ర‌యివేట్ డాక్ట‌ర్లు ఏమ‌య్యారు?

ప్ర‌యివేట్ డాక్ట‌ర్లు ఏమ‌య్యారు?

ఇపుడు జ‌రుగుతున్న విచిత్రం ఏమంటే ప్ర‌జ‌ల‌కి న‌మ్మ‌కం లేని రెండు వ్య‌వ‌స్థ‌లు ప్ర‌జ‌ల్ని కాపాడుతున్నాయి. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌పైన మ‌న‌కు న‌మ్మ‌కం లేదు. స‌ర్కారీ ద‌వాఖానాపై పాట‌లు రాసి కూడా పాడుకున్నాం. డాక్ట‌ర్లు లంచ‌గొండుల‌ని , న‌ర్సులు నిర్ల‌క్ష్యంగా చూస్తార‌ని వెళ్ల‌డం మానుకున్నాం. అక్క‌డికి వెళ్లేది పేద‌వాళ్లు, వైద్యానికి ఖ‌ర్చు పెట్టలేని వాళ్లు. క‌రోనా కాలంలో ముందు వ‌రుస‌లో ఉండి యుద్ధం చేస్తున్న‌ది మ‌నం ఇంత కాలం తిట్టుకున్న డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఇత‌ర సిబ్బంది.

వైద్యం పేరుతో ప్రజలను  పిండేసిన కార్పొరేట్ ఆస్ప‌త్రులు, డాక్ట‌ర్లు, ల్యాబ్‌లు అన్నీ బంద్‌. రోగుల్ని రానివ్వ‌డం మానేశారు.

ఇంకొక‌టి పోలీస్ వ్య‌వ‌స్థ‌. పోలీసుల మీదున్న ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు అన్నీఇన్నీ కావు. ఇపుడు ఎండ‌ల్లో నిల‌బ‌డి, తిండి కూడా స‌రిగా తిన‌కుండా, కుటుంబాల్ని వ‌దిలి పోరాటం చేస్తున్నారు. క‌మ్యూనిస్టులు పాలించే కేర‌ళ‌లో , బూర్జువా పార్టీల‌ని క‌మ్యూనిస్టులు విమ‌ర్శించే ఇత‌ర రాష్ట్రాల్లో , ఎక్క‌డైనా పోలీసులే ముందు వ‌రుస‌లో ఉన్నారు. సిస్ట‌మ్‌లో త‌ప్పులుండొచ్చు. కానీ ఆ సిస్టం లేకుండా స‌మాజం న‌డ‌వ‌దు.

ముఖ్యంగా మాట్లాడాల్సింది వైద్య వ్య‌వ‌స్థ గురించి. 1980 వ‌రకు వైద్యం వ్యాపారం కాదు. ఆస్ప‌త్రుల‌కు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్లు కూడా వెళ్లేవాళ్లు. ప్ర‌స‌వాలు, ఆప‌రేష‌న్లు ఎక్కువ సంఖ్య‌లో జ‌రిగేవి. 80 త‌ర్వాత వ్యాపారం విస్త‌రించింది. స్పెష‌లిస్టులు పెరిగారు. ప‌రీక్షా కేంద్రాలు వెలిశాయి. డాక్ల‌ర్ల‌కు ఆదాయం , ఆశ పెరిగింది. 2000 నాటికి మెడిక‌ల్ మాఫియా అవ‌త‌రించింది. ప్ర‌యివేట్ ఆస్ప‌త్రులు పెరిగాయి.

ప్ర‌భుత్వాలు ఉద్దేశ‌పూర్వ‌కంగా విద్యా వ్యవస్థను నాశ‌నం చేసిన‌ట్టు వైద్యాన్ని నాశ‌నం చేశాయి. జ‌నానికి గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రి అంటే భ‌యం ఎందుకు ఏర్ప‌డిందంటే అక్క‌డ సౌక‌ర్యాలు లేక‌పోవ‌డం వ‌ల్ల‌.

నిధులు ఇవ్వ‌క‌పోతే సౌక‌ర్యాలు ఎక్క‌డి నుంచి వ‌స్తాయ్‌? క‌మీష‌న్ల కోసం డాక్ట‌ర్లు అవ‌స‌రం లేని ప‌రీక్ష‌లు, ఎక్స్‌రేలు, సిటీ స్కాన్‌లు రాయ‌డం ప్రారంభించాయి. ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు ఏజెంట్ల‌ని (ఆర్ఎంపీ డాక్ట‌ర్లు) నియ‌మించుకుని వ‌ల వేసి పేషెంట్ల‌ని ప‌ట్టుకున్నాయి. మందుల కంపెనీలు డాక్ట‌ర్ల‌కి విదేశీ ప‌ర్య‌ట‌న‌లు ఏర్పాటు చేశాయి. సామాన్యుడు చితికిపోయాడు.

మ‌రి ఇన్నేళ్లుగా ఇన్ని వేల కోట్ల రూపాయ‌లు మ‌న నుంచి పిండిన ఈ ఆస్ప‌త్రులు, డాక్ట‌ర్లు, క‌ష్ట కాలంలో మ‌న కోసం ఏం చేశాయి? రోజుకి ల‌క్ష రూపాయ‌లు సంపాదించే ఏ డాక్ట‌రైనా స్వ‌చ్ఛందంగా వెళ్లి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో రోగుల‌కి సేవ చేస్తున్నాడా?

పెద్ద పేరున్న ఆస్ప‌త్రులు క‌రోనా కోసం ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తున్నాయా? ర‌క్తాన్ని పిండేసిన ప్ర‌యివేట్ ల్యాబ్‌లు జ‌నం కోసం ఏమైనా చేస్తున్నాయా? వ్యాపారం పోయింద‌నే బాధ త‌ప్ప జ‌నానికి ఏమైనా చేయాల‌ని అనుకున్నారా?

రూ.500 నుంచి రూ.1000 వ‌ర‌కు క‌న్స‌ల్టెన్సీ ఫీజు తీసుకుని రోజుకి వంద టికెట్లు ఇచ్చే స్పెష‌లిస్టులు, బంగ‌ళాలు క‌ట్టుకుని రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ చేసే ప్ర‌యివేట్ డాక్ట‌ర్లు లాక్‌డౌన్‌లో ఆక‌లిగా ఉన్న‌వాళ్ల‌కి ఇంత ముద్ద పెడుతున్నారా?

ప్ర‌భుత్వాల‌కి ఇప్ప‌టికైనా బుద్ధి, జ్ఞానం ఉంటే ఈ మెడిక‌ల్ మాఫియాని క‌ట్ట‌డి చేసి , ప్ర‌భుత్వ వైద్యానికి సౌక‌ర్యాలు పెంచి జ‌నాల్ని కాపాడాలి. లేదంటే ఆర్థిక మాంద్యంలో స‌గం చ‌చ్చిపోయిన వాళ్ల‌ని వీళ్లు పూర్తిగా చంపేస్తారు.

నాడు-నేడు అని జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌పైన దృష్టి సారిస్తూ ఉండ‌టం శుభ‌ప‌రిణామం