iDreamPost
iDreamPost
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఆ పార్టీకి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. సుదీర్ఘ కాలం పాటు మన దేశాన్ని పాలించింది. కానీ ఇప్పుడు అధికార పార్టీ బీజేపీని ఢీ కొట్టలేక అల్లాడుతోంది. ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికే అవస్థలు పడుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2024 లోక్ సభ ఎన్నికలు ముగిసే నాటికి కాంగ్రెస్ కథ పూర్తిగా ముగిసిపోయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉత్తర, దక్షిణ భారతదేశం అనే తేడా లేకుండా అప్పట్లో కాంగ్రెస్ జెండా అన్ని చోట్లా ఎగిరేది. కానీ ఇప్పుడు ఉత్తరాన్ని బీజేపీ కమ్మేసింది. దక్షిణంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. అక్కడ బీజేపీ, ఇక్కడ ప్రాంతీయ పార్టీలను ఢీ కొట్టలేక కాంగ్రెస్ బాగా వెనకబడిపోయింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలంటే.. కాంగ్రెస్ అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక గూటి కిందకి తీసుకురావల్సి ఉంది. కానీ రోజురోజుకి పడిపోతున్న కాంగ్రెస్ ని పెద్దన్న సీట్లో కూర్చోబెట్టి పనిచేయడానికి ప్రాంతీయ పార్టీలు సైతం ఆసక్తి చూపించే పరిస్థితి లేదు.
తాజాగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో 41 శాతానికి పైగా ఓట్లతో 77 సీట్లు గెలుచుకున్న తాము.. ఈసారి అధికారంలోకి ఖచ్చితంగా వస్తామని కలలు కన్నది. కానీ తీరా ఫలితాలు వచ్చాక చూస్తే 27 శాతం ఓట్లు, 17 సీట్లకు పడిపోయింది. గుజరాత్ లో గెలిచినా లేక కనీసం గట్టి పోటీ ఇచ్చినా.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుందనే ఆశలు చిగురించేవి. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ అది చిన్న రాష్ట్రం.. పైగా ఎప్పటినుంచో అక్కడ ఒకసారి బీజేపీని, ఒకసారి కాంగ్రెస్ ని గెలిపించే ఆనవాయితీ ఉంది. ఇప్పుడూ అదే జరిగింది. అందుకే కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్దగా ఉత్సాహం లేదు.
నిజానికి ఇప్పటికీ ప్రతి ఊరిలో కాంగ్రెస్ కి సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. ముందు తరంలో ఎందరో ఇప్పటికీ హస్తం గుర్తుకే తమ ఓటు అంటారు. కానీ ఈ తరానికి దగ్గరవ్వడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. మెజారిటీ యువత మోడీ మేనియాలోనే ఉంది. మోడీ స్థాయిలో యువతను ఆకట్టుకునే నేత కాంగ్రెస్ లో లేరు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు అంతో ఇంతో ఆదరణ ఉన్నప్పటికీ ఆయన పార్టీ పగ్గాలను వదిలేసి తప్పు చేశాడు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కష్టాల్లో ఉన్న పార్టీని అన్నీ తానై నడిపించాల్సిందిపోయి తన వల్ల కాదంటూ వదిలేశాడు. దాంతో పార్టీ శ్రేణులలోనే రాహుల్ పై పూర్తి నమ్మకం లేకుండా పోయింది. గుజరాత్ ఎన్నికల సమయంలో కూడా అక్కడ పూర్తి దృష్టి పెట్టకుండా జోడో యాత్ర పేరుతో ఇతర రాష్ట్రాల్లో తిరిగాడు. దానికితోడు ప్రస్తుతం కాంగ్రెస్ పగ్గాలు 80 ఏళ్ల మల్లికార్జున్ ఖర్గేకి అప్పగించారు. ఆయనతో పార్టీని సంస్థాగతంగా పునఃనిర్మించడం ఎలా సాధ్యమవుతుంది?. యువతను ఆకట్టుకునేలా కాంగ్రెస్ అడుగులు లేకపోవడమే ఆ పార్టీ నాశనానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.