iDreamPost
android-app
ios-app

Sonia Gandhi 3 గంటల పాటు ప్రశ్నించారు, సోమవారం మళ్లీ ర‌మ‌న్నారు

  • Published Jul 21, 2022 | 7:49 PM Updated Updated Jul 21, 2022 | 7:49 PM
Sonia Gandhi 3 గంటల పాటు ప్రశ్నించారు, సోమవారం మళ్లీ ర‌మ‌న్నారు

నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేప‌ర్ తో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో, 75 ఏళ్ల సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించింది. ఒక మహిళా అడిషనల్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు అధికారులు విచార‌ణ‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్ చీఫ్ కోసం దర్యాప్తు సంస్థ 50 ప్రశ్నలను సిద్ధం చేసింది. విచార‌ణ‌లో ఇది మొద‌టిరోజు.

సోనియా గాంధీని సోమవారం మరోసారి విచారణకు పిలిచారు. ఇటీవల సోనియా కోవిడ్ నుండి కోలుకున్నారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్ర‌కారం, కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ ఉన్న అధికారులే ఆమెను ప్ర‌శ్నించారు.

సోనియా గాంధీ మధ్యాహ్నం తర్వాత సెంట్రల్ ఢిల్లీలోని దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. సోనియా గాంధిని విచారించే గ‌దికి స‌మీపంలోనే ప్రియాంక వాద్ర‌ను ఉండ‌నిచ్చారు. అవ‌స‌రమైన‌ప్పుడు మందులు అందించ‌డానికి ఈడీ అవ‌కాశ‌మిచ్చింది.

సోనియాగాంధిని విచార‌ణ‌కు పిల‌వ‌డం కాంగ్రెస్ లో కాక‌రాజేసింది. త‌మ అధినేత‌ను విచార‌ణ‌కు పిల‌వ‌డాన్ని పార్టీ తప్పుబట్టింది. ఇది రాజ‌కీయ ప్ర‌తికారంగా పేర్చొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ నేతలు ఈడీ దుర్వినియోగాన్ని ఆపండంటూ పార్లమెంట్ కాంప్లెక్స్ లోపల మార్చ్ చేప‌ట్టారు. దేశవ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. కొన్ని చోట్ల, నిరసనకారులు రైళ్లను నిలిపివేసారు, వాహనాలను కూడా తగులబెట్టారు.