iDreamPost
android-app
ios-app

గోడ‌లు క‌ట్ట‌కండి!

గోడ‌లు క‌ట్ట‌కండి!

చాలా ఏళ్ల క్రితం పెనుగొండ ద‌గ్గ‌ర బంధువు చ‌నిపోతే దినాల‌కు వెళ్లాం. ఆ రోజు రంజాన్‌. ఆ వూళ్లో ఉన్న ముస్లింలు ఈద్గాకు వెళ్లి న‌మాజ్ చేసి , తిరిగి వ‌స్తూ మాతో పాటు భోజ‌నం చేశారు. సంవ‌త్స‌రానికి రెండు పండుగ‌లు. ఇంట్లో తినాల‌ని అనుకోలేదు. చ‌నిపోయిన త‌మ ఊరి పెద్దాయ‌న‌కి వాళ్లు చూపిన మ‌ర్యాద అది. ఆ స‌మ‌యంలో బొంబాయిలో అల్ల‌ర్లు జ‌రుగుతున్నాయి.

ఒక‌సారి గుంత‌క‌ల్లు స‌మీపంలో పెళ్లికివెళితే ఇదే విధంగా ఆ ఊరు ముస్లింలు బ‌క్రీద్ ప్రార్థ‌న‌ల‌ను ముగించి పెళ్లికి వ‌చ్చి ఆశీర్వ‌దించి, చేతులు క‌డిగి వెళ్లారు. దీనికి మ‌త‌సామ‌ర‌స్య‌త అనే పెద్ద ప‌దం అక్క‌ర్లేదు. ద‌శాబ్దాలుగా ఇదే జ‌రుగుతోంది. సంక్రాంతి లాంటి పెద్ద పండగ‌లు వ‌చ్చినపుడు ముస్లింల ఇంట పెళ్లి జ‌రిగితే పండ‌గ‌ని కాసేపు ప‌క్క‌న పెట్టి హిందువులు హాజ‌ర‌వుతారు.

నాకు హ‌లీమ్ అంటే చాలా ఇష్టం. వ్య‌స‌నం. హైద‌రాబాద్‌లో ది బెస్ట్ హ‌లీమ్ దొరికే అన్ని చోట్లా తిన్నాను. ఒకసారి చార్మినార్ ద‌గ్గ‌రికి వెళ్లాం. న‌మాజ్ అయిన త‌ర్వాత తింటారా? ముందే స‌ర్వ్ చేయాలా? అని అడిగితే న‌మాజ్ త‌ర్వాతే అని చెప్పాం. న‌మాజ్ వినిపిస్తున్న‌ప్పుడు ప‌విత్ర రంజాన్‌కి గౌర‌వంగా మా ఆవిడ చీర కొంగుని త‌ల‌మీద క‌ప్పుకుంది. మ‌తం కాదు, మ‌నుషుల మ‌ధ్య అనుబంధం అది.

రెండేళ్ల క్రితం ఒక స్నేహితుడు శివ‌మొగ్గ నారాయ‌ణ ఆస్ప‌త్రిలో వుంటే చూడ‌డానికి నేనూ, మా ఆవిడా వెళ్లాం. చిత్ర‌దుర్గ నుంచి అక్క‌డ బ‌స్సు దిగేస‌రికి రాత్రి 7 గంట‌లు. మిత్రున్ని చూసి బ‌య‌టికి వ‌స్తే రాత్రి 9 గంట‌లు. చీక‌టి, నిర్మానుష్యం. ఆటోలు కూడా లేవు. ఇద్ద‌రం భయంభ‌యంగా నిల‌బ‌డ్డాం.

ఒక కారు వ‌చ్చి ఆగింది. సూఫీ త‌ర‌హా గుండ్ర‌టి టోపీల్లో ఇద్ద‌రు ముస్లింలు. లిప్ట్ కావాలా? అని అడిగారు. ఊరు కాని ఊరు. సినిమాల్లో ముస్లింల‌ని తీవ్ర‌వాదులుగా , భాయ్‌లుగా చూపించిన దుర్మార్గం, మ‌నసులో భ‌యంగా ఉంది. వ‌ద్ద‌న్నాం. ఫ‌ర్వాలేదు, రండి , ఈ దారిలో ఈ టైంలో వెహిక‌ల్స్ రావు అని హిందీలో చెప్పారు. ధైర్యంగా ఎక్కాం. ఆరు కిలోమీట‌ర్ల దూరంలోని బ‌స్టాండ్ వ‌ద్ద వ‌దిలారు. నిజానికి వాళ్లు మా కోసం అద‌న‌పు దూరం ప్ర‌యాణించారు.

మేము తెలుగులో మాట్లాడుకోవ‌డం విని కారు దిగిన‌ప్పుడు “టెన్ష‌న్ ప‌డ‌కండి, మీ వాళ్లు కోలుకుంటారు, అల్లా కాపాడుతాడు” అని తెలుగులో ధైర్యం చెప్పి వెళ్లిపోయారు.

ప్ర‌తి వూళ్లో హిందూముస్లింలు క‌లిసి ఉన్నారు. మ‌తంపేరుతో దేశాన్ని ఎలా చీలుస్తార‌ని గాంధీ అడిగిన‌ప్పుడు ఎవ‌రి ద‌గ్గ‌రా స‌మాధానం లేదు. దేశం గాయ‌ప‌డింది. త‌న గాయాల‌కి తానే క‌ట్లు క‌ట్టుకుంది.

నా చిన్న‌త‌నంలో రాయ‌దుర్గంలో ఉర్దూ స్కూల్ వుండేది. చాలామంది ఆడ‌పిల్ల‌లు చ‌దువుకునే వాళ్లు. కొంత మంది త‌ల‌కి వ‌స్త్రాన్ని (హిజాబ్‌) క‌ప్పుకునే వాళ్లు. అది సంస్కృతి సంప్ర‌దాయాల్లో భాగ‌మే త‌ప్ప‌, మ‌తానికి సంబంధించిన అతి అని ఎవ‌రూ అనుకోలేదు.

అదే విధంగా లింగాయ‌త్‌లు విభూతితో అడ్డ‌చార‌లు , బ్రాహ్మ‌ణ పిల్ల‌లు నామాన్ని ధ‌రించి స్కూల్‌కి వ‌చ్చేవాళ్లు. దేవుడు తాయ‌త్తులు , ఉంగ‌రాలు ఇవ‌న్నీ కామ‌న్‌. విశ్వాసాలు, సంస్కృతిలో భాగ‌మే త‌ప్ప హిందుత్వ అతి అని ఎవ‌రూ అనుకోలేదు. ముస్లిం పిల్ల‌లెవ‌రూ టోపీల‌తో వ‌చ్చేవాళ్లు కాదు. మ‌సీదుకి వెళ్లిన‌పుడు మాత్ర‌మే ధ‌రించేవాళ్లు.

నిమ‌జ్జ‌నం ఉత్స‌వాల్లో మాత్ర‌మే హిందూ యువ‌కులు మ‌త చిహ్నాలైన టోపీలు, కండువాలు ధ‌రించేవాళ్లు. అంతే త‌ప్ప ఆ వేష‌ధార‌ణ‌తో ఎవ‌రూ స్కూళ్ల‌కి కాలేజీల‌కి రాలేదు.

రాజ‌కీయం ప్ర‌వేశించే స‌రికి కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి.
రంజాన్ వ‌స్తే ఆ ఇంటి బిరియాని వాస‌న మా ఇంటికొచ్చేది. ఉగాది నాడు మా ఓలిగ‌లు (బొబ్బ‌ట్లు) ఆ ఇంటిని తీపి చేసేవి.

సైకిల్ నేర్పిన ర‌హీం, బ‌ట్ట‌లు కుట్టిన ఖాసీం, సినిమా పిచ్చి ఎక్కించిన ర‌ఫీ మామ‌, కొస‌రి కొస‌రి తినిపించిన ష‌బానా దీదీ , ముస్లింని పెళ్లి చేసుకుని ఖురాన్ చ‌ద‌వ‌డం నేర్చుకున్న గౌరీ అక్క‌, జీవితానికి సువాస‌న‌లు అద్దిన వాళ్లు కాదా? వీళ్లు లేకుండా అసంపూర్ణం కాదా? వాళ్ల‌కైనా మేము అంతేక‌దా!

ఓట్లు కావాల్సి వ‌స్తే జ‌నాన్ని క‌న్విన్స్ చేసి వేయించుకోండి. అధికారంలో ఉండండి, అభ్యంత‌రం లేదు. మ‌తం మీద‌, మ‌నుషుల శ‌వాల మీద మాత్రం న‌డ‌వ‌కండి.

షారుఖ్‌, స‌ల్మాన్‌, అమీర్‌ఖాన్‌ల‌ని మ‌తం చూసి మేం ప్రేమించ‌లేదు, ప్ర‌తిభ చూసి. దిలీప్‌కుమార్ , మ‌ధుబాల ముస్లింల‌ని కూడా చాలా కాలం తెలియ‌దు.

ఎవ‌రెన్ని చేసినా మా మిత్రుల్ని , అనుబంధాల్ని దూరం చేయ‌లేరు. మేము భ‌య‌ప‌డేది మా గురించి కాదు. కొత్త త‌రం గురించి. ప్రేమ గురించి, తినే తిండి గురించి, వేసుకునే బ‌ట్ట‌ల గురించి అస‌హ‌నంగా, అరాచ‌కంగా , ఉన్మాదంగా దూసుకొస్తున్నారే, వాళ్ల‌ని చూస్తేనే భ‌య‌మేస్తుంది.

ముస్కాన్ గొంతు ధిక్కార స్వ‌రం కాదు.
మౌనంగా ఉన్న సెక్యుల‌ర్‌వాదుల మూతిపళ్లు రాల‌గొట్టే ముష్టిఘాతం.