ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ విజయంపై స్పందించిన సీఎం జగన్.. ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్

ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. మాజీ మంత్రి, దివంగత నేత మేకపాటి గౌతమ్ అకాల మరణంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేసి.. 83 వేల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఘన విజయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా… ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు.. పేరుపేరునా ధన్యవాదాలు! మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష!” అని సీఎం జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.

ఆత్మకూరు ఉపఎన్నికల్లో ఏకపక్షంగా సాగిన పోరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ తరపున బరిలోకి దిగిన భరత్ కుమార్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. మిగతా ప్రతిపక్షాలు కూడా విక్రమ్ రెడ్డికి పోటీనివ్వలేకపోయాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి.

Show comments