iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ మరో క్షీర విప్లవానికి కేంద్ర స్థానంగా మారబోతోంది. ప్రభుత్వ నిర్ణయం పాల వెల్లువకి దోహదం చేస్తోంది. అమూల్ వంటి దేశీయ అత్యున్నత సహకార సంస్థ తోడ్పాటుతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రైతాంగానికి ఊరట కల్పించేందుకు ఉపయోగపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పాల సేకరణ ప్రారంభించిన గ్రామాల్లో పాల రైతులకు అదనపు ప్రయోజనం చేకూరుతుండడం దానికి సాక్ష్యంగా చెప్పవచ్చు. ఇన్నాళ్ళుగా రైతుల కష్టాన్ని కొల్లగొట్టిన హెరిటేజ్ వంటి ప్రైవేట్ డెయిరీలకు ప్రభుత్వ నిర్ణయంతో అనివార్యంగా అధిక ధర చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఆశించిన రీతిలో మార్కెట్ లో పోటీ పెరిగి రైతుకి అదనపు ప్రయోజనం దక్కాలనే లక్ష్యం సిద్దించేలా పరిస్థితి కనిపిస్తోంది.
గుజరాత్ కి చెందిన అమూల్ సంస్థకు దేశీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా 36 లక్షల మంది గుజరాతీ పాల ఉత్పత్తిదారులతో విజయవంతమైన డెయిరీగా నిలిచింది. అలాంటి అత్యున్నత సంస్థ సాంకేతిక సహకారంతో ప్రభుత్వమే పాల సేకరణ, ప్రోసెసింగ్ చేస్తున్న తరుణంలో రైతులకు మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంబించారు. అందులో చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలున్నాయి. మూడు జిల్లాలకు గానూ మొత్తం 350 గ్రామాల్లో గత నెల 20న ప్రయోగాత్మకంగా పాల సేకరణ ప్రారంభించారు. వారికి నగదు చెల్లింపుని సీఎం చేతుల మీదుగా బుధవారం చేయబోతున్నారు. తొలుత అమూల్ ప్రతినిధులతో ఎంవోయూ కుదుర్చుకుని, అనంతరం ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేపట్టడం ద్వారా అధికారికంగా అమూల్ పాల కేంద్రాల ప్రారంభోత్సవం జరుపుతున్నారు.
ఏపీలో పాల రైతులకు కనీసంగా రూ. 4 అదనపు ప్రయోజనం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం అమూల్ తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా రైతు భరోసా కేంద్రాలలో ప్రారంభిచిన పాల కేంద్రాల ద్వారా కనీసంగా 4 నుంచి 7 రూపాయాల వరకూ అదనపు ప్రయోజనం దక్కుతోందని రైతులే చెబుతున్నారు. గతంలో 10 శాతం ఫ్యాట్ ఉంటే హెరిటేజ్ సంస్థ కేవలం రూ.58 మాత్రమే చెల్లించేది. ఇప్పుడు దానిని అమూల్ ప్రకటించిన చందంగా రూ. 65 చెల్లించాల్సి వస్తోంది. తద్వారా రైతుకి ఒకేసారి లీటర్ పాలుకి రూ. 7 అదనంగా దక్కుతోంది. ఇతర డెయిరీలు కూడా ఆమేకు పెంపుదల చేయాల్సి వస్తోంది. దాంతో ప్రభుత్వ నిర్ణయం మూలంగా రైతుకి లబ్ది పెరిగింది.
అదే సమయంలో మహిళల ఆధ్వర్యంలో సహకార సంఘాలు ఏర్పాటు చేసి పాల సేకరణ, చిల్లింగ్, ప్రోసెసింగ్ యూనిట్లు ప్రారంభిస్తున్నారు. దాంతో పాటుగా మహిళలకు గేదెలు, ఆవుల కొనుగోళ్లకు ప్రభుత్వం సహాయం అందిస్తోంది. దాంతో ఇప్పటికే పాల సేకరణలో దేశంలో మూడో స్థానంలో ఉన్న ఏపీ మరింత అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతోంది. ప్రస్తుతం సుమారు రోజుకి 200లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతుండగా అది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తద్వారా పాల ఉత్పత్తిలో ఆంద్రప్రదేశ్ కీలక అడుగులు వేసేందుకు ఈ ప్రయత్నం తోడ్పడుతోంది.