Idream media
Idream media
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి రాకముందే తన ఎజెండా ఏంటో స్పష్టంగా చెప్పారు. పేదల ఇళ్లల్లో ఆనందం నింపడమే తన ధ్యేయమన్నారు. తన మేనిఫెస్టో రూపకల్పన కూడా ఆ దిశగానే జరిగింది. అయితే, ఎన్నికలకు ముందు అలాంటి ప్రకటనలు చేయడం, ఆకర్షణీయమైన ప్రకటనలతో మేనిఫెస్టో రూపొందించడం మామూలే. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను అధికారం ముగిసే లోపు కనీసం 50 శాతం కూడా పూర్తి చేయని పార్టీలు, రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 94 శాతం నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే అనడంలో అతిశయోక్తి లేదు. ఫలితంగా పేదల ఆర్థిక ప్రగతి కూడా మెరుగుపడుతూ వస్తోంది.
జగన్ ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ సందర్భంగా మాట్లాడినా పేదల అభ్యున్నతే లక్ష్యమన్న మాటలు తరచూ వింటూనే ఉన్నాం. ఇళ్ల నిర్మాణాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నా కల మీ అందరి కల కావాలి.. మనందరి కల పేదవాడి కల కావాలి” అని వ్యాఖ్యానించడం ద్వారా ఆయన తపనను అర్థం చేసుకోవచ్చు. అమ్మఒడి, పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇళ్ళు, ఫీజు రీయింబర్స్ మెంట్, వైఎస్సార్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం, వైఎస్సార్ ఆసరా – వైఎస్సార్ చేయూత, అందరికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ రైతు భరోసా వంటి నవరత్నాల ద్వారా లక్షల మంది పేదలు లబ్ధి పొందారు. ఈ రెండేళ్లలో నవరత్నాల ద్వారా 6.5 కోట్ల మందికి ( కొందరు ఒకటి కంటే ఎక్కువ పథకాలతో లబ్ధి పొందుతున్నారు) వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రూ.95,528.50 కోట్లు నేరుగా బదిలీ చేశారు. నగదేతర పథకాల ద్వారా మరో 2.36 కోట్ల మందికి రూ.36,197.05 కోట్ల ఆర్థిక ప్రయోజనం కల్పించారు.
కరోనా విపత్తులో కూడా ప్రజలకు భరోసా కల్పించారు. సీఎం జగన్ నోట ఏనాడూ కూడా పథకాల అమలుకు డబ్బుల్లేవు.. అనే మాట రాలేదు. కరోనా విపత్తుతో లాక్ డౌన్, కర్ఫ్యూల నేపథ్యంలో ఆదాయ వనరులు తగ్గిపోయినప్పటికీ నవరత్నాలను అమలు చేస్తూనే ఉన్నారు. తాజాగా పేదలందరికీ ఇళ్లు పథకం (గృహనిర్మాణశాఖ)పై నిర్వహించిన సమీక్షలో పేదల పట్ల ఉన్న తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. పేదల కోసం కడుతున్న ఇళ్లు.. సకల సౌకర్యాలతో ఉండాలని అధికారులను ఆదేశించారు. వారంరోజుల్లో అన్ని లే అవుట్లలో పనులు పూర్తికావాలని.. ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా ఛార్జీలు సహా ఇతరత్రా రేట్లు అమాంతంగా పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
రూ.34వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం అన్నది ఒక కల.. గతంలో రాష్ట్రంలోకాని, దేశంలోకాని మౌలిక సదుపాయాల కల్పనకు ఇలా ఖర్చు చేసిన దాఖలాలు లేవన్న సీఎం.. ఇంత పెద్ద లక్ష్యాన్ని గతంలో ఎవరూ ఆలోచన చేయలేదు, దేవుడి దయ వల్ల ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాం.. అవినీతికి తావుండకూడదు.. నాణ్యతకు పెద్ద పీట వేయాలని.. మనసా, వాచా, కర్మేణా ఈ పనుల పట్ల అధికారులు అంకితభావాన్ని ప్రదర్శించాలని.. అప్పుడే ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతామన్నారు. “పేదల అభ్యున్నతి కోసం నా కల నిజం కావాలంటే మీ అందరి సహకారం కావాలి.. నా కల మీ అందరి కల కావాలి.. మనందరి కల పేదవాడి కల కావాలి.. అప్పుడే ఈ కార్యక్రమం సాకారమవుతుంది” అని అన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలను మురికివాడలుగా కాదు, పేదవాళ్లకు మంచి ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలని చాటి చెప్పడం ద్వారా పేదల పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ అర్థమవుతోంది.
Also Read : అనీల్ అఖిలపక్షం, టీడీపీకి ఊహించని షాక్ …