Idream media
Idream media
మరణించినా ప్రజల మనస్సుల్లో జీవించి ఉండేవారే అసలైన ప్రజా నాయకుడంటారు. అలాంటి వారిలో జాతీయ స్థాయిలో ఇందిరా గాంధీ, రాష్ట్ర స్థాయిలో ఎన్టీఆర్, వైఎస్సార్ ముఖ్యులు. పాలకులుగా వారు ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, విధాన పర నిర్ణయాలతో ప్రజల జీవితాలు మారిపోయాయి. జీవన ప్రమాణాలు పెరిగాయి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రజలు పురోగతి సాధించేలా ఆ మహానేతలు పని చేశారు. ఇందిరా గాంధీ, ఎన్టీఆర్‌లు 20వ శతాబ్దంలో పేరు గాంచగా.. 21వ శతాబ్దంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారు.
తన తండ్రిలాగే తాను కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలన్నదే లక్ష్యమని చెప్పిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి బాటలోనే నడుస్తూ తండ్రికితగ్గ తనయుడుగా పేరొందుతున్నారు.
తన తండ్రి మాదిరిగానే తాను ప్రజల హృదయాల్లో నిలవాలనుకుంటున్న సీఎం జగన్ మొదటి ఏడాదిలోనే ఆ దిశగా ప్రజాభివృద్ధికి పని చేశారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని పల్లెలకు, ప్రజల ముంగిళ్లకు తెచ్చారు. ఒకే సారి 1.34 లక్షల మందిని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించి చరిత్ర సృష్టించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వే కూడా ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఒకేసారి కల్పించలేదంటే అతిశయోక్తికాదు.
అటు ప్రజలకు ప్రభుత్వ సేవలు, ఇటు యువతకు ఉద్యోగాలు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు వల్ల దక్కాయి. తమ జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్ జగన్ పట్ల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కృతజ్ఞతాభావంతో ఉన్నట్లు తాజాగా వారు తీసుకున్న నిర్ణయం ద్వారా అర్థమవుతోంది. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంతోపాటు. తమ జీవితాలకు దారి చూపిన సీఎం వైఎస్ జగన్ జన్మదినం రోజును సచివాలయ దినోత్సవంగా జరుపుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం తీర్మానించింది. ఈ నెల 21వ తేదీన సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది సచివాలయ దినోత్సవంగా జరుపుకోనున్నారు.