iDreamPost
android-app
ios-app

వాలంటీర్‌ మహా సైన్యం సేవలకు సెల్యూట్‌ – సీఎం వైఎస్‌ జగన్‌

వాలంటీర్‌ మహా సైన్యం సేవలకు సెల్యూట్‌ – సీఎం వైఎస్‌ జగన్‌

దేశంలోనే గొప్ప వ్యవస్థ వాలంటీర్‌ వ్యవస్థ అని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కొనియాడారు. వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ వారిని సన్మానించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ పల్నాడు జిల్లా కేంద్రం నరసారావుపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ వాలంటీర్ల సేవలను కొనియాడారు. వారికి సెల్యూట్‌ చేశారు.

‘‘ గొప్ప వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తోంది. 2.60 లక్షల మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. ప్రతి రెండువేల మందికి ఒక సచివాలయం. ప్రతి 50ఇళ్లకు ఒక వాలంటీర్‌. వివక్షకు, లంచానికి తావులేకుండా ప్రతి అర్హుడికి పథకాలు అందిస్తున్నాం. తూర్పున సూర్యుడు ఉదయించకముందే ఉదయాన్నే తలుపుతట్టి చిరునవ్వుతో ప్రతి అవ్వకు, ప్రతి తాతకు మంచి మనవరాలిగా, మనవడిగా.. ప్రతి వికలాంగుడికి, వితంతువుకు చెల్లిలా, తమ్ముడిగా 61 లక్షల మందికి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్‌ నగదు అందిస్తున్నారు.

ప్రభుత్వం అంటే కార్యాలయాల చుట్టూ తిరగాలి. చెప్పులు అరిగేలా తిరిగితే తప్పా అనే పాత భ్రమలను కొట్టిపారేసి.. ప్రభుత్వమంటే లంచాలు ఇస్తేనే పనులుకావనే నమ్మకానికి పాతరవేసి.. లంచాలకు తావులేని పాలన,వివక్షకు చోటులేని పాలన, కులాలకు, మతాలకు, రాజకీయాలకు, పార్టీలకు తావులేకుండా, సహాయం అందుతున్న వ్యక్తి మన పార్టీకి ఓటు వేశాడా..?లేదా..?అనేది చూడకుండా సచివాలయం, వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు.

మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వాలంటీర్‌ చెల్లెమ్మలు, తమ్ముళ్లు కేవలం అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్‌ రూపంలో 50,508 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 1.34 లక్షల కోట్ల రూపాయలు నేరుగా బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం.

గతానికి, ప్రస్తుతానికి తేడాను గమనించండి. ఇది కాదా అభివృద్ధి..? అని అడుగుతున్నా. రేషన్‌కార్డులు, అమ్మ ఒడి, ఇళ్ల స్థలాల పట్టా. జగనన్న తోడు, వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ చేయూత, పంటల భీమా, కంటి వెలుగు, మత్స్యకార భరోసా, జలకళ, జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్సార్‌ వాహన మిత్ర, వైఎస్సార్‌ నేతన్న నేస్తం, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం సహా 33 పథకాలను ప్రతి ఇంటికి వివక్షకు, లంచాలకు తావులేకుండా, రాజకీయాలకు చోటు లేకుండా ప్రతి అర్హుడికి అందుతున్నాయి. ఇంతకన్నా గొప్పపాలన, గొప్ప పరిస్థితులు గతంలో చూశామా..? అని ఒక్కసారి ఆలోచన చేయండి.

దిశ వంటి చట్టం, దిశ యాప్‌ ద్వారా అక్కచెల్లెమ్మలు ధైర్యంగా బయటకు వస్తున్నారు. ఆపదలో ఉంటే 10 లేదా 20 నిమిషాల్లో పోలీసులు వచ్చి ఆదుకుంటున్నారు. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌లో వాలంటీర్ల పాత్ర కీలకం. ప్రభుత్వ పథకాలు, పాలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సంక్షేమ క్యాలెండర్‌ను ప్రజలకు వివరిస్తున్నారు. వివిధ పథకాల లబ్ధిదారులను దగ్గర ఉండి వారి చేత దరఖాస్తు చేయించే పరిస్థితి మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. ఈ సేవలను భారతదేశం అభినందిస్తోంది. రాష్ట్రం మీ సేవలకు సెల్యూట్‌ చేస్తోంది.

ఎక్కడా కూడా అవినీతికి చోటు లేకుండా పాలన రావాలని కలలు కన్నాం. ఆ కల వాలంటీర్ల ద్వారా నెరవేరుతోంది. ఎండ, వాన, వరద, చలి, సెలవు, పండగ, కరోనా కష్టకాలంలో సైతం వెనుదిరగకుండా, వెన్నుచూపకుండా ప్రజా సేవే పరమావధిగా పనిచేస్తున్న వాలంటీర్‌ సైన్యాన్ని చూసి రాష్ట్రం గర్వపడుతోంది. వాలంటీర్లకు చిరు సత్కారం ఈ రోజు నుంచి 20 రోజులపాటు జరుగుతుంది. స్వచ్ఛందంగా చేస్తున్న సేవలకు నిండు మనసుతో గౌరవించేందుకు ఈ సన్మాన కార్యక్రమం చేపడుతున్నాం. వరుసగా రెండో ఏడాది మన వాలంటీర్లకు అందరికీ ఈ రోజు వందనం చేస్తున్నాం.

సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేరుతో వాలంటీర్లకు పురస్కారం అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సన్మానంతోపాటు నగదు బహుమతి, బ్యాడ్జ్‌ అందిస్తున్నాం. ఈ ఏడాది 2.28 లక్షల మంది వలంటీర్లకు సేవా మిత్ర కింద పదివేల రూపాయల నగదు, బ్యాడ్జ్, శాలువా కప్పి సన్మానం చేసి, సేవకు సర్టిఫికెట్‌ ఇస్తాం. సేవా రత్న కింద మండలానికి ఐదుగురు, మున్సిపల్, నగరపాలక సంస్థల్లో 10 మంది చొప్పున 4136 మంది వాలంటీర్లకు అవార్డు ఇస్తున్నాం. దీని కింద 20 వేల నగదు, శాలువాతో సత్కారం, మెడల్, బ్యాడ్జ్, సర్టిఫికెట్‌ ఇస్తాం.

సేవా వజ్ర కింద నియోజకవర్గంలో ఐదుగురిని ఎంపిక చేశాం. మొత్తంగా రాష్ట్రంలో 875 మంది వాలంటీర్లకు అందిస్తున్నాం. 30 వేల నగదు, మెడల్, బ్యాడ్జ్, శాలువాతో సన్మానం చేసి సర్టిఫికెట్‌ ఇస్తాం. 2.33 లక్షల మందికి 239 కోట్ల రూపాయల నగదు బహుమానంగా ఇవ్వబోతున్నాం.

గత సంవత్సరం 226 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ ఏడాది 239 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మొత్తంగా 465 కోట్ల రూపాయల నగదు పురస్కారం అందించామని సగర్వంగా చెబుతున్నాను. 2.60 లక్షల ఈ గొప్ప వ్యవస్థలో 55 శాతం మంది చెల్లెమ్మలే. రాబోయే రోజుల్లో మీరందరూ ఇలాగే పని చేయాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.