iDreamPost
iDreamPost
రాష్ట్రపతిగా తొలిసారి ఏపీకి వచ్చిన ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. పౌర సన్మానం చేసింది. పోరంకిలో సీఎం జగన్ ఆమెకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, శ్రీవారు కొలువైన ఈ నేలకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అన్న రాష్ట్రపతి, అన్ని భాషల్లోకెల్లా తెలుగు శ్రేష్టమైనదని చెప్పారు.
దేశ చరిత్రలోనే తొలిసారి ఒక గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) రాష్ట్రపతి పదవిని చేపట్టడం చాలా గర్వకారణమని సీఎం జగన్ (CM Jagan) ప్రశంసించారు. ద్రౌపది ముర్ము జీవితం నుంచి ఎంతో నేర్చుకోవాలని, కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కోవడం అందరికీ ఆదర్శమన్నారు. ఒక సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, అణగారిన వర్గాల కోసం అచంచలమైన కృషి చేసిన వ్యక్తిగా అన్నింటికంటే మించి ఒక గొప్ప మహిళగా శ్రీమతి ద్రౌపతి ముర్ముగారి ఉదాత్తమైన జీవితం ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శనీయమని అన్నారు సీఎం జగన్.
“రాజ్యాంగ పరంగా నిర్ధేశించిన అర్హతలు ఉన్న ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా ఈ దేశంలో ఎంతటి స్థానానికైనా చేరుకోగలరన్నదానికి ద్రౌపతి ముర్ముగారు ఒక గొప్ప ఉదాహరణగా దేశచరిత్రలో ఎప్పటికీ నిల్చిపోతారు. జీవితంలో మీరు పడ్డ కష్టాలను చిరునవ్వుతోనే స్వీకరించి, సంకల్పంతో మీరు ముందుకు సాగిన తీరు ఈ దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఆదర్శనీయంగా నిలుస్తుంది. ఒడిషాలో అత్యంత వెనుకబడి మయూరుభంజ్ ప్రాంతంలోని సంతాలీ గిరిజన కుటుంబంలో జన్మించిన మీరు ప్రాధమిక విద్యను కూడా పూర్తి చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. చదువుకోవాలి, చదువు మాత్రమే జీవితాలను మారుస్తుందని గట్టిగా విశ్వసించిన మీరు భువనేశ్వర్ వెళ్లి అక్కడే బీఏ పూర్తి చేశారు. మీ గ్రామానికి సంబంధించినంతవరకు కాలేజీ వరకు వెళ్లి డిగ్రీ పట్టా పొందిన తొలి మహిళ మీరు కావడం అప్పట్లో ఓ విశేషం” అని సీఎం జగన్ గొప్పగా చెప్పారు.
“ఇరిగేషన్, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అక్కడ నుంచి కౌన్సిలర్‌గానూ, తొలిసారిగా 2000 సంవత్సరంలో రాయరంగపూర్ అసెంబ్లీ స్ధానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, 2009 వరకు కూడా అదే పదవిలో కొనసాగుతూ, ఒడిషా ప్రభుత్వంలో వాణిజ్య సహాయమంత్రిగాను, మత్స్య, పశుసంవర్ధకశాఖమంత్రిగానూ పనిచేశారు. ప్రజా సేవలోనే మీ చిత్తశుద్ధి, మీ కార్యదీక్షకు, మీ నిజాయితీకి మిమ్నల్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లి, 2015లో జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులు కావడం, ఆ తర్వాత ఇప్పుడు మన దేశ రాష్ట్రపతిగా మన రాష్ట్రానికి తొలిసారిగా రావడం మా అందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయమన్నారు.
అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనంతో రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికారు.
అనంతరం రాష్ట్రపతి ముర్ము, ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా పోరంకికి బయలుదేరారు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.