Idream media
Idream media
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం భోదన వెనకున్న లక్ష్యాన్ని సీఎం జగన్ ఒంగోలు లో ‘మన బడి నాడు – నేడు’ కార్యక్రమం ప్రారంభం వేదికగా వివరించారు. అసలు ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టాలని అనుకుంటున్నారో, దాని వాళ్ళ లాభాలు ఏమిటో..? ఆచరణలో వచ్చే ఇబ్బందులు, విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు, ఏమిటో..? వాటిని ఎలా ఎదురుకుంటామో, అందుకు ఎలాంటి ప్రణాళికలు రచించారో.. కూలంకుషంగా వివరించారు. ఇంగ్లీష్ మీడియం బోధనను వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులకు, ఈ చర్య వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతారంటున్న విద్యాధికులు సందేహాల నివృత్తి చేసేలా జగన్ ప్రసంగం సాగింది. వివరాలు అయన మాటల్లోనే..
‘‘ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలను తీర్చిదిద్దాల్సి ఉంది. ప్రభుత్వాలు వాళ్లకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఒక మంచి నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలి. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలను చదువుల దేవాలయాలుగా మారుస్తాం. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సినీ నటులు ఎవరు కూడా వాళ్ల పిల్లలను తెలుగు మీడియంలో చదివించడం లేదు. సంస్కృతి పేరుతో పిల్లల భవిష్యత్‌ను పట్టించుకోకపోతే భావితరాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో తెలుగు ప్రజలు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.
పిల్లలకోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే.. రాజకీయం కోసం ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసేవారు హిపోక్రసీని వదిలి డెమొక్రసీకి విలువ ఇవ్వాలి. కేవలం కొందరు బాగుపడితే సమాజం బాగుపడదు. అందరూ బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గం. చరిత్రను మార్చే తొలి అడుగులు ఇవాళ వేస్తున్నాం. పాదయాత్రలో నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నానని చెబుతూ అడుగులు వేస్తున్నాం. నాడు-నేడుతో ప్రతీ పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదిలో ట్యూబ్‌లైట్లు, ఫర్నీచర్, స్కూల్‌కు కాంపౌండ్ వాల్, ల్యాబ్స్ వంటి సకల సౌకర్యాలను కల్పిస్తాం. అదేవిధంగా ప్రతీ స్కూళ్లో 1 నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాం. తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుంది. ప్రతీ స్కూళ్లో పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేశాం.
అయితే ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే కొన్ని సమస్యలు వస్తాయన్న విషయం తెలుసు. వాటిని అధిగమించేందుకు బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేస్తాం. టీచర్లకు శిక్షణ ఇస్తాం. ఒకట్రెండు సంవత్సరాలు కష్టపడ్డా.. ఆ తర్వాత పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ముందుకెళ్లారు. ప్రతీ ఏడాది స్కూళ్ల కోసం రూ.3500 కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే కాలంలో రాష్ట్రంలోని 45 వేల స్కూళ్ల రూపురేఖలను మారుస్తాం. తొలి విడతలో భాగంగా దాదాపు 15,700 పాఠశాలల్లో నాడు-నేడు ప్రారంభిస్తాం. జూన్, 2020 నాటికి పాఠశాలల్లో అన్ని వసతులు తీసుకొస్తాం. జనవరి 9న అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు ఇస్తాం. అదేవిధంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూడా తీసుకొస్తున్నాం. హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఖర్చుల కోసం ఏడాదికి రూ. 20 వేలు ఇస్తాం” అని సీఎం జగన్ వివరించారు.