కుప్పం వైపు జ‌గ‌న్ చూపు..

టిడిపి అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక చొర‌వ తీసుకుంటున్నారా.. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్నా జ‌ర‌గ‌ని ప‌నుల‌ను ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్నారా.. తాజాగా ఆయ‌న చూపుతున్న చొర‌వ‌తో కుప్పంలో ఏం జ‌రుగ‌నుందోన‌ని అంతా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన కుప్పంను మున్సిపాలిటీ చేయాల‌న్న డిమాండ్ ఇప్ప‌టిది కాదు. 2014 ఎన్నిక‌ల్లో టిడిపి అధికారం చేప‌ట్టిన త‌ర్వాత నుంచి కుప్పం గ్రామ పంచాయ‌తీని మున్సిపాలిటీగా మార్చాల‌న్న వాద‌న ఉంది. రెండేళ్ల క్రిత‌మే ఈ మేర‌కు ఉత్వ‌ర్వులు వెలువ‌డుతాయ‌ని అంతా భావించారు. అయితే 2019 జ‌న‌వ‌రి 7న గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోని ఏడు గ్రామాల‌ను క‌లుపుతూ మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ ఉత్వ‌ర్వ‌లు ఇచ్చారు. అయితే ఆ త‌రువాత రాష్ట్రంలో ఎన్నిక‌లు రావ‌డంతో అధికారిక చ‌ర్య‌లు అమ‌లుకు నోచుకోలేదు.

2019 ఎన్నిక‌ల్లో కుప్పం అసెంబ్లీ నుంచి చంద్ర‌బాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందినా.. రాష్ట్రంలో వై.సీ.పీ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో అమ‌లుకు నోచుకోని ఉత్వ‌ర్వుల‌ను మ‌ళ్లీ కొన‌సాగించేందుకు వైసీపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. అప్పుడు విడుద‌ల చేసిన జీ.వో నెంబ‌ర్ 18కి కొన‌సాగింపుగా అధికారిక ఉత్వ‌ర్లులు జారీ చేసింది. దీంతో కుప్పం పంచాయ‌తీలోని చీల‌ప‌ల్లి, ద‌ళ‌వాయికొత్త‌ప‌ల్లి, చీమ‌నాయునిప‌ల్లి, సామ‌గుట్ట‌ప‌ల్లి, తంబుగానిప‌ల్లి, క‌మ‌త‌మూరు, అనిమిగానిప‌ల్లి గ్రామాల ప‌రిధులు విలీన‌మై మున్సిపాలిటీగా మార‌నుంది. గ్రేడ్ 3 మున్సిపాలిటీ అవుతున్న కుప్పంలో నిబంధ‌న‌ల ప్ర‌కారం అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టనున్నారు. దీంతో కొన్నేళ్లుగా మున్సిపాలిటీగా రూపాంత‌రం చెందాలన్న కుప్పం వాసుల కోరిక జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక పూర్తి స్థాయిలో నెర‌వేరుతోంది. కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి ప‌నులు పెద్ద ఎత్తున చేప‌ట్టే అవ‌కాశం ఉంది. అన్ని ప్రాంతాలు స‌మాన స్థాయిలో అభివృద్ధి చెందాలంటున్న జ‌గ‌న్ నిర్ణ‌యంతో మున్సిపాలిటీగా మారిన కుప్పం కూడా అభివృద్ధి చెందనుంది.

ఇక కుప్పం మున్సిపాలిటీ ప‌రిధి దాటి నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తే కుప్పం, రామ‌కుప్పం, గుడుప‌ల్లె, శాంతిపురం మండ‌లాలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు 1,00,146 ఓట్లు రాగా, వైసీపీ అభ్య‌ర్థి కె. చంద్ర‌మౌళికి 69,424 ఓట్లు వ‌చ్చాయి. అయితే అంత‌కుముందు 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు 1,02,952 వ‌చ్చాయి. అప్పుడు కూడా వైసీపీ త‌రుపున చంద్ర‌మౌళి పోటీ చేశారు. అయితే 2014 ఎన్నిక‌ల్లో కంటే 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడుకు ఓట్లు త‌గ్గాయి. వైసీపీ అబ్య‌ర్థికి 13,585 ఓట్లు పెరిగాయి. దీన్ని బ‌ట్టి చూస్తే బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌పై పెరుగుతున్న వ్య‌తిరేక‌త మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది.

ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన అనంత‌రం కుప్పంపై దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. చంద్ర‌బాబుకు రోజురోజుకు ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పంను కైవ‌సం చేసుకునేందుకు వైసీపీ ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళికా బ‌ద్దంగా ముందుకు వెళుతోందా అంటే కాద‌ని చెప్ప‌లేం.

Show comments