Idream media
Idream media
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ఎన్నికలు ఎక్కడ ఆగాయో అక్కడ నుంచే ప్రారంభం అవడం దాదాపు ఖాయమైంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడమే ఇక మిగిలి ఉంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ గత ఏడాది మార్చిలో కరోన కారణంగా వాయిదా పడింది. ఆరు వారాలు వాయిదా వేసిన ఎన్నికల కమిషన్.. ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగడంతో ఇప్పటి వరకు తిరిగి ప్రారంభం కాలేదు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇవి ముగిసిన తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ సంకేతాలు ఇచ్చింది.
అయితే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయంటూ.. ప్రతిపక్ష పార్టీలు ఆ ఎన్నికలను రద్దు చేయాలని, తిరిగి మొదట నుంచి నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతులిచ్చాయి. బయట మీడియా సమావేశాల్లోనూ సందర్భం వచ్చిన ప్రతి సారి డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోంది. ఎన్నికలు మళ్లీ మొదటి నుంచి జరుగుతాయని కొందరు. ఆగిన చోట నుంచే మళ్లీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని మరికొందరు.. ఇలా ఎవరికి వారు విశ్లేషణలు చేస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.
అయితే తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌తో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయో ఓ క్లారిటీ వచ్చేసింది. మున్సిపల్ ఎన్నికలు ఎక్కడ ఆగాయో తిరిగి అక్కడ నుంచే మొదలవుతున్నాయి. నామినేషన్ల పరిశీలన వరకు మున్సిపల్ ఎన్నికలు గత మార్చిలో జరిగాయి. నామినేషన్ల ఉపసంహరణ నుంచి ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి. వచ్చే నెల 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, 10వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌లో పేర్కొంది. అవసరమైన చోట 13వ తేదీ రీ పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌తో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ఆగిన చోట నుంచే ప్రారంభం అవుతాయని స్పష్టమైన సంకేతాలు అయితే వెలువడ్డాయి. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల ప్రకటన వరకు జరిగింది. ప్రచారం వద్ద వాయిదా పడింది. ఎన్నికల కమిషన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తప్పా.. ఈ ప్రక్రియ తిరిగి ప్రచారం వద్ద ప్రారంభమవుతుంది. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సాఫీగా జరుగుతాయా..? లేదా…? అనేది త్వరలోనే తేలనుంది.