Idream media
Idream media
సినిమా , పాలిటిక్స్ ఈ రెండు రంగాలు డబ్బు, గ్లామర్‌తో కూడుకుని ఉంటాయి. రాజకీయాల్లో అధికారం అదనంగా ఉంటుంది. అందుకే రాజకీయ నాయకులు తమ పిల్లల్ని సినిమా హీరోలు చేయాలనుకుంటారు. సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావాలనుకుంటారు.
అయితే నాయకుల పిల్లలు, హీరోలు కావడం ఎంత కష్టమో (స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు రితీష్‌లు మినహాయింపు) హీరోలు నాయకులు కావడం కూడా అంతే కష్టం. దీనికి కారణం మన హీరోలు ఒక భ్రాంతిలో జీవిస్తూ ఉంటారు. చుట్టూ వాళ్లని పొగిడే వాళ్లే తప్ప విమర్శించే వాళ్లు ఉండరు. కానీ రాజకీయాల్లో తిట్టే వాళ్లే ఎక్కువ ఉంటారు. పొగడ్తలకి అలవాటు పడిన వాళ్లు, తిట్లు స్వీకరించలేరు. ఒకప్పుడు ఎన్టీఆర్ హయాంలో ఇన్ని సౌఖ్యాలు ఉండేవి కావు. షాట్ గ్యాప్‌లో ఎండలోనే Wait చేసేవాళ్లు. ఇపుడు ఒక్క సెకన్ ఆలస్యం లేకుండా AC వ్యాన్‌లోకి వెళ్లిపోతారు. ఎండలో కాసేపు ఉండలేరు, నడవలేరు.
పవన్ ఫెయిల్యూర్‌కి ఇదే కారణం. ఆయన ఎండలో నడవలేడు. ధర్నాలకి పిలుపు ఇస్తాడు కానీ, శ్రమని భరించలేడు. జగన్‌లా నడిస్తే వారం రోజుల్లో Sick అయిపోతాడు.
పవన్ మాత్రమే కాదు, ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత లాంటి కొందరిని మినహాయిస్తే సినిమా వాళ్లు ఎవరూ సీరియస్‌గా రాజకీయాల్లో పని చేసింది లేదు. చిరంజీవి ఏడాదికే అలసిపోయాడు. రాజశేఖర్, జీవితలు కబుర్లు చెబుతారే కానీ జనంలో పనిచేయలేరు. నాగబాబు తమ్ముడిలాగే సీజనల్ పొలిటీషియన్. ఆలీ, పృద్వీ, మురళీమోహన్, కవిత, వాగి విశ్వనాథ్ వీళ్లంతా ఏదో ఒక అండ కోరుకుంటారు తప్ప జనంలో తిరగలేరు. కేంద్రమంత్రిగా చేసిన కృష్ణంరాజు కూడా ప్రజానాయకుడు కాదు. దాసరి ఎంతోకొంత జనం మనిషి.
గతంలో రావుగోపాల్‌రావు, సత్యనారాయణ, కోటా, బాబూ మోహన్…ఇలా ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. రోజాకి వాగ్ధాటి ఉంది కానీ, పూర్తి సమయాన్ని రాజకీయాలకి వెచ్చించడం లేదు.
ఇక రాజ్యసభ ఉత్సవ విగ్రహాల గురించి చెప్పుకునే పనిలేదు. ఈ సినిమా వాళ్లు , ఆ పరిశ్రమ సమస్యల గురించి ఏనాడూ నోరు విప్పరు. రేఖ, రూపాగంగూలి, జయభాదురి, సురేష్‌గోపి, షభానా, హేమ, ధారాసింగ్, వైజయంతి వీళ్లు ఎపుడైనా మాట్లాడారా? చట్ట సభలకి వీళ్లు అనవసరమైన భారం.
గతంలో నర్గిస్‌దత్ ఆరేళ్లు రాజ్యసభలో ఉన్నారు. ఎప్పుడూ నోరు విప్పింది లేదు. అయితే ఆమె భర్త సునీల్‌దత్ జనంలో పనిచేసిన వ్యక్తి. శివాజీగణేషన్ కూడా చాలా కాలం రాజకీయాల్లో చురుగ్గా పనిచేశారు.
కృష్ణా, జమున, రామానాయుడు, శారద, జయప్రద వీళ్లంతా పార్లమెంట్‌లో కనిపించే వాళ్లే తప్ప వినిపించే వాళ్లు కాలేకపోయారు.