iDreamPost
iDreamPost
సినీ నటి జీవితా రాజశేఖర్ వ్యవహారం చాలాకాలంగా చర్చనీయాంశంగా ఉంటుంది. ముఖ్యంగా సినీ, రాజకీయ రంగాల్లో ఆమె పయనం అనేక మలుపులు తీసుకుంది. పలు పార్టీలు మారుతూ వచ్చింది. చివరకు తాజాగా మరోసారి బీజేపీలో చేరాలని ఆమె ఉబలాటపడ్డారు. ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేతుల మీదుగా కండువా కప్పుకోవాలని ఆమె ఆశించారు. కానీ తీరా చూస్తే సంజయ్ స్పందన ఆసక్తికరంగా కనిపించింది. తన పక్కనే నిలుచుకున్నప్పటికీ జీవితకు మాత్రం ఆయన కండువా కప్పకుండానే కార్యక్రమం ముగించడం విశేషం. అయినప్పటికీ వెనుకాడకుండా జీవిత తన మెడలో తానే కాషాయ కండువా కప్పుకుని బీజేపీలో చేరినట్టు ప్రకటించడం ఆశ్చర్యకరంగా మారింది.
పార్టీలు మారిన ప్రతీ సందర్భంలోనూ కండువాలు కప్పుకోవడం వర్తమాన ట్రెండ్. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు కండువాలు కప్పుకున్న జీవిత, రాజశేఖర్ దంపతులు ఆ తర్వాత పెద్ద వైఎస్సార్సీపీ వ్యవహారాల్లో కనిపించలేదు. కనీసం ఎన్నికల ప్రచారంలో కూడా వారిని పెద్దగా ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. దాంతో స్తబ్దతగా ఉన్న వారివురు ఈసారి బీజేపీ బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ కరోనా కారణంగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నప్పటికీ కొన్నాళ్లు విశ్రాంతి అవసరం అని వైద్యులు చేసిన సూచన మేరకు ఇంట్లోనే ఉంటున్నారు.
దాంతో ఇరువురు కలిపి కండువా కప్పుకునే కార్యక్రమానికి అవకాశం లేకుండా పోయింది. బండి సంజయ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరేందుకు జీవిత ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రేటర్‌కు చెందిన కొందరు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్న సమయంలో ఆమె కూడా కమలం బాటలో సాగేందుకు సిద్ధమయ్యారు. కానీ సాధారణ కార్యకర్తలకు సైతం తమ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన బండి సంజయ్ పక్కనే ఉన్న జీవితకు మాత్రం పార్టీ కండువా మెడలో వేయకపోవడం కొసమెరుపుగా మారింది. అది గమనించిన జీవిత తన మెడలో తానే బీజేపీ కండువా వేసుకోవడం మరో విశేషం.
ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సందర్భంగా జీవిత, రాజశేఖర్ రాజకీయాలు హాట్ టాపిక్ అయ్యాయి. అప్పట్లో చిరంజీవి మీద వారు చేసిన వ్యాఖ్యలు, దానికి చిరు అభిమానులు ప్రతిస్పందన పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీ, టీడీపీ, వైసీపీ, మళ్లీ బీజేపీ అన్నట్టుగా వారి రాజకీయ పయనం సాగుతుండడం గమనార్హం.