iDreamPost
android-app
ios-app

అక్కడ స్కూల్ ఫీజులకు బదులు.. ప్లాస్టిక్ బాటిల్స్ తేస్తే సరి..!

అక్కడ స్కూల్ ఫీజులకు బదులు.. ప్లాస్టిక్ బాటిల్స్ తేస్తే సరి..!

నేడు విద్యా వ్యవస్థ కమర్షియల్ అయిపోయింది. ప్రభుత్వ బడులు అటు ఉంచితే.. ప్రైవేటు పాఠశాలల్లో డొనేషన్లు, అడ్మిషన్, బిల్డింగ్ ఫీజ్ అంటూ డబ్బులు గుంజేస్తున్నారు. నర్సరీ నుండే తల్లిదండ్రుల నుండి లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈ ప్రైవేట్ సూళ్ల దందా అంతా ఇంతా కాదు. చిన్నప్పటి నుండే నీట్, మెయిన్స్ శిక్షణ అని మభ్యపెడుతూ.. మరింత కాజేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రైవేటు పాఠశాల  కాస్త వినూత్నం..  ఫీజును భిన్నంగా వసూలు చేస్తున్నారు. ఇది ఏ మాత్రం పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భారం కాదూ. ఇంతకు ఆ ఫీజు ఎలా వసూలు చేస్తున్నారంటే..ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే సరిపోతుంది. ఈ స్కూల్ ఎక్కడ ఉందంటే అస్సాంలో.

అస్సాంలోని పామోహి ప్రాంతంలో ఉంది అక్షర స్కూల్. దీన్ని పరిమిత శర్మ, మజిన్ ముఖ్తార్ అనే దంపతులు 2016లో దీన్ని స్థాపించారు. ఆ ప్రాంతంలో రెండు సమస్యలను గుర్తించిన ఈ దంపతులు.. వాటికి పరిష్కార మార్గం ఎంచుకున్నారు. అక్కడ ఎక్కువ మంది క్వారీల్లో పనిచేసే వారు ఉన్నారు. వీరికి బడి ఫీజులు చెల్లించడం చాలా కష్టం కనుక.. పిల్లల్నిచదువుకోవడానికి పంపేవారు కాదూ. నిరక్షరాస్యతతో పాటు ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉండటాన్ని గమనించిన ఈ దంపతులు.. ఒకే సారి ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఈ స్కూల్ ప్రారంభించారు. పిల్లల ఫీజులకు బదులు.. ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకు వస్తే సరిపోతుంది. ప్రతి వారం విద్యార్థులు 25 ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకురావాలని కండీషన్ పెట్టారు.

ఇలా తీసుకువచ్చిన ప్లాస్టిక్‌ను మరింత రీసైకిల్ చేస్తున్నారు. అంతే కాదూ.. సీనియర్ విద్యార్థులు.. చిన్న పిల్లలకు పాఠాలు నేర్పడం, డబ్బు సంపాదించడం వంటివి నేర్పిస్తున్నారు. విద్యార్థులకు నైతిక విలువలతో పాటు చెత్త రీ సైక్లింగ్, గార్డెనింగ్ మొదలైనవి బోధిస్తున్నారు. దీంతో స్కూల్ డ్రాపౌట్ రేటు తగ్గిపోయింది. ఈ పాఠశాల ఆర్థికంగా వెనుకబడిన వందలాది మంది విద్యార్థులను మంచి విద్యను అందిస్తోంది. ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ప్రయోజనాల గురించి గ్రామస్థులకు కూడా చెప్పడంతో.. ప్లాస్టిక్ రీ సైక్లింగ్ డ్రైవ్ లో ఆ గ్రామ ప్రజలు కూడా పాల్గొంటున్నారని చెబుతున్నారు ఈ దంపతులు.