iDreamPost
android-app
ios-app

వెజ్ మంచూరియా ఆర్డర్ చేస్తే.. చికెన్ ముక్కలు వచ్చాయి – స్విగ్గీపై మండిపాటు

వెజ్ మంచూరియా ఆర్డర్ చేస్తే.. చికెన్ ముక్కలు వచ్చాయి – స్విగ్గీపై మండిపాటు

శాకాహారం, మాంసాహారం వంటి ఆహారపు అలవాట్లు వారి వారి వ్యక్తిగత అభిరుచులు. వాటని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. అయితే మీరు పూర్తి వెజిటేరియన్ గా ఉంటూ, నాన్ వెజ్ తినాల్సి వస్తే..? ఆ ప్రశ్నే చాలా ఇబ్బందికరంగా ఉంది కదా!! తాజాగా స్విగ్గీ రెస్టారెంట్ పార్ట్ నర్ వల్ల అలాంటి దుస్థితినే ఎదుర్కొన్నాడు తమిళ పాటల రచయిత.

తమిళంలో పాటల రచయితగా ఉన్న కో శేష బెంగళూరులో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. స్విగ్గీ యాప్ ద్వారా “గోబీ మంచూరియా, కార్న్ ఫ్రైడ్ రైస్” ను ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ దగ్గర నుంచి ఫుడ్ రాగానే తినేశాడు. కానీ కొద్దిసేపటికి ఏదో తేడా అనిపించి, ఆహారాన్ని పరిశీలించాడు. తన మిత్రులకు చూపించగా, అది చికెన్ అని చెప్పడంతో ఖంగుతిన్నాడు.

వెంటనే స్విగ్గీకి కాల్ చేసిన శేష, సదరు సంస్థతో మాట్లాడగా.. ఆర్డర్ విలువ రూ.70 ను తిరిగి ఇస్తామని చెప్పింది స్విగ్గీ. ఆ మాటలకు మరింత బాధపడిన శేష.. తన విశ్వాసాలకు కేవలం 70 రూపాయల వెల కడతారా అంటూ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశాడు. తనకు సరైన రీతిలో క్షమాపణలు చెప్పని పక్షంలో, అవసరమైతే సదరు డెలివరీ యాప్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పాడు.

దీనిపై స్విగ్గీ కూడా స్పందించింది. కస్టమర్ శేష కు కలిగిన ఇబ్బంది తమ వల్ల కాదని, రెస్టారెంట్ భాగస్వామి చేసిన తప్పిదం వల్లే ఇలా జరిగిందని తెలిపింది. అసలు ఏం జరిగిందో తెలసుకొని శేషకు వివరణ ఇస్తామని స్పష్టం చేసింది.