దిగువ మందపల్లె పల్లెనీ పొలాల్ని నేలమట్టం చేసిన వరద చెయ్యేరు పాపరాజుపల్లె దగ్గర కొంచెం శాంతించింది. శాంతించడమంటే జాలిపడి కాదు అవకాశం లేక. ఆ ఊరు ఏటిని ఆనుకునే ఉన్నప్పటికీ కొంచెం గట్టుమింద ఉంది. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి ఇంట్లో సామాన్లు, ఇతర సామాగ్రిని ముంచెత్తింది గానీ ప్రాణ నష్టం ఏమీ లేదు. దిగువనున్న రెండు ఇళ్లులు మాత్రం పునాదులతో పెకిలించబడ్డాయి. పొలాలు లేవు కాబట్టి పంట నష్టం కూడా పెద్దగా లేదు.
ఆ తర్వాత భీమేశ్వరాలయ పాదాలను తాకుతూ శేషమాంబపురాన్ని ముంచెత్తాలని శత విధాలా ప్రయత్నించింది గానీ ఇటువంటి వరద ప్రవాహాల నుంచి ముందు జాగ్రత్త కోసమని కట్టిన రాతి కట్టకం ముందు దాని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ వరద నుంచి ఆ శివుడే మమ్మల్ని కాపాడినాడు అనుకుంటున్న ఆ గ్రామ ప్రజల నమ్మకం వెనకాల ఉన్న కట్ట ఇదే. అదీ గాక ఆ భీమేశ్వరాలయం ఉన్న గట్టు కూడా వంపు తిరిగిన నదీ ప్రవాహ వేగాన్ని ఆపి రెండు గ్రామాలను చాలా వరకూ ఆపగలిగింది లేకుంటే మరింత నష్టం జరిగిండేది.
Read Also: చెయ్యేటి వరద#1
ఎంత భర్తవైనా నా ప్రవాహ వేగాన్నే ఆపుతావా అని భర్త శివయ్య మింద అగిలిన గంగమ్మ అదే కోపంతో శేషమాంబపురం దిగువన కట్టను తెగ్గొట్టగలిగింది. ఆ ప్రభావం ఆ వాలులో ఉన్న పది కుటుంబాలు నివాసముండే కొత్తపేట మింద పడింది. అప్పటికే అన్నమయ్య డ్యాం పూర్తిగా తెగడంతో వరదమీద మరింత ఒత్తిడి పడి ఆ ప్రభావం దిగువ పల్లెల మింద బలంగా పడింది.
అప్పటివరకూ నెమ్మదిగా పెరుగుతున్న నీటి మట్టం అడ్డు కట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా విరుచుకుపడింది. దెబ్బకు ఏం సర్దుకోవాల్నో కూడా తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికితే చాలురా అని తిప్పవైపుగా పరిగెత్తసాగారు. ఎవరో మిస్సయ్యారే అని చూస్తే భర్త చనిపోవడంతో రెండు నెలలుగా ఒంటరిగా కమిలిపోతున్న పెద్దమ్మ గుర్తొచ్చింది మెడికల్ రెప్రజెంటేటర్ గా చేసే అబ్బాయికి. “ఏం పెద్దమ్మా ఇంగా ఈన్నేపనుకోనుండావు బెన్నే రా పోదాం” అంటే “ఆ.. ఆ ఏరు వచ్చేదిలే పాడులేదులే. అంతగా వచ్చే పోతాపో నాయనా” అని మంచమ్మిందనే ఒత్తిగిలి పడుకుంది. రెండు మూడు సార్లు పిలిచి చూశాడు గానీ ఆమె కదల్లేదు ఒక రకమైన నిర్లిప్తతలో. తనుగాంగ చేసేదేం లేదు కదా అని బయటికి పరిగెత్తాడు.
ఏమనుకుందో ఏమో కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చి చూడగానే అప్పటివరకూ ఉన్న నిరాసక్తత స్థానంలో చావు భయం ఆక్రమించింది. మిద్దెక్కుదామంటే ధైర్యం చాలక బయటికి పరిగెత్తింది. ఆలోపే వరద ఇంటి ప్రహరీని తెగ్గొట్టింది. ఈమె నాలుగడుగులు వేసి ఊరి మధ్యలోకి వచ్చేలోపు ఉవ్వెత్తునొచ్చిపడ్డాయి వరద నీళ్లంతా.
Read Also: Cheyyeeru Floods2 – చెయ్యేటి వరద – 2
రోజూ మజ్జానం కబుర్లు చెప్పుకునే ముసిలామ మరణంలో తోడు అన్నట్టుగా ఇటుగా రాసాగింది. చూసి పలకరించేలోపు పెద్ద రాకాసి ఆలోచ్చి ఆమెను కళ్ళముందే లాక్కపోయింది. అది చూడ్డంతో ఇక ప్రాణంతో బతికిబట్టగలుగుతా అనే ఆశ చచ్చిపోయి చేసేదేం లేక పారిపోయే సమయం చిక్కక ఏదైతే అది కానీలే అని అక్కడున్న రేకుల షెడ్డు చాటున నిలబడి చివరి నిమిషంలో ప్రాణం దక్కించకోగలిగింది. అదంతా విని “ఏమ్మా.. ఎందుకు అంత అజాగ్రత్తగా ఉన్నావు” అని అడిగితే “ఏం జేసేది నాయనా” అంటూ రెండు చేతులూ పైకెత్తింది కన్నళ్లు వరదై పారుతుండగా నోట మాట రాక.
ఆఫీసు వర్క్ కోసం కొన్న ల్యాప్ టాప్, అప్పు చేసి కొన్న డ్రిప్ పైపులు, అప్పు చేసి వేసిన బొప్పాయి తోట, పంట చేతికొచ్చాక ఆరబడ్దామని రాసి పోసిన వడ్లు అన్నీ గంగార్పణమే అయ్యాయి. అటు పులపత్తూరు, తొగురుపేట, మందపల్లె అంత పెద్ద నష్టమూ, ఇటు గుండ్లూరు అంత దారి సౌకర్యమూ లేకపోవడంతో ఈ పది ఇళ్ల గ్రామం సరైన సహాయం అందక అనాధే అయింది.
ఆ తర్వాత వచ్చే సీతారామ పురంకు జరిగిన నష్టం కూడా పెద్ద స్థాయిలోనే ఉనింది. అయితే తన కుటుంబాన్ని పోశించే పశువుల్ని కాపాడాలనే ఆత్రంలో తన ప్రాణాలను కోల్పోయి ముగ్గురు బిడ్డల్నీ తల్లిలేని అనాధగా చేసిన ముప్పై అయిదు సంవత్సరాల స్త్రీ సంఘటన ఆమె తండ్రి నోట వింటుంటే ‘ప్రకృతి ఎంత అందమైనదో అంతకంటే ఎక్కువ కర్కషమైనది’ అనిపించకమానదు.
Read Also: చెయ్యేటి వరద- 3 🌊 🌊 🌊
అన్నమయ్య కట్ట తెగడం అప్పటికే అందరికీ పాకింది. ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు అతి విలువైనవి మాత్రమే సర్దుకుని ఊరికి తూర్పు దిక్కునున్న కొండవైపు సాగిపోతున్నారు. ముందుగా తను ప్రాణానికి ప్రాణంగా పెంచుకునే బిడ్డల్ను తండ్రికి అప్పజెప్పి తను ఎనుముల కొట్టం వైపు సాగిపోయింది. ఏమనిపించిందో ఏమో పోతూ పోతున్నదల్లా ఒక్క నిమిషం ఆగి తన రెండేళ్ల కొడుకును ప్రేమగా ముద్దాడింది. అప్పటికే ఆ తల్లి మనసుకు తెలిసింది కాబోలు తన ముద్దుల కొడుక్కు అదే ఆమె ఇచ్చే చివరి ముద్దు అని.
నీళ్లు అంతకంతకూ పెరుగుతున్నా ఎనుములును తలుగులు విప్పి గడ్డకు తరిమింది. మోకాటి లోతు నీళ్లలో పరుగులాంటి నడకతో పోతోంది. తమ ఇంటిలోని ఆస్థులు, బాండ్లను అయినా జాగ్రత్త చేసుకున్నారో లేదో తెలియదు గానీ తమ కుటుంబంలో భాగమైన పశువుల్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఊరు దాటించాలని చూస్తున్నారు.
అది నచ్చని వరద గంగమ్మ బలిని కోరుకుందా అన్నట్టుగా ఒక్కసారిగా విరుచుకుపడ్డంతో పశువులన్నీ కళ్ళముందే చెల్లాచెదురయ్యి కొట్టుకుపోతుంటే ఆ బాధ తట్టుకోలేక తమ ప్రాణమైనా నిలబెట్టుకుందామని పాతకాలం కట్టకం ఒకటుంటే దానిమిందికి ఎక్కారు పదిమంది దాకా. వాళ్లతో పాటు ఈమె కూడా ఎక్కినింటే సరిపోవును గానీ ఎనుములు ఇంకో నాలుగడుగులు బేచ్చే అయ్యీ బతుకుతాయి తర్వాత తనూ ఎక్కచ్చని అనుకుంది. అదే ఆమె చేసిన పొరపాటు. వాళ్లు రా రా అంటుంటే ఉండు ఉండు వచ్చా అంటూ ఆ వరదలో చిక్కి గింగిరాలు తిరుగుతూ మూడు ఊర్ల అవతల కోనరాజుపల్లె వద్ద తేలింది విగత జీవిగా మారి.
“సమయానికి రైలు కట్ట తెగబట్టి సరిపోయింది గానీ లేకుండా అక్కడ జరగబోయిన విధ్వంసం ఇంకో స్థాయిలో ఉండిండేది” అని ఆ గ్రామస్థులు చెబుతుంటే ప్రకృతిని ప్రకృతే కాపాడుకుంటుందేమో అనిపించింది.