అడవుల మీద ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని వెతుకుతున్న నాకు ఈ ‘చంద్రగిరి శిఖరం’ అనే పుస్తకం కనపడింది. బెంగాళీ నవలకు తెలుగు అనువాదం. రచయిత బిభూతిభూషన్ బంధోపాధ్యాయ అని ఉంది. రచయిత గురించిన సమాచారంలో పథేర్ పాంచాలి, వనవాసి అనే ఇతర నవలలు కూడా రాశాడంట. అప్పటికి నాకు ఈ రచయిత గురించి గానీ అతని శైలి గానీ తెలియదు. ఏమైతే ఏమిలే అని లోగిలి వెబ్ సైట్లో ఆర్డర్ పెట్టా. ఎందుకో మరి బుక్ రాలేదు.
అప్పుడు వెతికా ఈ రచయిత గురించి. సత్యజిత్ రే మెచ్చిన పథేర్ పాంచాలి గురించి, వనవాసి గురించి అద్భుతమైన సమీక్షలు కనపడ్డాయి. అందరి సమీక్షల్లో కామన్ పాయింట్ ఒక్కటే అదే ప్రకృతి వర్ణన. ఇంక ఆగలేకపొయ్యాను. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ లో మళ్లీ ఆర్డర్ చేశా. రాగానే వనవాసి బదులు ముందు ఈ చంద్రగిరి శిఖరాన్నే మొదలుపెట్టా.
కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే శంకర్ అనే బెంగాళీ మద్య తరగతి కుటుంబంలోని సాహసవంతుడైన యువకుడు. తండ్రికి అనారోగ్యం వల్ల తప్పని పరిస్థితుల్లో ఒక జనపనార మిల్లులో గుమాస్తాగా చేరతాడు. పొద్దున్నే గంట కొట్టగానే మిల్లులోకి వెళ్లడం సాయంత్రం అవగానే ఇంటికి రావడం. రోజూ అదే పని. విసిగిపోతాడు.
“రెక్కలు విప్పుకుని స్వేచ్ఛగా ఎగిరిపోవాలి. ఎక్కడో భూమండలం అంచుల్లోకీ, ఈహకందని ప్రమాద తీరాల్లోకీ, సాహస యాత్ర చెయ్యాలి” అంటూ మహా యాత్రికుల గురించి కలలు కంటుంటాడు. అలా తన జిజ్ఞాసను పుస్తకాలు చదివి తీర్చుకుంటుంటాడు.
Also Read : బండేరు కోన.. మరికొన్ని అందాలు
భౌతికంగా వెళ్లలేకపోయినా ఊహల్లో పర్వతాల వెంట విహరిస్తూ సాగుతున్న శంకర్ వేరే స్నేహితుడి ద్వారా ఉద్యోగ నిమిత్తం ఆఫ్రికాలోని ఉగాండాకు చేరతాడు. అడవుల్లో రైల్వే వర్క్. అక్కడి విశాలమైన పంపా గెడ్డి మైదానాల్లో క్రూరమైన సింహాలతో మొదలవుతుంది తొలి పయనం. ఆఫ్రికాలోని మొసాయ్ తెగ కూలీల దగ్గర తొలిసారిగా చూస్తాడు సింహాన్ని సైతం ఎదిరించగలిగే గుండె ధైర్యం గురించి.
సింహం బెడద ఎక్కువ కావడం, వర్షాకాలం మొదలవడంతో ఆ రైల్వే పనులు ఆపేసి శంకర్ ని వేరే రైల్వే స్టేషన్ కు గార్డుగా నియమిస్తారు. పొద్దున సాయంత్రం వచ్చే రైల్లో వచ్చే గార్డు తప్ప నరమానవుడు ఉండడు అక్కడ. అతి భయంకరమైన ఒంటరి పరిస్థితులలోనే సింహాల ఘర్జనని గమనిస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ, అతి భయంకర విష సర్పం బ్లాక్ మాంబాతో పోరాడుతూ గడుపుతుంటాడు.
అలాంటి శంకర్ జీవితంలో చావు బతుకుల మధ్య అడవిలో పడివున్న యూరప్ యాత్రికుడైన అల్వరెజ్ పరిచయం ఒక కొత్త మలుపు. అడవి ప్రయాణంలో, వేటలో, భూగోళ శాస్త్రంలో అపారమైన జ్ఞానం కలవాడు ఆ అల్వరెజ్. గతంలో తను జిమ్ కార్టర్ అనే మరో సాహసవంతుడితో కలిసి రిచ్టర్స్ వెల్డ్వ్ పర్వత సానువుల్లో వజ్రాలను వెతుకుతూ సాగిన భయంకర యాత్ర గురించి శంకర్ చెప్తాడు. ఆ అద్భుత సాహస యాత్ర గురించి విని అక్కడితో ఉద్యోగానికి స్వస్తి చెప్పి అల్వరెజ్ తో కలిసి నడక ప్రారంభిస్తాడు.
Also Read : పెంచల నారసింహుని సన్నిధిలో…Travelogue
ఎటు చూసినా దిక్కులు కూడా గుర్తుపట్టలేని దట్టమైన అడవి. కొండలు. అల్వరెజ్ అంత గొప్ప భూగోళశాస్త్ర మేధావికి కూడా వారం పది రోజుల పాటు తిరిగినా తిరిగి మొదలైన ప్రదేశానికే వచ్చేంత దట్టమైన అడవి.
వారి ప్రయాణంలో ఎన్నెన్నో చూస్తారు. మంచు తుఫానులు, వర్షాలు, జంతువుల దాడులు చివరికి అగ్ని పర్వత విస్పోటనాన్ని కూడా ఎదుర్కొంటారు. అలా వజ్రాల కోసం సాగుతున్న వేటలో ఒకానొక రోజు ప్రపంచంలో ఏ ఒక్కరూ ఇంత వరకూ చూడని బ్యూనిప్ అనే భయంకర జీవి చేతిలో జిమ్ కార్టర్ లాగే అల్వరెజ్ కూడా ప్రాణాలొదిలి దారి తెలియని నట్టి నడడవిలో శంకర్ ను ఒంటరి వాన్ని చేసి మరణిస్తాడు.
అక్కడ్నుంచి మొదలవుతాయి బెంగాళీ యువకుడికి మరిన్ని కష్టాలు. అల్వరేజ్ వాడిన మ్యాప్ ను గుర్తుపట్టి దారి కనిపెట్టడం తెలియక మనసుకు అనిపించిన దారిలో ప్రయాణిస్తాడు. ఆ ప్రయాణంలో మరణం అంచుల వరకూ వెళ్లొస్తాడు. అలా ఒకసారి అనుకోకుండా గుహలోకి వెళ్తాడు. అక్కడంతా కళ్లు పొడుచుకున్నా కానరాని చీకటి. వారం పదిరోజులైనా అంతూ బొంతూ లేని ఆ గుహలోనే తిరుగుతుంటాడు దారి తెలియక. తినడానికి బొద్దింకలు, తేళ్లు కూడా దొరక్క ఆకలికి తాళలేక చివరికి తన బూట్లను కూడా నములుతాడు. ఇక మరణమే అనుకున్న సమయంలో కూడా జీవితంలో ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకూడదని తన గురువైన అల్వరేజ్ సూచనల ప్రకారం గులకరాళ్లను ఆసరాగా చేసుకుని అతి కష్టం మింద ఆ గుహ నుండి బయటపడతాడు.
Also Read : చెయ్యేరు,అన్నమయ్య ప్రాజెక్ట్ ప్రయాణం
అక్కన్నుంచి మళ్లీ సాహసవంతమైన యాత్రలు చేస్తూ రొడీషియా సరిహద్దుల్లోని శాలిస్ బరీ నగరం వైపుగా సాగి, అతి భయంకరమైన కలహారి ఎడారిలోకి ప్రవేశిస్తాడు. దప్పిక, ఆకలితో పాటు రాత్రి పూట చలికి తట్టుకోవడం కష్టమవుతుంది. ఒకసారి ఒళ్లు దాచుకుందామని గుహలోకి వెళ్తే అక్కడ ముప్పైయ్యేళ్లుగా పడి వున్న ఒక అస్థిపంజరాన్ని చూస్తాడు. అతను రాసుకున్న ఉత్తరాన్ని బట్టి ఆ రోజు దారి తెలియక తను ఇబ్బంది పడిన గుహే అల్వరేజ్ తను వెతుకుతూ బయల్దేరిన వజ్రాల గని అని తెలుస్తుంది. కానీ తిరిగి వేళ్లేంత ఓపిక గానీ ఆశ గానీ శక్తిగానీ లేక ఇంటికి చేరాలనే తలంపుతో శాలిస్ బరీ చేరి అక్కడినుండి బొంబాయి చేరడంతో నవల ముగుస్తుంది.
నవల గొప్పతనం గురించి చెప్పాలంటే శంకర్ తో పాటు మనము కూడా నడుస్తాము. శంకర్ ప్రకృతిని ఆస్వాదించినట్టే మనమూ ఆస్వాదిస్తాము అతి సహజంగా, శంకర్ భయపడినట్టే మనమూ భయపడతాము. శంకర్ పోరాడినట్టే మనమూ వీరోచితంగా పోరాడతాము, శంకర్ నీళ్లకూ, ఆకలికి అలమటిస్తుంటే చదువుతున్న మనదీ అదే పరిస్థితి. ఒక పాఠకుడిగా రచయితకు ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిందేమీ ఉండదేమో. అంత గొప్ప రచనా శైలి.
ఇంత మంచి నవలను దోషం లేకుండా ఆనువాదం చేసి తెలుగు ప్రేక్షకులకు అందించిన కాత్యాయని గారికి కూడా అభినందనలు.
Also Read : కోనసముద్రం – కొత్త చరిత్ర