iDreamPost
android-app
ios-app

తన బలహీనతను ఒప్పుకున్న బాబు

  • Published Jan 11, 2022 | 1:41 PM Updated Updated Mar 11, 2022 | 10:24 PM
తన బలహీనతను ఒప్పుకున్న బాబు

ఏదో పార్టీతో పొత్తు పెట్టుకోవడమో, మరేవో సమీకరణలు కలసిరావడమో జరిగితే తప్ప టీడీపీని అధికారంలోకి తేలేని తన బలహీనతను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎట్టకేలకు ఒప్పుకున్నారు. అమరావతిలో టీడీపీ ఈ-పేపర్‌ను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని తెలిపారు. ఇప్పుడు కూడా చిరంజీవి తనతో బాగానే ఉన్నారని చెప్పారు. రాజకీయంలో పోరాటం అనేది ఆటలో ఓ భాగమన్నారు. సినిమా టికెట్ల వివాదంలోకి టీడీపీని కూడా లాగుతున్నారని వ్యాఖ్యానించారు.

టీడీపీకి సినీ పరిశ్రమ సహకరించింది లేదని తెలిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడు, ఈ మధ్య కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు పేర్కొన్నారు. సొంత సిమెంట్ కంపెనీ ఉంది కాబట్టే జగన్ రెడ్డి ఇష్టానుసారం సిమెంట్‌ ధరలు పెంచుతున్నారన్నారు. జగన్‌రెడ్డి పాలనలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని చెప్పారు. ప్రభుత్వం రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేస్తోందని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలోని అన్ని వర్గాల ప్రజలు జగన్‌రెడ్డి పీడిత బాధితులే. రాష్ట్రంలో సంక్రాంతి శోభ లేక కళ తప్పింది. ప్రజా చైతన్యం ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి.

మొత్తానికి అంగీకరించారు..

మొన్నటికి మొన్న పొత్తుల్లేకుండా చాలాసార్లు గెలిచామని గప్పాలు పలికిన చంద్రబాబు తాజాగా చిరంజీవి పార్టీ ఏర్పాటుపై ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎన్టీఆర్‌ దగ్గర నుంచి అధికారాన్ని లాక్కొన్న తర్వాత బాబు నాయకత్వంలోని టీడీపీ ఒక్కసారి కూడా ఒంటరిగా ఎన్నికల్లో పోరాడి గెలవలేదు. ఇదే విషయాన్ని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రస్తావిస్తే కొట్టిపారేసిన చంద్రబాబు ఇప్పుడు తానే నిజాన్ని అంగీకరించినట్టయింది.

2009 ఎన్నికల్లో అశేష ప్రజాదరణ ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ పై ఒంటరిగా పోరాడితే గెలవలేమనే భయంతో చంద్రబాబు టీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టులు, ఇతర పార్టీలతో కలసి మహా కూటమి ఏర్పాటు చేశారు. అయినా ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌ గెలిచి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 156, టీడీపీ 92, చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ 18, టీఆర్‌ఎస్‌ 10, మిగతా పార్టీలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యాయి. అయితే తన పాలనపై నమ్మకంతో ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని భావించిన వైఎస్సార్‌.. ఈ ఎన్నికల్లో తాము జస్ట్‌ పాస్‌ అయ్యామని, డిస్టింక‌్షన్‌ సాధించలేకపోయామని కూడా వ్యాఖ్యానించారు.

సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పెట్టకుంటే ‍అప్పట్లో కాంగ్రెస్‌కు మరిన్ని సీట్లు వచ్చి ఉండేవి అన్న వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకుల నుంచి కూడా వినిపించాయి. అంతేగాని చంద్రబాబు అధికారంలోకి వచ్చే వారని ఎవరూ అనుకోలేదు. ఇలా వర్తమానాన్ని, చరిత్రను మాత్రమే కాక విజయాలను కూడా వక్రీకరించడం చంద్రబాబు నైజమని మరోసారి అర్థమైంది.

 సంక్రాంతి శోభ లేనిది టీడీపీకే..

టీడీపీకి సినిమా పరిశ్రమకు సహకరించలేదు అంటున్న చంద్రబాబు తాను సీఎంగా ఉండగా తన బావమరిది బాలకృష్ణకు సహకరించానని మాత్రం ఎందుకు చెప్పడం లేదని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బెనిఫిట్‌ షోలు, టిక్కెట్ల రేట్లు విపరీతంగా పెంచుకోవడానికి విచ్చల విడిగా చంద్రబాబు అనుమతులు ఇచ్చేవారని అంటున్నారు. బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి చారిత్రక సినిమా అంటూ రాయితీలు ఇచ్చారు. అయితే మరో చారిత్రక సినిమా రుద్రమదేవికి మాత్రం రాయితీలు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. సొంత సిమెంట్ కంపెనీ ఉంది కాబట్టే జగన్ రెడ్డి ఇష్టానుసారం సిమెంట్‌ ధరలు పెంచుతున్నారని ఆరోపిస్తున్న చంద్రబాబు తన హెరిటేజ్‌లో ధరల గురించి ఎందుకు మాట్లాడరనే విమర్శలు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్నారు. వాటి మీద నోరుమెదపని బాబు ఎప్పుడూ భారతీ సిమెంట్‌పై కామెంట్లు చేస్తుండడం గమనార్హం. .

ప్రభుత్వం రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేస్తోందని చంద్రబాబు అడగడం మరీ విడ్డూరంగా ఉంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తెచ్చిన,చేసిన రుణానికి ప్రతి పైసాకు లెక్క ఉంది. అత్యంత పారదర్శకంగా అప్పు చేసిన సొమ్మును ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా 1.21 లక్షల కోట్లు జమ చేసింది. వివిధ శాఖల్లో దాదాపు రెండు లక్షల పర్మినెంట్‌ ఉద్యోగాలను కల్పించింది. 2.50 లక్షల వలంటీర్లను నియమించింది. అనేక పథకాలతో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపిస్తోంది. ఇవన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నా పూర్తి భిన్నంగా విమర్శలు చేయడం చంద్రబాబుకే చెల్లింది. ఆయన హయాంలో తెచ్చిన అప్పులకు మాత్రం లెక్కాపత్రం లేకుండా ఆడంబరాలకు ఖర్చు చేశారు. వాటిపై ప్రశ్నిస్తే ఇప్పటికీ ఎందుకు నోరు విప్పరు అని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సంక్రాంతి శోభ లేనిది ఒక్క టీడీపీకేనని, తమ పార్టీ పాలనలో జనమంతా ఆనందంతో సంక్రాంతి జరుపుకుంటున్నారని వారు అంటున్నారు.