చివర్లో ఉప్పేసి.. పప్పంతా నాదే అన్నట్టు లేదూ..

పొయ్యి వెలిగించి, పప్పు ఉడకబెట్టి, తాలింపు పెట్టి, పక్కనే కూర్చుని దాన్ని కనిపెట్టుకుని వంటంతా పూర్తి చేసాక.. చివర్న వచ్చిన ఓ పెద్దమనిషిని అందులో ఉప్పువేసి పప్పంతా నేనే చేసాను అంటే.. ముందునుంచీ వంట చేస్తున్న వాళ్ళకెలా ఉంటుంది.. ఓ సారి ఊహించుకుంటే మనకే ఒళ్ళు మండిపోద్ది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏడు లక్షల ఇళ్ళను మంజూరు చేసింది. ఇందుకోసం నాలుగువేల కోట్లు సబ్సిడీగా కూడా ఇచ్చింది. కానీ 3.40 లక్షల ఇళ్ళను మాత్రమే మొదలు పెట్టిన చంద్రబాబునాయుడు వాటిని కూడా మౌలిక వసతుల్లేకుండా, అసంపూర్తిగా వదిలేసారు. ఈ 3.40 లక్షల ఇళ్ళను కట్టన కాంట్రాక్టర్లకు దాదాపు 22వేల కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో వారు చేతులెత్తి దణ్ణం పెట్టి పారిపోయారు అప్పట్లో.

అయితే ఇప్పుడు సదరు సగం సగం ఇళ్ళను వెంటనే లబ్దిదారులకు అప్పగించకపోతే.. వారితో కలిసి మేమే వెళ్ళి వాటిని స్వాధీనం చేసుకుంటాం.. అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, వారితో పాటు మరికొన్ని పార్టీల నాయకులు ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసారు. ఈ ప్రకటనను గమనించి పలువురి పరిశీలకులకు పైన చెప్పిన ‘పప్పు’ విషయం గుర్తుకువస్తోందంటున్నారు.

చంద్రబాబు హాయంలో చేసిన అప్పులను ఎలాగూ సీయం వైఎస్‌ జగన్‌ ఇప్పుడు తీరుస్తున్నాడు. రేపో మాపో సగం సగం ఇళ్లను కూడా సర్వ హంగులతో రెడీచేసి లబ్దిదారులకు ఇచ్చే ప్రయత్నంలో ముమ్మరంగానే ఉన్నారు. కోర్టు కేసులు, కరోనా లేకపోతే ఈ పాటికే లబ్దిదారులకు ఈ ఇళ్ళతో పాటు, వ్యక్తిగత స్థలాలు కూడా అందేసి ఉండేవి. ఈ నేపథ్యంలో ఎలాగూ త్వరలో జరగబోయే పెళ్ళికి చంద్రబాబు అండ్‌ పార్టీ ఇప్పట్నుంచే బ్యాండు మేళం మొదలెట్టేసిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మధ్యలో వదిలేసిన వంటను పూర్తి చేసి, లబ్దిదారులకు పంచభక్ష్యపరమాన్నాలతో వడ్డించేందుకు జగన్‌ సిద్ధం చేస్తుండగా, చివర్లో ఇప్పుడు ఉప్పు వేసి మొత్తం ‘పప్పు’మాదే అనేద్దామన్నదే ఇటువంటి కామెంట్లులో అంతర్లీనంగా ఉన్న అర్ధమంటూ వివరిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు 2000 రూపాయలకుపైగా ఖర్చు చేసి అసంపూర్తిగా ఇళ్ళను కట్టిన ఘటన చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందని అధికార వైఎస్సార్‌సీపీ నాయకులు ఎప్పట్నుంచో ఆరోపణలు సంధిస్తున్నారు. అయినప్పటికీ దీనిని గురించి ఏ మాత్రం వివరణ ఇచ్చే ప్రయత్నం ఆ పార్టీ నాయకులుగానీ, చంద్రబాబుగానీ చేసింది లేదు. ఇప్పుడు మాత్రం ఈ ‘పప్పు’ ఎపిసోడ్‌కు తెరలేపారు.

Show comments