చంద్ర‌బాబు మీ పార్టీ నేత మాటే కాదు…పుస‌పాటి వంశ‌స్థురాలి మాట కూడా వినూ..!

రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రంలో చోటుచేసుకున్న మాన్సాస్ ట్ర‌స్ట్‌ వివాదం స‌ద్దుమ‌ణిగింద‌నే స‌మ‌యంలో మ‌ళ్లీ టిడిపి నేత అశోక్ గ‌జ‌ప‌తిరాజు చేసిన వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి ర‌చ్చ‌కెక్కింది. మాన్సాస్ ఆస్తుల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం క‌న్నెసింద‌ని అశోక్ గ‌జ‌ప‌తిరాజు విలేక‌రుల స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌ల‌పై అదే వంశానికి సంబంధించిన, ప్రస్తుత మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్మ‌న్ సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజు కౌంట‌ర్ ఇచ్చారు. ఆమె వాస్త‌వాల‌తో ఇచ్చిన కౌంట‌ర్‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు, చంద్ర‌బాబు వ‌ద్ద స‌మాధానం లేదు. గ‌త టిడిపి ప్ర‌భుత్వం హ‌యంలోనే మ‌న్సాస్ ట్ర‌స్ట్ ఆస్తులు అన్యాక్రాంతం అయ్య‌య‌ని సంచ‌యిత ఆధారాల‌తో బ‌య‌ట‌పెట్టారు.

అయితే ఇదిలా ఉండ‌గా టిడిపి నేత అశోక్ గ‌జ‌ప‌తి రాజుకు మ‌ద్ద‌తుగా ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. ఇది కేవ‌లం అశోక్ గ‌జ‌ప‌తి రాజు మాట‌ల‌నే విని…అదే పుస‌పాటి వంశ‌స్థురాలు సంచ‌య‌త గ‌జ‌ప‌తిరాజు మాట‌ల‌ను క‌నీసం విన‌కుండా చేసిన పోస్టులా ఉంది. ఇద్ద‌రు పోట్లాడుకునే సమ‌యంలో మూడోవారు రెండు వైపుల వాద‌న‌లు వినాలిక‌దా. కోర్టు కూడా అలాగే క‌దా రెండువైపుల వాద‌న‌లు వింటుంది. అయితే చంద్ర‌బాబు అలా కాదు..త‌ప్పు త‌న పార్టీ వారు చేసిన వెన‌కెసుకొచ్చే చ‌రిత్ర ఉన్న చంద్ర‌బాబు, ఇక్క‌డ కూడా అలానే చేశారు. త‌న పార్టీనేత చెప్పిందే క‌రెక్టు అని ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు.

చంద్ర‌బాబు ట్విట్ట‌ర్లో ఏం పెట్టారంటే…‘‘మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఒక ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ. ఆ సంస్థ కింద 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదు. అలాంటిది రూ.1.30 ల‌క్ష‌ల వేల కోట్లకు పైగా విలువజేసే ట్రస్ట్ భూముల మీద కన్నేసి, కాజేయడానికి వైసిపి పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి అశోక్ గ‌జ‌ప‌తిరాజు తపన పడుతున్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలి. ఒక పవిత్ర సంకల్పాన్ని బతికించాలి’’ అని ట్విట్ట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబు సూక్తులు రాసుకొచ్చారు.

అయితే చంద్ర‌బాబు క‌ల్ల‌బొల్లి క‌బుర్లును మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్మ‌న్‌, పుస‌పాటి వంశ‌స్థురాలు సంచయిత గ‌జ‌ప‌తిరాజు తిప్పికొట్టారు. ఆమె మాట్లాడుతూ ‘‘మాన్సాస్‌ లా కాలేజీ క్యాంపస్‌ను ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు ఉచితంగా ఇచ్చేశారు. విద్యార్థులను షెడ్డుల్లోకి మార్చారు. చివరకు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఎలాంటి కుంభకోణంలో ఇరుక్కుందో జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిందే. చంద్రబాబు గారు తన సహచరుడ్ని పొగిడేముందు మా తాతగారు, మా తండ్రిగారి వారసత్వాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో తెలుసుకోవాలి. వాస్తవం ఏంటంటే.. ఇవన్నీ మీకు తెలిసి, మీ ఇద్దరూ (చంద్ర‌బాబు, అశోక్ గ‌జ‌ప‌తి రాజు) కలిసి చేసినవే అని ప్రజలు చెప్తున్నారు’’అని సంచయిత విమర్శించారు.

‘‘ఆనంద గజపతిరాజుగారి పెద్దబిడ్డగా, ఆయన వారసురాలిగా మాన్సాస్‌ బాధ్యతలను చేపట్టానన్న విషయాన్ని చంద్రబాబుగారు తెలుసుకోవాలి. మా తండ్రి చితి ఆరకముందే మీరు, మా బాబాయ్‌ అశోక్‌ గజపతిరాజుకు అనుకూలంగా జీవో జారీ చేశారు’’ అని విమర్శలు గుప్పించారు. ‘‘అశోక్‌ గజపతిరాజుగారి పదవీ కాలంలో తప్పుడు చర్యలు కారణంగా మాన్సాస్‌ ఆర్థికంగా నష్టపోయింది. విద్యాసంస్థల్లో నాణ్యత పడిపోయింది. ట్రస్టు భూములు పరులపాలవుతుంటే ఆ కేసులను వాదించడానికి కనీసం లాయర్‌ను నియమించలేదు. విశాఖ అడిషనల్‌ జిల్లా జడ్జి తీర్పే ఉదాహరణ’’ అని పేర్కొన్నారు.

ఆమె మాట‌ల‌ను క‌నీసం తెలుసుకోకుండా చంద్ర‌బాబు ట్విట్ల‌ర్లో స్వైర విహారం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబు ఎప్పుడు వాస్త‌వాలు తెలుసుకొని స్పందించ‌రు. అడ్డంగా బుక్క‌వుతారు. అందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. తాజా ఇది ఒక ఉదాహ‌ర‌ణే. చంద్ర‌బాబు మీ పార్టీ నేత మాటలే కాదు..ఇత‌రుల మాట‌లు కూడా కాస్తా వినండి అంటూ చంద్ర‌బాబుపై సెటైర్లు మోగుతున్నాయి.

Show comments