iDreamPost
iDreamPost
కుస్తీ పోటీకి దిగితే గోల్డ్ మెడల్ ఖాయం కానీ ఎందుకులే అని వదిలేశాను అన్నట్టు ఉన్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందట కానీ కరోనా కారణంగా జనం రోడ్డెక్కలేదట! దీంతో జగన్ బతికిపోయాడని చంద్రబాబు విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు.
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. జగన్ అడిగిన ఒక్క అవకాశం ప్రజలిచ్చారు.. కానీ, ఇప్పుడు ఆ భ్రమలు తొలగిపోయాయని వ్యాఖ్యానించారు. సంక్షేమం కింద ఇచ్చే దానికంటే ప్రజలపై మోపే భారం మూడు రెట్లు ఎక్కువ ఉందన్నారు. వివిధ సంస్థల విశ్వసనీయత, బ్రాండ్ ఇమేజ్‌ను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు. పొత్తులపై ప్రశ్నలు ఊహాజనితం.. దానిపై స్పందించనని చంద్రబాబు తెలిపారు. 175 నియోజకవర్గాల నేతలతో సమావేశమై ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామన్నారు. ఏసీబీ, సీఐడీలను కంట్రోల్లో పెట్టుకుని అందరినీ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం తాను కూడా విన్నానని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
బాబుకు మాత్రమే సాధ్యం..
చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలతో ప్రజలను పక్కదోవ పట్టించడం, జనాదరణ ఉన్న నాయకులను ప్రజల్లో చులకన చేయడం చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదు.ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ విద్యను చాలాసార్లు ప్రదర్శించారు. దైవాంశ సంభూతుడిగా ప్రజల నీరాజనాలు అందుకున్న టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వల్లే ఆ పార్టీకి ముప్పు ఉందని అటు ఆయన కుటుంబ సభ్యులను, ఇటు జనాన్ని నమ్మించి ఇలాంటి విద్యతోనే పదవీచ్యుతుడిని చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జనరంజక పాలన అందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పఢ్ఢారని ఈ విధంగానే విష ప్రచారం చేశారు. నవరత్నాలతో సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తూ పేదలకు అండగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డిని జనంలో పలుచన చేయడానికి ఇప్పుడు అదే తరహా కుట్రపూరిత ప్రచారం మొదలు పెట్టారు. ప్రజల్లో విశ్వాసం లేకపోయినా, ఓట్లు సంపాదించే శక్తి లేకపోయినా కేవలం మీడియా అండతో రాజకీయాల్లో ఇంత కాలం నెట్టుకురావడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం అయింది. అందుకే ఆయన ప్రజల్లో అభిమానం సంపాదించి కాకుండా అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంటారు.
మరీ హాస్యాస్పదం..
జగన్ పై తిరగబడితే గౌరవానికి భంగం కలుగుతుందని భయపడి జనం సైలెంటుగా ఉంటున్నారని, మరికొందరు గొడవలెందుకని..ఇంకొందరు వలస పోతున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి. నిజంగా జనంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే చంద్రబాబు చెబుతున్న లాంటి కుంటిసాకులు వెతుక్కుంటారా? చంద్రబాబు హయాంలో విపరీతంగా పెంచిన విద్యుత్తు చార్జీలు తగ్గించాలంటూ జనం అప్పుడు రోడ్లు ఎక్కినప్పుడు ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపించినా వెనకడుగు వేయలేదు. బాబు జమానాలోనే అంగన్వాడీ వర్కర్లు న్యాయం కోసం ఉద్యమం చేస్తే గుర్రాలతో వారిని తొక్కించినా వెన్ను చూపలేదు. ప్రభుత్వంపై ప్రజాగ్రహం వస్తే ఆ స్థాయిలో ఉంటుంది. అంతేకానీ బాబు చెబుతున్నట్టు కరోనా వల్లనో, గౌరవానికి భంగం కలుగుతుందనో ఉపేక్షించరు.
అసలు గౌరవానికి భంగం కలిగినప్పుడే ఉద్యమాలు పుట్టుకొస్తాయి. రాష్ట్రం నుంచి భువనేశ్వర్‌కు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని బాబు చెబుతున్నది మరీ బండ అబద్దం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అమలు అవుతున్న సంక్షేమ పథకాల వంటివి తమకులేవని, తాము ఏపీలో ఉండి ఉంటే బాగుండేదని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఒడిశా ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. వాస్తవం ఇలా ఉంటే చంద్రబాబు ఇందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఔను. అలా మాట్లాడకపోతే ఆయన చంద్రబాబు ఎలా అవుతారు?
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం, ఉద్యమాలు నిర్మిస్తామని చెబుతున్న మాటలు పార్టీ కేడర్ లో ధైర్యం నింపే ప్రయత్నమే తప్ప ఆయనకు అంత సీన్ లేదని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. ఎంతసేపు వ్యవస్థలను మేనేజ్ చేయడమే తప్ప ఉద్యమాలను నిర్మించిన చరిత్ర చంద్రబాబుకు లేదని అంటున్నారు. వరుస ఓటములతో కుప్పకూలిపోయిన టీడీపీ నేతలకు ఎన్నికలంటే వెన్నులో వణుకు పుడుతోందని, తమ పార్టీని ఎదుర్కోవడం టీడీపీ తరం కాదని వైఎస్సార్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.